సాయం ఈ నెల నుంచే

ABN , First Publish Date - 2021-04-10T07:09:59+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నెల నుంచే గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థిక సహాయం, బియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.

సాయం ఈ నెల నుంచే

  • నెలకు రూ.29 కోట్లు.. 3,625 టన్నుల బియ్యం
  • ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బందికి పంపిణీ
  • పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్‌
  • టీచర్ల జాబితా ఇచ్చే బాధ్యత పాఠశాలలదే
  • నేటి నుంచి ఈ నెల 15లోగా సమర్పించాలి
  • 20 నుంచి 24 మధ్య నగదు పంపిణీ: సబిత
  • దంపతులు టీచర్లయితే.. ఇద్దరికీ సాయం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నెల నుంచే గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థిక సహాయం, బియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో దాదాపు 1.45 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని.. వారికి ప్రతి నెల రూ.2వేలు చెల్లించేందుకు రూ.29 కోట్లు, 25 కిలోల బియ్యం కోసం రూ.13.57 కోట్ల విలువైన 3,625 టన్నుల బియ్యాన్ని సిద్ధం చేసినట్లు వివరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు రూ.42.57 కోట్ల ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి బీఆర్కే భవన్‌ నుంచి 33 జిల్లాల కలెక్టర్లతో మంత్రి గంగుల కమలాకర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. లబ్ధిదారులను రేషన్‌ షాపులవారీగా గుర్తించి నగదు, బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. 


ఏప్రిల్‌ నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యే వరకు బియ్యం, నగదు పంపిణీ చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు గంగుల తెలిపారు. కాగా, ప్రైవేటు టీచర్లకు సాయం అందజేయడంపై ప్రభుత్వం మార్గదర్శకాలిచ్చింది. ఈ వివరాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ప్రైవేటు ఉపాధ్యాయుల జాబితాను అందించాల్సిన బాధ్యత పాఠశాలలదే అని స్పష్టం చేశారు. వీటిని పరిశీలించి ఈ నెల 20-24 తేదీల మధ్య లబ్ధిదారుల బ్యాంక్‌ అకౌంట్లలో రూ.2 వేల చొప్పున జమ చేస్తామని తెలిపారు. 21-25 తేదీల్లోగా కుటుంబానికి 25కిలోల సన్న బియ్యాన్ని రేషన్‌ షాపుల ద్వారా అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమయ్యే వరకు ఈ పథకం అమలవుతుందని ప్రకటించారు. గుర్తింపులేని పాఠశాలలు కూడా టీచర్ల వివరాలను సమర్పించవచ్చని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పాఠశాలలు అందించే జాబితాలో అనర్హులు ఉంటే.. వారిని గతంలో కేటాయించిన యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ ఫర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌(యూడైస్‌) నంబర్ల ఆధారంగా గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ నంబర్లు లేని పక్షంలో గత ఏడాది బోధన, బోధనేతర సిబ్బంది హాజరు పట్టికను పరిశీలిస్తామన్నారు. అనర్హులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.


ఇవీ మార్గదర్శకాలు.. 

శనివారం నుంచి ఈ నెల 15 లోపు ప్రైవేటు పాఠశాలలు తమ ఉపాధ్యాయుల వివరాలను ఎంఈవో, డీఈవోలకు సమర్పించాలి. 

ప్రొఫార్మా-ఏ ఉపాధ్యాయులకు సంబంఽధించినది. ఇందులో బోధన, బోధనేతర సిబ్బంది వివరాలు, ఆధార్‌ నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు, స్థానిక రేషన్‌షాపు వివరాలు తెలియజేయాలి.

ప్రొఫార్మా-బీ పాఠశాలకు సంబంధించింది. ఇందులో పాఠశాల పేరు, చిరునామా, విద్యార్థుల సంఖ్య, బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్య వంటి వివరాలు అందజేయాలి. ఈ వివరాలను ఎంఈవో, డీఈవో, జిల్లా కలెక్టర్‌ ఈనెల 16న పరిశీలిస్తారు.

17-19 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో పరిశీలన, డేటా సేకరణ కార్యక్రమం ఉంటుంది. 

20-24 తేదీల్లో ఉపాధ్యాయుల ఖాతాల్లో నగదు జమచేస్తారు. 

21-25 తేదీల్లో ఉపాధ్యాయులు స్థానిక రేషన్‌ దుకాణాల ద్వారా 25 కేజీల సన్న బియ్యాన్ని పొందవచ్చు.

ఒక ఉపాధ్యాయుడు రెండు, మూడు పాఠశాలల్లో పనిచేస్తే.. ఏదైనా ఒక స్కూల్‌ నుంచి నమోదు చేసుకోవాలి. 

దంపతులిద్దరూ ప్రైవేటు ఉపాధ్యాయులైతే ఇద్దరికీ రూ.2వేల చొప్పున ఇస్తారు.

Updated Date - 2021-04-10T07:09:59+05:30 IST