Oct 14 2021 @ 22:08PM

దసరా స్పెషల్‌గా అంటోన్న ‘హలో జాను’ టీమ్

మనోజ్ గోపాల్ కృష్ణ, శ్రీ ఇందు హీరోహీరోయిన్లుగా ఎస్. ఎమ్. క్రియేషన్స్ మరియు సుముధ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘హలో జాను’. ‘సంఘ సంస్కర్త భగవత్ రామానుజాచార్యులు’, ‘మనం మారాలి’, ‘చిన్నిగుండెల్లో ఎన్ని ఆశలో’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మంజుల సరోజు ఈ చిత్రానికి దర్శకురాలు. విజయదశమి కానుకగా అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించి.. సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లుగా చిత్రయూనిట్ తెలిపింది.

ఈ సందర్భంగా దర్శకురాలు మంజుల సరోజు మాట్లాడుతూ.. ‘‘హలో జాను చిత్ర షూటింగ్‌ని దసరా సందర్భంగా అక్టోబర్ 15 నుండి స్టార్ట్ చేస్తున్నాము. సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణను పూర్తి చేయనున్నాం. రొమాన్స్ అండ్ కామెడీతో ప్రేక్షకులకు కనువిందు చేసేలా ఈ సినిమా ఉంటుంది. మనోజ్ గోపాల్ కృష్ణ, శ్రీ ఇందుతో పాటు మరో ప్రముఖ హీరోయిన్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఎస్.ఎమ్ క్రియేషన్స్, సుముధ క్రియేషన్స్ సంయుక్తంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని చిత్రీకరించేందుకు సపోర్ట్ అందిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేయనున్నాం’’ అని తెలపగా.. హీరో మనోజ్ గోపాల్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘నేను తెలుగువాడినే. బెంగుళూరులో ఉంటాను. కొన్ని కన్నడ సినిమాలలో కూడా చేశా. ఇప్పుడు తెలుగులో ‘హలో జాను’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాను. నేను హీరోగా మారడానికి, ఈ వృత్తిని ఎన్నుకోవడానికి స్పూర్తి పవన్ కల్యాణ్‌గారు. ఆయన స్టైల్, యాటిడ్యూట్ వంటివన్నీ చూశాక నేను కూడా నటుడిని అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆయనకు పెద్ద అభిమానిని. ఈ సినిమాకు సంబంధించి ఓ లిరికల్ సాంగ్‌ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయడం జరిగింది. అది పవన్ కల్యాణ్‌గారి దగ్గరకు వెళుతుందని ఆశిస్తున్నాను. అలాగే ప్రేక్షకులు కూడా ఈ సాంగ్ చూసి ఆశీర్వదించాలని కోరుతున్నాను. ‘హలో జాను’ లవ్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్. దసరా కానుకగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతున్నందుకు సంతోషంగా ఉంది..’’ అని అన్నారు.