పట్నంలో పన్నుపోటు

ABN , First Publish Date - 2021-06-22T05:11:09+05:30 IST

మునిసిపాలిటీ ప్రజలపై ‘పన్ను పోటు’ పడనున్నది. గతంలో ప్రాంతాన్ని బట్టి నివాస గృహాలు, వాణిజ్య భవనాల అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించేవారు.

పట్నంలో పన్నుపోటు
నర్సీపట్నం వ్యూ

స్థలం, భవనం విలువ వేర్వేరుగా లెక్కింపు

రెండూ కలిపి...మార్కెట్‌ విలువ ఆధారంగా పన్ను మదింపు

ప్రస్తుతం ఉన్న పన్నులతో పోలిస్తే 75 శాతం వరకు పెరుగుదల

ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుందని ఒకేసారి కాకుండా ఏటా 15 శాతం పెంచాలని నిర్ణయం

ఆరేళ్లపాటు పెంచుకుంటూ పోవాలని మౌఖిక ఆదేశాలు

ఆస్తివిలువ ఆధారంగా పన్ను తగ్గిన ఇళ్లకు అమలు చేయని వైనం


నర్సీపట్నం, జూన్‌ 21: మునిసిపాలిటీ ప్రజలపై ‘పన్ను పోటు’ పడనున్నది. గతంలో ప్రాంతాన్ని బట్టి నివాస గృహాలు, వాణిజ్య భవనాల అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం ఆయా ఆస్తుల మార్కెట్‌ విలువ ఆధారంగా నూతనంగా విధించిన పన్నుల వివరాలను అధికారులు విడుదల చేశారు. ఇంతవరకు చెల్లించిన పన్నులతో పోలిస్తే ఈ ఏడాది పది నుంచి 15 శాతం వరకు పెరిగాయి. ఇదే సమయంలో మరో ఐదేళ్ల వరకు ఏటా పన్నులు పెంచుకుంటూ పోనున్నారు. దీనిప్రకారం 2026-27 నాటికి గరిష్ఠంగా 105 శాతం, కనిష్ఠంగా 21 శాతం మేర పన్నులు పెరగనున్నాయి.


రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ఒక్కరోజు మాత్రమే నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో మునిసిపల్‌ ఆస్తి పన్ను సవరణ చట్టాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో నూతన ఆస్తి పన్ను విధానానికి సంబంధించి ఉత్తర్వులు జారీచేసింది. ఇంతవరకు వున్న అద్దె విలువ ఆధారిత ఆస్తి పన్ను స్థానే ప్రస్తుతం వున్న మార్కెట్‌ విలువ ఆధారంగా పన్ను మదింపు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుందని మునిసిపల్‌ అధికారులు ప్రకటించారు. ఆస్తి మార్కెట్‌ విలువ (ఇంటి స్థలం, కట్టడం విలువ వేర్వేరుగా లెక్కింపు) ఆధారంగా నివాస గృహాలకు 0.10 నుంచి 0.20 శాతం, వాణిజ్య భవనాలకు 0.30 నుంచి 0.50 శాతం పన్ను వేయనున్నట్టు వెల్లడించారు. కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆస్తుల విలువను ఏటా విపరీతంగా పెంచేస్తున్న విషయం తెలిసిందే. దీంతో కొత్త విధానంలో ఇళ్ల పన్నులు విపరీతంగా పెరిగిపోయాయి. నర్సీపట్నంలోని వివిధ ప్రాంతాల్లో పాత పన్నులతో పోలిస్తే పది నుంచి 70 శాతం వరకు పెరిగాయి.


ఏటా పన్నుల పెంపు! 


ఇప్పటివరకు వసూలు చేస్తున్న పన్నులతో పోలిస్తే నూతన విధానంలో వసూలు చేసే పన్నులు చాలా అధికంగా ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో కొత్త పన్నుల మొత్తాన్ని ఒకేసారి పెంచకుండా...ఐదేళ్లపాటు ఏటా కొంత పెంచనున్నారు. దీని ప్రకారం 2026-27 నాటికి పన్నులు కనిష్ఠంగా 21 శాతం, గరిష్ఠంగా 105 శాతం పెరగనున్నాయి. ఉదాహరణకు నర్సీపట్నంలో 1136011199 అసెస్‌మెంట్‌ నంబరుగల ఇంటికి  ఇప్పటివరకు రూ.1,432 పన్ను చెల్లిస్తున్నారు. ఈ ఆస్తి ప్రస్తుత మార్కెట్‌ విలువ (స్థలం రూ.3,50,045, భవనం రూ.13,30,172) రూ.16,80,217. కాగా ఆస్తిపై 0.15 శాతాన్ని పన్నుగా లెక్కిస్తే రూ.2,520 అయ్యింది. అంటే సుమారు 75 శాతం మేర పన్ను పెరిగింది. ఒకేసారి ఇంత భారీగా పన్ను పెరిగితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో...పైన పేర్కొన్న అసెస్‌మెంట్‌ నంబర్‌లోని భవనానికి ఏటా 15 శాతం చొప్పున ఐదేళ్లపాటు పెంచుకుంటూ పోయారు. ఆరో ఏడాది రెండు శాతం పెంచారు. మొత్తం మీద 2026-27లో భవన యజమాని రూ.2,938 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


పన్నుల మదింపులో ద్వంద్వ వైఖరి


ఆస్తి పన్ను సవరణ చట్టం అమలులో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. ప్రస్తుతం వున్న పన్ను కంటే ఆస్తి విలువ ఆధారిత పన్ను ఎక్కువ వుంటే దానిని అమలు చేస్తున్న ప్రభుత్వం...ఇదే సమయంలో ప్రస్తుతం వున్న పన్ను కన్నా ఆస్తి విలువ ఆధారిత పన్ను తక్కువ వుంటే దానిని మాత్రం అమలు చేయడం లేదు. పైగా పన్నులను మరింత పెంచేసింది. ఉదాహరణకు నర్సీపట్నంలో అసెస్‌మెంట్‌ నంబర్‌ 1136011630లో వున్న ఇంటికి ఇంతవరకు రూ.822 పన్ను వసూలు చేశారు. ఈ ఆస్తి ప్రస్తుత మార్కెట్‌ విలువ (స్థలం రూ.1,04,917, భవనం రూ.3,98,683) రూ.5,03,600. ఈ ఆస్తిపై 0.15 శాతాన్ని పన్నుగా లెక్కిస్తే రూ.755 అయ్యింది. అంటే రూ.67 తగ్గింది. కానీ అధికారులు ఆ మేరకు తగ్గించకపోగా మరింత పెంచేశారు. ఈ ఏడాది మరో 10 శాతం పెంచి రూ.904 పన్ను విధించారు. రానున్న ఐదేళ్లు ఏటా 2 శాతం చొప్పున పెంచుకుంటూ 2026-27నాటికి రూ.998 చేశారు. అంటే ఆరేళ్లలో సుమారు 33 శాతం (ఆస్తి విలువ ఆధారంగా) పన్ను పెరుగుతుంది.

Updated Date - 2021-06-22T05:11:09+05:30 IST