ప్రసూతి సేవలు మెరుగుపరచాలి

ABN , First Publish Date - 2020-05-24T10:13:20+05:30 IST

ప్రసూతి సేవలను మరింత మెరుగుపర్చాలని రాష్ట్ర ప్రసూతి వైద్య సేవల నోడల్‌ అధికారి డాక్టర్‌ సుజాత అన్నారు.

ప్రసూతి సేవలు మెరుగుపరచాలి

ఒక్క కేసు కూడా హైదరాబాద్‌కు రెఫర్‌ చేయొద్దు

24 గంటలు హెల్ప్‌ డెస్క్‌ ఉండేలా చూడాలి

అమ్మఒడి వాహనాల నిర్వహణపై అసంతృప్తి

వైద్య, ఆరోగ్య శాఖ సమన్వయంతో ప్రసూతి సేవలపై సమీక్షించాలి

రాష్ట్ర ప్రసూతి సేవల నోడల్‌ అధికారి సల్వా సుజాత


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం) మే 23 : ప్రసూతి సేవలను మరింత మెరుగుపర్చాలని రాష్ట్ర ప్రసూతి వైద్య సేవల నోడల్‌ అధికారి డాక్టర్‌ సుజాత అన్నారు. రాష్ట్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు శనివారం ఆమె మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని సందర్శించారు. ముందుగా ఆసుపత్రిలోని లేబర్‌ గదిని పరిశీలించారు. అక్కడ అందిస్తున్న సేవలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎంసీహెచ్‌ ఆసుపత్రిని సందర్శించగా, అక్కడ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 24 గంటలు హెల్ప్‌లైన్‌ అందుబాటులో ఉంచాలని, ఏ క్షణంలో ఏం జరిగినా వైద్యసిబ్బంది సిద్ధంగా ఉండేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. అయితే ఎంసీహెచ్‌ భవనంలోకి కొత్తగా వచ్చామని, ఇంకా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయలేదని, 24 గంటల హెల్ప్‌ లైన్‌ నంబర్‌ లేబర్‌ రూంలో ఏర్పాటు చేశామని గైనిక్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ రాధ అధికారి దృష్టికి తెచ్చారు.


ఇతర జిల్లాల నుంచి ఎక్కువ మొత్తంలో డెలీవరీ కేసులు వస్తున్నాయని, ఒక్క నెలలోనే 691 ప్రసవాలు జరుగగా, అందులో 227 కేసులు ఇతర జిల్లాల నుంచి వచ్చినట్లు రికార్డుల ద్వారా గుర్తించారు. ఏఏ జిల్లాల నుంచి ఎన్ని కేసులు వచ్చాయి? ఏఏ కారణాలతో వచ్చాయి? అందుకు సంబందించిన నివేదిక కావాలని ఆమె ఆదేశించారు. ఒక్క కేసు కూడా హైదరాబాద్‌ రెఫర్‌ చేయొద్దని, అన్ని ప్రసవాలు జనరల్‌ ఆసుపత్రిలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని, హైరిస్కు కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. 


జిల్లాలోని అమ్మఒడి వాహనాల నిర్వహణపై నోడల్‌ అధికారి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె ఎంసీహెచ్‌ పరిశీలనకు వస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన 102 వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో కాలం చెల్లిన హెల్త్‌ కిట్‌, మందులు ఉండడంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎన్‌సీలు, తిరిగిన ట్రిప్పులకు సంబంధించిన వివరాలు సమర్పించాలని 102 డ్రైవర్‌ను ఆదేశించారు. ప్రతి గర్భిణీ నాలుగు ఆంటినెంటల్‌ చెకప్‌లకు 102 వాహనాలను వినియోగించుకోవాలని, కాన్పు కోసం 108 వాహనాలను వాడుకోవాలని ఆదేశించారు.


అయితే కోట్ల రూపాయలు ఈ వాహనాలకు ఇస్తున్నా, నిర్వహణ సరిగ్గా లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. పరిశీలన అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ చాంబర్‌లో ప్రసూతి సేవలపై అధికారులతో సమీక్షించి, కొన్ని సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాంకిషన్‌, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కృష్ణ, గైనిక్‌ హెచ్‌వోడీ రాధ, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ జరీనా, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్లు జీవన్‌, నర్సింహరావు, ఆర్‌ఎంవోలు వంశీకృష్ణ, వకుల, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-24T10:13:20+05:30 IST