చిరు వ్యాపారానికి చేయూత

ABN , First Publish Date - 2022-09-10T05:51:57+05:30 IST

బతుకుదెరువు కోసం వీధి వ్యాపారాలు చేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

చిరు వ్యాపారానికి చేయూత
గద్వాలలో పీఎం స్వనిధి పథకం ద్వారా రుణం తీసుకొని దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులు

- పీఎం స్వనిధి రుణ పరిమితి రూ.50వేలకు పెంపు

- జిల్లాలో 5,820 మంది వీధి వ్యాపారులు

గద్వాల, సెప్టెంబరు 9 : బతుకుదెరువు కోసం వీధి వ్యాపారాలు చేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత్‌ ఆత్మనిర్భర్‌లో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద ఇచ్చే రుణ పరిమితిని రూ.50 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడతలో రూ.10 వేల రుణం తీసుకొని సక్రమంగా చెల్లించిన వారికి రూ.20 వేలు, రెండవ విడతలో రూ.20 వేల రుణం తీసుకొని సక్రమంగా చెల్లించిన వారికి రూ.50 వేల రుణం పొందేందుకు అవకాశం కల్పించింది. జిల్లాలో 5,820 మంది వీధి వ్యాపారులు ఉన్నారు.


మొదటి విడతలో 3,990 మందికి రుణం

కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో వీధి వ్యాపారులు దయనీయ పరిస్థితిని ఎదుర్కొన్నారు. వ్యాపారాలు లేక అల్లాడిపోయారు. కరోనా తగ్గుమొఖం పట్టినా వీరి పరిస్థితి మెరుగు పడలేదు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా అప్పుల కోసం అల్లాడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పీఎం స్వనిథి పథకాన్ని ప్రవేశ పెట్టింది. పట్టణ పేదరిక నిర్మూలన శాఖ (మెప్మా) ఆధ్వర్యంలో వీధి వ్యాపారులపై సర్వే నిర్వహించింది. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి మునిసి పాలిటీల్లో 5,820 మంది వీధి వ్యాపారులను గుర్తించి, గుర్తింపు కార్డులను ఇచ్చింది. అందులో మొదట విడతగా 3,990 మందికి రూ.10 వేల రుణం బ్యాంకుల ద్వారా ఇప్పించారు. సక్రమంగా అప్పు చెల్లించిన వారు రెండవ విడత రూ.20 వేల రుణం పొందేందుకు అర్హత పొందుతారు. అయితే ఇప్పటి వరకు 1,188 మంది అర్హత సాధించగా, వారికి రూ.20 వేల రుణం బ్యాంకుల ద్వారా ఇప్పించారు. వారిలోనూ సక్రమంగా అప్పు చెల్లిం చిన వారు రూ.50 వేల రుణం పొందేందుకు అర్హత సాదిస్తారు. ఇప్పటికే చాలా మంది అర్హత సాధించారు. వారికి ఇప్పుడిప్పుడే రుణాలు అందిస్తున్నారు. 


రూ.6.36 కోట్ల రుణాలు

జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో మొదటి విడతలో రుణం పొందిన వారు 3,990 మంది ఉండగా, బ్యాంకులు వారికి రూ.3.99 కోట్ల రుణాలు ఇచ్చాయి. రెండవ విడతలో 1,188 మంది అర్హత సాధించగా వారికి రూ.2.37 కోట్ల రుణాలు అందించాయి. ఈ రుణాలు తీసుకున్న వారు అప్పులు సక్రమంగా చెల్లిస్తున్నారు. వ్యాపార లావాదేవీల్లో చిల్లర సమస్య లేకుండా వారికి ఆన్‌లైన్‌ చెల్లింపులు చేసేలా పోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి వాటితో అగ్రిమెంటు చేసుకొని క్యూఆర్‌ కోడ్‌లను ఇచ్చారు. రుణాలు సక్రమంగా చెల్లించిన వారికి కొత్తగా రూ.50 వేలు రుణం ఇచ్చేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. 


కొందరు సద్వినియోగం చేసుకోలేక...

ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయిన వీధి వ్యాపారులు ఇప్పుడు బాధ పడుతున్నారు. దాదాపు 30 శాతం మంది అంటే 1,300 మంది వరకు తీసుకున్న రూ.10 వేల రుణాన్ని బ్యాంకులకు సక్రమంగా చెల్లించ లేకపోయారు. దీంతో వాళ్లు నాన్‌ ఫర్మార్మెన్స్‌ అకౌంట్‌ (ఎన్‌పీఏ) లోకి పోయారు. వారికి అవగాహన కల్పించ డంతో దాదాపు 350 మంది తిరిగి చెల్లించారు. దీంతో వారు రూ.20 వేల రుణం పొందేందుకు అర్హత సాధిం చారు. మిగిలిన వారి నుంచి రికవరీ చేసేందుకు మెప్మా, బ్యాంకు సిబ్బంది సిద్ధమయ్యారు.


వ్యాపారం పెంచుకున్నాం 

శకుంతల, వీధి వ్యాపారి, గద్వాల : కరోనాతో ఇబ్బంది పడ్డాను. వ్యాపారానికి పైసలు దొరకని పరిస్థితిలో మునిసిపాలిటీ వారు మొదట రూ. 10వేల రుణం ఇప్పించారు. తీసుకొన్న అప్పును సక్రమంగా చెల్లించి, మళ్లీ రూ.20 వేలు తీసుకున్నాను. దీన్ని కూడా సక్రమంగా చెల్లిస్తున్నాను. ఇది పూర్తయితే రూ.50 వేలు రుణం తీసుకుంటాను. 


కుటుంబాన్ని పోషించుకుంటున్నాను 

హనుమంతు, మెకానిక్‌, గద్వాల : నేను మిక్సీలు, కుక్కర్లు, కూలర్లు రిపేరు చేస్తాను. పీఎం స్వనిధి పథకం కింద రూ.10 వేలు రుణం తీసుకొని తిరిగి చెల్లించాను. ఇప్పుడు రూ.20 వేలు తీసుకొని, క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాను. నా వృత్తి కూడా బాగా నడుస్తోంది. కుటుంబాన్ని పోషించుకుంటున్నాను.


అర్హత పొందిన వారికి రుణాలు

జానకిరామ్‌ సాగర్‌, కమిషనర్‌ : రూ.20వేల రుణం తీసుకొని సక్రమంగా చెల్లింపులు చేసిన వారు రూ.50 వేల రుణం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మెప్మా సిబ్బంది అర్హుల జాబితా ను పరిశీలిస్తోంది. అందులో అర్హత సాధించిన వారికి రుణాలు అందిస్తాం.


Updated Date - 2022-09-10T05:51:57+05:30 IST