పొట్లం : సత్యమే సౌందర్యం.. దాని వేషం విచిత్రం

ABN , First Publish Date - 2022-01-24T10:16:45+05:30 IST

ఏమిటో తెగ వెదుక్కుంటున్నాను! కాని నేను వెదుక్కుంటున్నది ఏమిటో?

పొట్లం : సత్యమే సౌందర్యం.. దాని వేషం విచిత్రం

1. 

ఏమిటో తెగ వెదుక్కుంటున్నాను! కాని నేను వెదుక్కుంటున్నది ఏమిటో? నుదుటి లోపల పురుగులా తిరుగుతున్న ప్రశ్న.ఏం వెదుక్కుంటున్నానో అదే తెలీదు, ఇక వెదుక్కుంటున్నది దొరికేదెప్పుడు? తవ్వడానికి, ఎత్తిపోయడానికి కాయలు గాచిన చేతిలో పరికరాలై కేవలం కొన్ని పదాలు కొన్ని పదునైనవీ, కొన్ని మొద్దుబారినవి. మంచుమైదానాల్లో వణుకుతూ సువర్ణాన్వేషులు తమ శోధన స్థలాలకు సరిహద్దులు గీసినట్లు ఇదిగో, ఇది నాది అని గోడలు కడతాను పదును కోరల కుక్కలను కాపలా పెడతాను. నాలుగ్గోడల మధ్య నా సహఖైదీలను కూడా కరకు కళ్ళతో పరుష వాక్కులతో బెదిరిస్తాను.

ఆక్కడొక మూల పూర్తిగా నాదని ప్రకటిస్తాను. కిటికీ లోంచి ఎండపొడలతో పాటు మరేదో నా మూలకు వస్తుంది. ఏవేవో బొమ్మలు గీస్తుంది. కొన్ని బొమ్మలను ఏరి నీకు చూపిస్తాను. చూపించి, నీ మొహంలో ఆశగా చూస్తాను నా స్వప్నాల అర్థాల్ని నాకు తెలిపే నీడలు నీ కళ్ళలో దొరుకుతాయేమో నని. నువ్వూ మరికొందరు నా గొడవ చూడలేక జోరీగ పాట వంటి నా ఫిర్యాదులు వినలేక ఎగిరే పక్షి మీద తువ్వాలు విసిరి ఆపినట్లు నా మీద దుశ్శాలువాలు విసురుతారు. సిల్కు వల లోపల చీకట్లో మునిగిపోతాను. ఊమ్మేసే ఓపిక లేక దగ్గు గల్లను మింగినట్లు నా కువకువలను నా గొంతులో మింగేస్తాను. నాకేం కావాలో నాకు ఎప్పటికీ తెలీదు. నీ నుదుటి మీద డాక్టరు పట్టాలు, సాంఘిక శాస్త్రాల బిరుదాంకితాలు, పగిలిన డిండిమభట్టు-కంచుఢక్కలు, ప్రగతిశీల, విప్లవాది పంచవర్ణాక్షరాలు అవి కూడా ఏమీ చెప్పవు నీ వెదుకులాట నీ సొంతం అనే ఒక కఠోర సత్యాన్ని తప్ప.ఎవర్ని వాళ్ళం చదువుకోలేం ఎవరి వీపు వాళ్ళం చూసుకోలేం ఎవరి సర్జెరీ వాళ్ళం చేసుకోలేం చదువుకోడం, తెలుసుకోడం ఎంత కష్టమైనా, తప్పదు నా మొహం నేను దిద్దుకోడానికి నీ కంటిలో నా ప్రతిబింబం ఒక్కటే నాకు ఆధారం.


2.

ఒక్కో రోజు నేను దయ్యంతో రమిస్తుంటాను. నాకు రతికేళీ రహస్యాలు తెలియవు, అంతా మొరటు సరసం. ఉన్నట్టుండి నాకొక పద్యం ఎదురవుతుంది.ఠాట్‌, ఒక్క పద్యం కాదు, పూర్తి కావ్యం, జీవితం. ఇక ‘అయిపోతుంద’ని నా భయం. ఊర్థ్వ రేతస్కుడనవడం ఎలాగా అని దొరికిన ప్రతి గురువును అడుగుతాను. జరా విజయ రహస్యాలను ఏ యయాతీ చెప్పడు పురాణాలు పురాణాలుగా, తర్కబద్ధ ఉపనిషత్తులుగా నెత్తి మీద జడలు కట్టిన స్మృతులుగా ఆనంతంగా సాగలాగబడిన ఓంకారంలా ఒక కోరిక; ఎంతకీ ఒడవని ధ్యానం. రోజు ఒక్కటే వందలు, వేలు, లక్షలు, కోట్ల గంటలు ఇది ఒడవదు పోనీ నన్ను నేను ప్రేయసికి ఇచ్చేసుకుంటే? రెప్పలు విడిన తన తడి కన్నులలో నా మొహం చూసుకుంటే? ఏమో, చెప్పలేను!


