ఆపదలో ఆపన్నహస్తాలు

ABN , First Publish Date - 2021-05-11T15:02:07+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితులు..

ఆపదలో ఆపన్నహస్తాలు

కొవిడ్‌ బాధితులకు సాయం 

మృతదేహాలకు అంతిమ సంస్కారాలు 

మానవత్వం చాటిన పోలీసులు, స్వచ్ఛంద సేవకులు


ముసునూరు: కరోనా విపత్కర పరిస్థితులు.. మనిషిని మనిషి పలుకరించేందుకు కూడా భయపడుతున్న రోజులు.. గతంలో పక్కవాడు అనారోగ్యంతో ఉంటే దగ్గరుండి ఆస్పత్రికి తీసుకెళ్లేవారు. ప్రస్తుతం అనారోగ్యం అంటే ఆమడ దూరం పోతున్నారు. వైరస్‌ సోకి బాధపడేవారు కొందరైతే, మృతిచెంది అంత్యక్రియలకూ నోచుకోలేని కుటుంబాలెన్నో.. కరోనాతో మరణించారంటే ఆలు అయినవారు.. ఆప్తులు ఎవరూ ఆ కుటుంబం వైపు కన్నెత్తి చూడని దుస్థితి. ఈ పరిస్థితుల్లో పోలీసులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు కరోనా బాధితులకు తమ వంతు సాయం చేయటం, మృతిచెందితే మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేస్తూ మానవత్వం ఇంకా మిగిలే ఉందని చాటి చెబుతున్నారు.


ముసునూరు మండలం గోపవరం చెందిన పల్లాని సత్యనారాయణ (70)కు పది రోజుల క్రితం కరోనా సోకగా, ఇంటివద్దే చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందగా, మృతదేహాన్ని కనీసం బయటకు తీసుకురావటానికి కూడా ఎవరూ లేని నిస్సహాయ స్థితిలో ఆ కుటుంబం ఉంది. రెండు రోజుల క్రితమే భార్య కరోనాతో మృతి చెందగా, కుమారుడు వైరెస్‌ కోరల్లో చిక్కుకుని విజయవాడలో చికిత్స పొందుతున్నాడు. ఈస్థితిలో బంధువులు కూడా మరణించిన సత్యనారాయణ మృతదేహాన్ని ఖననం చేసేందుకు ముందు కు రాలేదు. విషయం తెలుసుకున్న ముసునూరు ఎస్‌ఐ కె రాజారెడ్డి, సిబ్బందితో వెళ్లి పీపీఈ కిట్లు, మాస్క్‌లు, గ్లౌజులు ధరించి కరోనా నిబంధనల న డుమ తామే బంధువులుగా మారి ట్రాక్టర్‌పై మృతదేహన్ని ఎక్కించి, శ్మశానవాటికకు తీసుకెళ్లారు. ఎక్స్‌కోవేటర్‌తో గొయ్యి తవ్వించి, అంతిమసంస్కారాలను నిర్వహించారు. అనంతరం పంచాయతీ సిబ్బందితో చుట్టుపక్క ప్రాంతాలను శానిటైజ్‌ చేయించారు.


గండేపల్లి గ్రామంలో...

కంచికచర్ల రూరల్‌ : సరిగ్గా ఇలాంటి సంఘటనే కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలోనూ జరిగింది. మతిస్థిమితం లేని ఓ వృద్ధురాలు సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా కంచికచర్ల ఎస్‌ఐ రంగనాథ్‌ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో సర్పంచ్‌ బొక్కా రవికుమార్‌ సహకారంతో సెంథిని కర్మాగారానికి చెందిన ఎక్సకవేటర్‌తో శ్మశానంలో గుంత తీయించి హోంగార్డు వెంకట్‌తో కలిసి మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేసి మానవత్వం చాటుకున్నారు. అనంతరం గ్రామస్థులు ఎస్‌ఐను ప్రత్యేకంగా అబినందించారు. 


అండగా ఆది యూత్‌ సభ్యులు..

తిరువూరు : సొంతవారే కొవిడ్‌ బాధితులను చూసి పక్కకు తప్పుకుంటుంటే భయపడొద్దు.. మీకు మేమున్నామంటూ భరోసాగా ఇస్తున్నారు.. వైసీపీ నేతలు వెలుగొటి ఆదినారాయణ, వాళ్ల సురేష్‌, సంజీవరావు, పుల్లారావు, మణికంఠ. వీరు వెలుగోటి యూత్‌గా ఏర్పడి కొవిడ్‌ బాధితులకు సేవలందిస్తున్నారు. సమాచారం అందితే చాలు వారికి ఆహారం, మందులు ఉచితంగా అందిస్తున్నారు. అలాగే కొవిడ్‌తో మృతి చెందితే మృతదేహాన్ని సొంత వాహనంపై శ్మశానానికి తరలించి దహన సంస్కారాలు చేస్తున్నారు. ఇటీవల చీరాల సెంటర్‌లోని ఒక అపార్టుమెంట్‌లో వృద్ధురాలు కొవిడ్‌తో మృతిచెందినట్లు సమాచారం రాగా వెళ్లి పరిశీలిస్తే ఆమె బతికే ఉంది. ఆహారం అందక సృహతప్పినట్లు గుర్తించి వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలు తిరిగి ప్రాణం పోసుకుంది. వీరి సేవల్ని పలువురు అభినందిస్తున్నారు.


గర్భిణికి పోలీసుల సాయం

మైలవరం : కర్ఫ్యూ కారణంగా వాహనాలు లేక ఎర్రటి ఎండలో నడుచుకుంటూ వస్తున్న ఓ గర్భిణిని పోలీసులు తమ వాహనంలో ఆమె స్వగ్రామానికి చేర్చి మానవత్వం చాటుకున్నారు. మండలంలోని వెల్వడం గ్రామానికి చెందిన గర్భిణి తనతల్లితో కలసి సోమవారం మైలవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చారు. తిరిగి వెళ్లే సమయానికి వాహనాలు లేక నడవడానికి ఇబ్బందిపడుతూ వస్తున్న గర్భిణిని ఎస్సై రాంబాబు గమనించారు. వారు ఎక్కడికి వెళ్లాలో ఆరాతీసి పోలీసు వాహనంలో వెల్వడం గ్రామానికి చేర్చారు. గర్భిణి పట్ల మానవత్వం చాటిన ఎస్సై రాంబాబును, సిబ్బందిని పలువురు అభినందించారు.

Updated Date - 2021-05-11T15:02:07+05:30 IST