warning:దేశంలో పలు ప్రాంతాల్లో నేడు భారీవర్షాలు

ABN , First Publish Date - 2021-07-13T12:56:42+05:30 IST

రుతుపవనాల ప్రభావం వల్ల కేరళ, ముంబైతోపాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని...

warning:దేశంలో పలు ప్రాంతాల్లో నేడు భారీవర్షాలు

ఆరంజ్ అలర్ట్ జారీ 

న్యూఢిల్లీ : రుతుపవనాల ప్రభావం వల్ల కేరళ, ముంబైతోపాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీవర్షాలతోపాటు గంటకు 20 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, యూపీలలో మరో రెండు గంటల్లో పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి, కన్నూర్, కాసరగడ్ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరంజ్ అలర్ట్ జారీచేశామని ఐఎండీ అధికారులు చెప్పారు. 


ఎర్నాకుళం, త్రిస్సూర్, వయానద్,కోజికోడ్,మళప్పురం జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు. కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ కోస్తా తీరంలో గంటకు 40 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలో వెళ్లరాదని ఐఎండీ అధికారులు సూచించారు. ముంబై,థానే, పాల్ఘార్ ప్రాంతాల్లో మంగళవారం భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. దక్షిణ కొంకణ్ ప్రాంతంలో భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు.భారీవర్షాలతో కొండచరియలు విరిగిపడటం వల్ల చండీఘడ్ -మనాలీ జాతీయరహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. 


Updated Date - 2021-07-13T12:56:42+05:30 IST