నాటి హైదరాబాద్‌ కథే ఆమె ఆత్మకథ

ABN , First Publish Date - 2021-07-12T05:56:07+05:30 IST

‘నేను హైదరాబాద్‌లో ఉంటూ మరో ప్రాంతం గురించి, వారి సమస్యల గురించి రాయలేను. అందుకే తెలంగాణ గ్రామీణ వాతావరణం, హైదరాబాద్‌లోని రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక విషయాలతోపాటు...

నాటి హైదరాబాద్‌ కథే ఆమె ఆత్మకథ

‘నేను హైదరాబాద్‌లో ఉంటూ మరో ప్రాంతం గురించి, వారి సమస్యల గురించి రాయలేను. అందుకే తెలంగాణ గ్రామీణ వాతావరణం, హైదరాబాద్‌లోని రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక విషయాలతోపాటు అక్కడి సమస్యలే నాకు ప్రధానంగా కనిపిస్తాయి’ అంటారు తన చిన్ననాటి జ్ఞాపకాల పుస్తకం ‘మై కౌన్‌ హూ?’లో ప్రముఖ భారతీయ ఉర్దూ రచయిత్రి జీలానీ బానూ. తన బాల్యం, యవ్వనం లోని అనేక ముచ్చట్లకు అక్షరరూపం కల్పిస్తూ యువ పాఠకులు స్ఫూర్తి పొందేందుకు ఈ ఆత్మకథను ఉర్దూలో రాశారు. దీనిని నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ‘తరుణ భారతి గ్రంథ మాల’లో ప్రచురించింది. హైదరాబాద్‌ సంస్కృతిని తన ఆత్మకథగా మలిచిన జీలానీ బానూ కథను ప్రముఖ ఉర్దూ, తెలుగు అనువాదకులు మెహక్‌ హైదరాబాదీ ‘తెరిచిన పుస్తకం’గా అనువదించారు.


తన రచనల్లో ‘దకనీ’ సంస్కృతిని సజీవంగా చిత్రించి, భారత, పాకిస్థాన్‌ సాహితీ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన జీలానీ బానూ పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోని బదాయూలో అయినా, మఖ్దూం సాబ్‌ చెప్పినట్టు ‘హైదరాబాదే బానూ స్వస్థలం’, ఆయనే అన్నట్టు ‘హైదరాబాద్‌లోని సామాజిక జీవితం, సంస్కృతీ సంప్రదాయాలు, నాటి పరిస్థితులను విస్మరించ కుండా రచనలు చేసిన రచయిత్రి’ కూడా ఆవిడే. ఉర్దూ సాహిత్యాకాశంలో అగ్రేసర రచయిత్రిగా వెలుగుతున్న జీలానీ బాను అనగానే నిన్నటి, నేటితరాలకు గుర్తుకు వచ్చేది ‘ఐవానే గజల్‌’. ఇది తెలుగుతో పాటు దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం అయ్యింది. గతించిన కాలంనాటి మహోజ్వల సంస్కృతి పతనానికి ఈ నవల అద్దం పడుతుంది. స్త్రీ, పురుషుడు, పశుత్వం మధ్యగల త్రిముఖ సంఘర్షణలను ఇందులో చూడొచ్చు. ఇక ‘మై కౌన్‌ హూ?’లో జీలానీ బానూ బాల్యం, యవ్వన జీవితాల నేపథ్యంగా నిజాం పాలనా కాలంలోని హైదరాబాద్‌కు సంబంధించిన అనేక సాంస్కృతికాంశాలు, సాహిత్యం, సాహితీవేత్తలు, సాయుధ రైతాంగ పోరాట కాలంలోని విషయాలు, సంస్కరణలు, మధ్యతరగతి జీవితాలు, ఆనాటి ముస్లీం కుటుంబాలు, హిందూ ముస్లింల పండుగలు, కుల మతాలకు అతీతంగా ఆనాడు జరుపుకున్న విధానాలు, ఆచారాలు... మొదలైనవి చూడవచ్చు.  