3. 

నాకేం కావాలో చెప్పడం నాకు రాదు. ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్న రాయలసీమ పిల్లోన్ని, నా నీళ్లు నాకు కావాలని నీకు తెలిసేలా చెప్పలేను. ఎక్కడెక్కడి నుంచో ఎత్తుకొచ్చిన కడవలు ఇల్లు చేరకముందే చేజారి పగిలిపోతాయి పరదేశీ! నువ్వు నాకేమీ మాట ఇవ్వలేదు వసూలు కావలసిన బకాయిలు లేవు, పో, వెళిపో నాకేం కావాలో అది ఇచ్చే వాళ్ళెదురైనపుడు నాకేం కావాలో నాకు తెలుస్తుంది.


4.

ఐనా, ఇప్పుడు ఏమీ లేకపోయినా ఏదో ఉందని అనిపించాలి. అదే వాస్తవం. ఎందుకంటే ఏదో ఉందని అనిపించడమే గాని ఏమీ లేకపోవడమే ఇప్పుడున్నది. ఉన్న దాన్నే అందంగా పొట్లం కట్టాలి. ఉన్మత్త ప్రేమికులు ప్రేమలో ఉన్నప్పుడు అరిచే అరుపుల్లోంచి మూల్గే మూల్గుల లోంచి రాలిపడిన వాతెర తుంపర్లను రంగు రిబ్బన్లకు కూర్చి కట్టాలి, గిఫ్ట్‌ ప్యాక్‌ మీద పువ్వు ల్లాగ.


5. 

ఏదో యుద్ధంలో ఉన్నాను. నాకెవ్వరూ సైనిక ఉద్యోగమివ్వలేదు. ఊర్నే, ఒకరోజు బజారులో ఏదో కొట్లాట విని, ఇంట్లో మూలన పడి ఉన్న పట్టుడుకట్టె పట్టుకుని సరదాగా వెళ్లిపోయాను. అప్పుడు అమ్మకు చెప్పను కూడా చెప్పలేదు. ఆమె ఇంట్లో ఏ మూలన ఎక్కడుందో ఏమో. నా నిష్క్రమణను ఆమె చూసినట్టు లేదు. ఉన్నట్టుండి బజారు పోరు ఊరిదయ్యింది. ఊరి గలాటా దేశం కోసం యుద్ధమయింది. ఉన్నట్టుండి, మూడవదో ముప్పయ్యవదో ప్రపంచ మహా సంగ్రామం అయిపోయింది. సైనికుడిగా నాకెవరూ ఉద్యోగమివ్వలేదు. ఇంట్లో పిల్లలు చెప్పుకోడానికి తగిన ఒక వీరగాథ కోసం సంతలో దోపిడి కావడానికి తగిన అందమైన ట్యాగ్‌ కోసం అసలెందుకు ఇదంతా... అని అరికాలిలో విరిగిన తుమ్మ ముల్లును తీసుకునే ఒక పిన్నీసు స్పర్శలో హాయి కోసం వెళ్లిపోయాను, ఇంకా వెళ్లిపోతూనే ఉన్నాను. ఒక డాలు ఒక బల్లెం పట్టుకున్న భటుడిగా శతఘ్నిగా, యుద్ధశకటంగా, బంకర్‌బస్టర్‌గా చాలచాల చాలచాల అవతారాలెత్తాను. ఇప్పుడెందుకో అమ్మ గుర్తు కొస్తోంది. వంటగదిపొగల్లో ఎప్పుడూ అస్పష్టంగా ఉండిన అమ్మ ఇప్పుడెందుకో చాల స్పష్టంగా కనిపిస్తున్నది. అమ్మకు చెప్పడం కోసం అని వెనక్కు వెళ్లిపోదామనిపిస్తున్నది. ఇదిగో ఇప్పుడే వచ్చి గుండెలో దిగుతున్న ఈ తూటాను తప్పించుకోగలిగితే... ... ఇక నేరుగా అమ్మ దగ్గరికే.... 

 హెచ్చార్కె

Updated Date - 2022-01-24T10:16:45+05:30 IST