ఏడు జిల్లాల్లో కుండపోత

ABN , First Publish Date - 2020-08-15T09:24:20+05:30 IST

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో ..

ఏడు జిల్లాల్లో కుండపోత

ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో జోరు వానలు

ములుగు జిల్లా వెంకటాపూర్‌లో 12 సెం.మీ వర్షం

బలపడనున్న అల్పపీడనంమరో రెండు రోజులు వర్షాలు


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తుండటంతో వరంగల్‌ రూరల్‌, అర్బన్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. గురువారం ఉదయం 8.30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 10.19 సెం.మీ, వరంగల్‌ అర్బన్‌లో 7.47 సెం.మీ, రూరల్‌లో 6.44 సెం.మీ, మహబూబాబాద్‌లో 4.25 సెం.మీ, పెద్దపల్లి జిల్లాలో 3.98 సెం.మీ వర్షపాతం నమోదయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 48.11 సెం.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 59.64 సెం.మీ వర్షపాతం నమోదయింది. ములుగు జిల్లా వెంకటాపూర్‌లో 12.65 సెం.మీ వర్షం కురిసింది. అదే జిల్లాలోని మంగపేటలో 11.58 సెం.మీ, వాజేడులో 9.28 సెం.మీ, తాడ్వాయిలో 8.48 సెం.మీ వర్షపాతం నమోదైంది. వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లిలో 9.6 సెం.మీ, దుగ్గొండిలో 8.43 సెం.మీ, చెన్నారావుపేటలో 6.85 సెం.మీ, నెక్కొండలో 6.8 సెం.మీ.. అర్బన్‌ జిల్లా హన్మకొండ మండలంలో 12 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 8.3 సెం.మీ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో 7.53 సెం.మీ, పలిమెలలో 7.48 సెం.మీ వాన కురిసింది. భద్రాద్రి జిల్లాలో ఆళ్లపల్లి-కొత్తగూడెం మార్గంలోని కిన్నెరసాని పుణ్యవాగు పొంగి వంతెనపై నుంచి నీరు ప్రవహించడంతో ఆ రెండు మండలాల్లోని సుమారు 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


ఆళ్లపల్లి మండలంలోని 10 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 37.3 అడుగులకు చేరింది. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి, భూపాలపల్లి ఏరియాల్లోని సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో బొగ్గు ఉత్పిత్తి నిలిచిపోయింది. ములుగు జిల్లాలో వర్ష బీభత్సంతో మారుమూల ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. గిరిజన గూడేలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో శుక్రవారం పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. 


జూరాలకు పెరిగిన వరద

జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం 1,58,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 వేల క్యూసెక్కుల వరద పెరిగింది. వరద ఉధృతి నిలకడగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 17 గేట్లు ఎత్తి, పవర్‌ హౌస్‌ ద్వారా శ్రీశైలానికి 1,41,869 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆలమట్టి నుంచి 1.33 లక్షల క్యూసెక్కులను నారాయణపూర్‌కు వదులుతున్నారు. నారాయణపూర్‌ నుంచి జూరాలకు 1.49 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.


జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీకి 2.91 లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా 57 గేట్లను ఎత్తి 2.42లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీలోకి మానేరు, ఇతర ప్రవాహాల ద్వారా 36,480 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 11 గేట్లను ఎత్తి 29,700క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మేడిగడ్డలో 8.068టీఎంసీలు, అన్నారంలో 9.208టీఎంసీల నీరు ఉంది.

Updated Date - 2020-08-15T09:24:20+05:30 IST