జాతకం చూసిన తర్వాతే.. ఈ స్కూల్లో విద్యార్థులకు అడ్మిషన్..!

ABN , First Publish Date - 2021-06-23T17:51:30+05:30 IST

ఏంటీ.. వినడానికి వింతగా ఉంది కదూ. పాఠశాలలో చేర్చుకునేందుకు జాతకం చూడటం ఏంటా..? అని ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఓ పాఠశాల ఇప్పటికీ అదే పద్ధతిని అనుసరిస్తూ ఉంది.

జాతకం చూసిన తర్వాతే.. ఈ స్కూల్లో విద్యార్థులకు అడ్మిషన్..!

ఏంటీ.. వినడానికి వింతగా ఉంది కదూ. పాఠశాలలో చేర్చుకునేందుకు జాతకం చూడటం ఏంటా..? అని ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఓ పాఠశాల ఇప్పటికీ అదే పద్ధతిని అనుసరిస్తూ ఉంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో సబర్మతి సమీపంలో హేమచంద్రాచార్య సంస్కృత పాఠశాలలో విద్యార్థుల జాతకాన్ని చూసిన తర్వాతే ప్రవేశాన్ని కల్పించే పద్ధతిని ఎప్పటి నుంచో అనుసరిస్తూ వస్తోంది. నలంద, తక్షశిల వంటి పురాతన శైలి పాఠశాల విద్యను ఈ తరం విద్యార్థులకు అందివ్వడమే ఈ విద్యాలయం లక్ష్యం అని పాఠశాల నిర్వాహకుడు అకిల్ ఉత్తమ్ షా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ అభ్యసించే విద్యార్థులకు పాఠాలు చెప్పడం మాత్రమే కాకుండా అనేక కళల్లో ప్రావీణ్యం కల్పిస్తున్నామని ఆయన అంటున్నారు. 


జ్యోతిషశాస్త్రం, ఆయుర్వేదం, భాష, వ్యాకరణం, గణితం, వేద గణితం, యోగా, అథ్లెటిక్స్, సంగీతం, కళలు, గుర్రపు స్వారీ, లా మరియు వాస్తు వంటి ఎన్నో విషయాలను విద్యార్థులకు నేర్పిస్తున్నామని అఖిల్ ఉత్తమ్ షా వివరిస్తున్నారు. ఈ విద్యాలయంలో చేరాలనుకున్న వాళ్లు ఒక దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. దానితోపాటు వారి జాతకానికి సంబంధించిన వివరాలను జతచేసి పాఠశాలలో సమర్పించాలి. వారి జాతకాన్ని పరిశీలించి వారు ఈ పాఠశాలలో చేరేందుకు అర్హులో, కాదో అన్నది 15 రోజుల తర్వాత తెలియజేస్తారు. అడ్మిషన్ ఫీజుగా రూ.3000 ను తీసుకుంటారు. తుషార్ తలావత్ అనే విద్యార్థి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వేద గణిత పోటీల్లో ఎన్నో బహుమతులను సాధించాడు. ఆ విద్యార్థిని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ కూడా సత్కరించారు. ఈ తుషార్ తలావర్ ఈ పాఠశాలకు చెందిన విద్యార్థే కావడం గమనార్హం. అయితే ఈ పాఠశాలకు రాష్ట్ర విద్యాశాఖ గుర్తింపు లేదు. అంతే కాకుండా ఈ పాఠశాల తరపున విద్యార్థులకు ఎలాంటి ధృవీకరణ పత్రాలను ఇవ్వరు. అయితే నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయి ఉత్తీర్ణత సాధిస్తుండటం గమనార్హం.

Updated Date - 2021-06-23T17:51:30+05:30 IST