వణికించిన వర్ష బీభత్సం

ABN , First Publish Date - 2020-10-14T08:54:42+05:30 IST

వరుణుడి బీభత్సం ఉగ్రరూపం దాల్చింది. అక్కడా ఇక్కడా అని కాదు.. తెలంగాణలోని అన్నిచోట్ల మంగళవారం రోజంతా విరామంలేకుండా...

వణికించిన వర్ష బీభత్సం

  • రోజంతా వాన హోరు.. తెలంగాణ గజగజ
  • హైదరాబాద్‌-బెజవాడ రహదారిపై  భారీగానీళ్లు
  • 3 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): వరుణుడి బీభత్సం ఉగ్రరూపం దాల్చింది. అక్కడా ఇక్కడా అని కాదు.. తెలంగాణలోని అన్నిచోట్ల మంగళవారం రోజంతా విరామంలేకుండా వాన దంచికొట్టింది. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి దాకా వర్షం పడింది. వాగులు పొంగిపోర్లుతున్నాయి. రోడ్లు, కూడళ్లు చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్తుకు అంతరాయం కలిగింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షానికి రాజధాని హైదరాబాద్‌ అతలాకుతలమైంది. గ్రేటర్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున 5:30 నుంచి అర్ధరాత్రి దాకా జోరుగా వాన పడింది. మధ్యాహ్నం2:30 నుంచి ఉధృతి మరింత పెరిగింది. 


వాతావరణంలో అనూహ్య మార్పులు రావడంతో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. హైదరాబాద్‌- అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఇనాంగూడ వద్ద హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఉధృతంగా వరద ప్రవహించింది. పలుకార్లు నీట మునిగాయి. రోడ్లుకు ఇరువైపులా మూడు కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. దీంతో  ఆ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. అలాగే భువనగిరి-చిట్యాల, నార్కట్‌ పల్లి-అద్దంకి హేవేల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మేడ్చల్‌, వరంగల్‌ జాతీయ రహదార్లపైనా వరద పోటెత్తింది. హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై గూడూరు-పగిడిపల్లి గ్రామాల మధ్య మోకాలిలోతులో నీళ్లు నిలిచాయి. 




ప్రవాహ ఉధృతికి.. పాపం వారు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మలిశెట్టిగూడలో ఇంటి గోడ కూలిపోవడంతో ఆ సమయంలో టీవీ చూస్తున్న క్యామ సువర్ణ (38), ఆమె కూతురు స్రవంతి (16) మృతిచెందారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్లచెరువు వాగును దాటుతూ  బుచ్చిరెడ్డి (58), బైడ్ల గోవిందు (55) అనే ఇద్దరు గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టినా ఇద్దరి ఆచూకీ ఇంకా దొరకలేదు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెద్దకొండిలో బడికుంట చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన సీహెచ్‌ సత్యనారాయణ మూర్తి (45) అనే వ్యక్తి గండిపడటంతో ప్రవాహంలో కొట్టుకుపోయాడు. పెనుబల్లి రాతోని చెరువు అలుగు దాటుతుండగా ప్రవాహ ఉధృతికి మల్లెల రవి (35) అనే వ్యక్తి, అతడి కుమారుడు జగదీశ్‌ కొట్టుకుపోయారు.  భువనగిరి రూరల్‌ మండలం నాగిరెడ్డిపల్లి వద్ద వరద ఉధృతికి ముగ్గురు గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని నాగులవంచ గ్రామం నుంచి పాతర్లపాడు వెళ్లే రహదారిలో బండిరేవు వాగు ఉధృతికి ఖమ్మం నుంచి పాతర్లపాడు వెళ్లుతున్న కారు కొట్టుకుపోయింది. ఆ కారులో ఉన్న ఏడుగురిని పాతర్లపాడు గ్రామానికి చెందిన యువకులు రక్షించారు. కాగా, వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా వచ్చే 48 గంటలు తెలంగాణ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2020-10-14T08:54:42+05:30 IST