Advertisement
Advertisement
Abn logo
Advertisement

మూడు నిముషాల్లో మాయమవుతున్న వేలకొద్దీ లగ్జరీ కార్లు...రంగంలోకి దిగిన పోలీసులు... నిందితుని తెలివితేటలు చూసి షాక్!

కరోనా వైరస్ ప్రవేశించిన తరువాత మనుషుల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. సోషల్ డిస్టెన్స్‌కి ప్రాధాన్యత పెరిగింది. చాలమంది ద్విచక్రవాహనాలకు బదులు కార్లను కొనుగోలు చేసి, వాటిని వినియోగిస్తున్నారు. ఈ నేపద్యంలో కార్లకు మరింత డిమాండ్ పెరిగింది. దీనిని ఆసరా చేసుకున్న కొంతమంది ప్రబుద్ధులు కార్ల చోరీకి పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలు ఇటీవలి కాలంలో మరింతగా పెరిగిపోయాయి. ఢిల్లీ పోలీసులు తాజాగా ఢిల్లీ, ఎన్సీఆర్‌లో వెయ్యికిపైగా కార్లను చోరీ చేసిన ముఠా నాయకుడు దీపక్ రాణాను అరెస్టు చేశారు. ఇతను వెయ్యికిపైగా కార్లను చోరీచేసి, అమ్మేశాడని పోలీసులు తెలిపారు. సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన దీపక్ రాణా విలాసవంతమైన జీవితం కోసం నేరాలబాటపట్టాడు. కొద్దికాలంలోనే దేశంలోని పలు రాష్ట్రాల పోలీసుల కాంటాక్ట్ లిస్టులో చేరిపోయాడు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలంగా ఢిల్లీ, ఎన్సీఆర్‌లో విలాసవంతమైన కార్ల చోరీలు పెరిగిపోయాయి. 

ఇలా చోరీకి గురవుతున్న కార్లు యూపీలోని మీరఠ్ వైపు వెళుతున్నట్టు సీసీటీవీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసుల బృందమొకటి మీరఠ్ వైపు తరలివెళ్లింది. కార్ల దొంగను పట్టుకునేందుకు వారు చాలా రోజులు ప్రయత్నించి ఎట్టకేలకు నిందితుడు దీపక్ రాణా జాడ తెలుసుకున్నారు. దీపక్ రాణాను మీరఠ్ నుంచి సిమ్లా వరకూ వెంబడించారు. ఎట్టకేలకు సిమ్లాలోని ఒక హోటల్‌లో అతనిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసుల విచారణలో దీపక్ రాణా తాను చేసిన చోరీల గురించి తెలిపాడు. సాఫ్ట్‌వేర్ ఆపరేటెడ్ అయిన ఈ లగ్జరీ కార్ల లాక్‌ను ఒక ట్యాబ్ సాయంతో మూడు నుంచి నాలుగు నిముషాల్లో ఓపెన్ చేస్తాడు.  ఆ తరువాత ఇతని ముఠాలోని సభ్యుడు మోంటీ ఈ కార్లను ఢిల్లీ నుంచి మీరఠ్‌కు తరలిస్తాడు. వాటిని అక్కడ షోయబ్ మాలిక్ అనే వ్యక్తి రిసీవ్ చేసుకుని, ఇతరులకు విక్రయిస్తుంటాడు. కాగా ఈ కార్ల చోరీ ముఠా ఇప్పటివరకూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాలో ఈ కార్లను విక్రయించింది. ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు దీపక్ రాణా ఆటకట్టించగలిగారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement