తిరుపతిలో బీభత్సం సృష్టించిన భారీ వర్షం

ABN , First Publish Date - 2021-11-12T20:01:53+05:30 IST

తిరుపతి: నగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది.

తిరుపతిలో బీభత్సం సృష్టించిన భారీ వర్షం

తిరుపతి: నగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోతతోపాటు బలంగా వీచిన ఈదురుగాలుల ధాటికి జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఇస్కాన్ రోడ్డులోని ఫారెస్టు కార్యాలయం, రుయా, ప్రసూతి, చిన్నపిల్లల ఆస్పత్రి ఆవరణల్లో చెట్ల కొమ్మలు విరిగిపడడంతో కార్లు, ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. మధురానగర్, లక్ష్మీపురం, పద్మావతి పురం, కట్టకింద ఊరు ప్రాంతాల్లో మురికినీటితో కలిసిన వర్షపునీరు ఇళ్లల్లోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులుపడుతున్నారు.


రుయా ఆస్పత్రిలోని ప్రధాన భవనంపై నుంచి నీరు లోపలికి చేరడంతో కొన్నివార్డులు, కార్యాలయ గదులు వర్షపునీటితో నిండిపోయాయి. దీంతో రోగులను వేరే వార్డులకు తరలించారు. తిరుచానూరులోని షికారి కాలనీ వాసులను అధికారులు పునరావాస కేంద్రలకు తరలించారు. చెర్లోపల్లి అండర్ బ్రిడ్జిలో రెండు ఆర్టీసీ బస్సులు నీటిలో చిక్కుకున్నాయి. స్థానిక పోలీసుల సహయాంతో ప్రయాణీకులు బయటకు రాగలిగారు. ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మేయర్ శిరీష, కమిషనర్ గిరీష పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - 2021-11-12T20:01:53+05:30 IST