ప్రాణత్యాగం చేసిన పోలీసు కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి

ABN , First Publish Date - 2021-10-22T06:15:21+05:30 IST

అత్యంత సంక్లిష్ట సమయంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసి అమరులైన పోలీసు కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.

ప్రాణత్యాగం చేసిన పోలీసు కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి
కాకినాడలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి కన్నబాబు, ఎంపీలు బోస్‌, వంగా గీత..

కాకినాడ క్రైం, అక్టోబరు 21: అత్యంత సంక్లిష్ట సమయంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసి అమరులైన పోలీసు కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గురువారం కాకినాడ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరులైన పోలీసులకు మంత్రి కన్నబాబు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, ఎంపీ వంగా గీత, జిల్లా కలెక్టర్‌ సి. హరికిరణ్‌లు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ 1951లో కేంద్ర రిజర్వు పోలీసు పార్టీ లడక్‌ వద్ద దేశ సరిహద్దు సంరక్షణ విధుల్లో చైనీస్‌ అంబుష్‌ పార్టీలో చిక్కుకుని పోలీసులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. అప్పటి నుంచి పోలీసు మృతవీరుల సంస్మరణ కోసం దేశవ్యాప్తంగా వీరికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపడం జరుగుతోందన్నారు. విధి నిర్వహణలో కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశం, ప్రజల ఆస్థి, ప్రాణ నష్ట నివారణ, గంజాయి, నాటుసారా, అసాం ఘిక కార్యకలాపాల నిర్మూలనలో పోలీసుల సేవలు అమోఘమన్నారు. విధి నిర్వహణలో ప్రతికూల పరిస్థితుల్లో సైతం అనేక ఒత్తిడులను సమర్థంగా ఎదుర్కొని పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని కితాబిచ్చారు. పోలీసుల సంక్షేమ కోసం సీఎం జగన్‌ ఫ్రెండ్లీ పోలీస్‌, వీక్లీ ఆఫ్‌లు ప్రకటించారన్నారు. ఏపీలో మావోయిస్టుల బారిన పడి 11 మంది పోలీసులు మృతి చెందారని, వీరి కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. కొవిడ్‌తో మృతి చెందిన పోలీసుల తరపున వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొప్పున 13 మందికి పరిహారం చెక్కులు అందజేశారు. తర్వాత పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి భానుగుడి సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అలాగే ముందుగా కమాండర్‌ ఎం.నరసింహమూర్తి నేతృత్వంలో ప్రత్యేక పోలీస్‌ స్మృతి పరేడ్‌ నిర్వహించారు. 



Updated Date - 2021-10-22T06:15:21+05:30 IST