దానమే స్వర్గానికి దారి

ABN , First Publish Date - 2020-02-14T06:09:59+05:30 IST

ధనవంతుడైన వాడు దానధర్మాలు చేయాలి. పిసినారితనానికి దూరంగా ఉండాలి. ‘‘దానం అనేది స్వర్గంలోని ఒక వృక్షం. దాని శాఖలు ప్రపంచంలో అటూ ఇటూ విస్తరించి ఉన్నాయి. ధార్మికుడైన దాత ఏదో ఒక కొమ్మను పట్టుకుంటాడు. అది అతణ్ణి స్వర్గం వరకూ చేరుస్తుంది.

దానమే స్వర్గానికి దారి

ధనవంతుడైన వాడు దానధర్మాలు చేయాలి. పిసినారితనానికి దూరంగా ఉండాలి. ‘‘దానం అనేది స్వర్గంలోని ఒక వృక్షం. దాని శాఖలు ప్రపంచంలో అటూ ఇటూ విస్తరించి ఉన్నాయి. ధార్మికుడైన దాత ఏదో ఒక కొమ్మను పట్టుకుంటాడు. అది అతణ్ణి స్వర్గం వరకూ చేరుస్తుంది. పిసినారితనం నరకంలోని ఒక చెట్టు. దాని శాఖలు కూడా ఇహలోకంలో అన్ని వైపులా విస్తరించి ఉంటాయి. దానిలో ఒక దాన్ని పిసినారి పట్టుకుంటాడు. ఆ కొమ్మ అతణ్ణి నరకానికి చేరుస్తుంది’’ అని దైవ ప్రవక్త మహమ్మద్‌ పేర్కొన్నారు. ‘‘అల్లా్‌హకు అయిష్టమైన గుణాలు రెండు. అవి పిసినారితనం, దుర్నీతి’’ అని దైవ ప్రవక్త ఒక సందర్భంలో చెప్పారు. దాతృత్వ స్వభావం ఉన్నవాడు దైవ సామీప్యం పొందుతాడు. ప్రజలకు దగ్గర అవుతాడు. స్వర్గానికి దగ్గరలో, నరకానికి దూరంగా ఉంటాడు. పిసినారి స్వర్గానికీ, ప్రజలకూ దూరమై, నరకానికి చేరువ అవుతాడు. ‘‘దేవుడికి దాసుడిగా ఉండే పిసినారి కన్నా అజ్ఞాని అయినప్పటికీ దాత ఆ దైవానికి ప్రియమైన వాడు’’ అని ఆయన తెలిపారు.


గొప్ప దాతగా పేరు పొందిన హజ్రత్‌ అలీ ఒక రోజు విలపిస్తున్నారు. అది చూసిన ప్రజలు కారణం అడిగారు. ‘‘వారం రోజుల నుంచీ నా ఇంటికి ఒక్క అతిథి కూడా రాలేదు’’ అని ఆయన సమాధానం ఇచ్చారు. పిసినారిగా ఉండే మనిషికి దైవ ధ్యాస అంతగా ఉండదు. అతను అందరికీ దూరంగా ఉంటాడు. అతని దగ్గరకు ఎవరూ రారు. అతని ధనం వల్ల ఎవరికీ ప్రయోజనం చేకూరదు. అందుకని అతణ్ణి ఎవరూ ఇష్టపడరు. ఫలితంగా అతని మనసు అసంతృప్తికి లోనై ఉంటుంది. శాంతి చేకూరే బదులు మనో వ్యధ ఎక్కువ అవుతుంది. ఆ వ్యధ నరకయాతన కన్నా తక్కువ కాదు. 


దాన ధర్మాల పట్ల చిత్తశుద్ధి ఉన్నవాడు తన దగ్గర ఉన్న ధనాన్ని దైవ ప్రసాదితంగా భావిస్తాడు. అతని మనసులో ఎప్పుడూ దేవుడే మెదులుతూ ఉంటాడు. ప్రజలకు అతను విరివిగా సాయపడుతూ ఉంటాడు. ప్రజలు నిర్భయంగా, నిర్మొహమాటంగా అతని వద్దకు వస్తారు. అరమరికలు లేకుండా మాట్లాడుతారు. అందరితో అతనికి సత్సంబంధాలు పెరుగుతాయి. అలాంటి వ్యక్తి జీవితం భువిలోనే దివిగా మారుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. 


మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2020-02-14T06:09:59+05:30 IST