సనాతన సంప్రదాయ ముస్లిం కుటుంబంలో పుట్టి పెరిగిన జీలానీ బానూ ఆంక్షల, పర్దా పద్ధతుల్లోనే పెరిగారు. తన బాల్యపు పరిస్థితులను గురించి చెబుతూ, తాను ‘అటువైపు వెళ్ళకు. ముందుకు సాగు. ఇపుడాగిపో... నేనేమి మాట్లాడాలి? ఏది తినాలి? ఎటువైపు చూడాలి? ఎపుడు మౌనంగా ఉండాలి?’ అంటూ వేనవేల గొంతులు ఇప్పటికీ తనను పిలిచి చెబుతుం టాయి అంటారు. పాతబస్తీకి దూరంగా వున్న లాల్‌ టెక్రీ సమీపంలోని మల్లేపల్లిలోని ఆనాటి ప్రసిద్ధ సాహితీకారుల్లో ఒకరైన సయ్యద్‌ హసన్‌ హైరత్‌ బదాయూనీ జీలానీ బానూ తండ్రి. ఆయనను అంతా ‘అల్లామ’ హైరత్‌ బదాయూనీ అని పిలిచేవారు. సాహీతీవేత్తలు, పండితుల వంశం వారిది. విలక్షణమైన ఉత్తర ప్రదేశ్‌ విశిష్ట సంస్కృతిని, హైదరాబాద్‌ బహు భాషీయ జీవన విధానాన్ని బాల్యంలోనే ఆకళింపు చేసుకున్న జీలానీ బానూ తన బాల్యంలో తనను ప్రభావితం చేసిన అనేక అంశాలను పేర్కొంటూ దీపావళి, క్రిస్‌మస్‌ల గురించి చెబుతారు. తన స్నేహితురాళ్ళు ‘నిర్మల, బాల ఇంట్లో మాదిరిగా మేము దర్వాజ దగ్గర ప్రమిదలు వెలిగించే వాళ్ళం’ అంటారు. భిన్న సంస్కృతీ సంప్రదాయాలకే కాదు హైదరాబాద్‌ తొలి నుండి ఉర్దూ, ఫారసీ కవి పండితులు, పోషకులకు నెలవు. ఆనాడు హైదరాబాద్‌ సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అనేక మంది షాయర్‌ల గురించి పేర్కొన్న ఆమె, ఉత్తరాది కవుల్లో ప్రసిద్దుడు, షేక్‌స్పియర్‌, మిల్టన్‌లను ఉర్దూలోకి అనువాదం చేసిన ఫానీ బదాయూనీ గురించి ప్రత్యేకంగా పేర్కొంటారు. ఆయన మల్లేపల్లిలో ఉండేవారు. మహారాజ కిషన్‌ పర్‌షాద్‌ ఆహ్వానంపై హైదరాబాద్‌ వచ్చి, 1961లో హైదరాబాద్‌లోనే కన్ను మూశారు. ఇలా అనేకమంది కవులు, రచయితల గురించి మనకు జిలానీ బానూ ఆత్మకథలో తెలుస్తుంది. జిలానీ బానూ ఇంట్లో జరిగిన ముషాయిరాలు, గోష్టుల్లో కనిపించినవారిలో జోష్‌ మలి హాబాదీ, మాహిరుల్‌ కాద్రీ, జిగర్‌ మురాదాబాదీ, హోష్‌ బిల్‌గ్రామీ, హస్రత్‌ మొహానీ, అమ్జద్‌ తబాతబాయీ, మీర్‌ మహఫూజ్‌ అలీ, సికిందర్‌ అలీ వాజెద్‌, మఖ్దూం మొహి యుద్దీన్‌, సిబ్తె హసన్‌, యూసఫ్‌ నాజిమ్‌, కేౖఫీ ఆజ్మీ, షకీల్‌ బదాయూనీ, మజ్రూ సుల్తాన్‌పురీ వంటి వారిని గురించి ఎంతో గొప్పగా రాస్తారు. వీళ్ళే కాకుండా మరికొందరు హైదరాబాదీ సాహితీవేత్తలైన జోగీందర్‌ పాల్‌, అయాజ్‌ అన్సారీ, ఎవజ్‌ సయీద్‌, గులాం జీలానీ, మస్‌హఫ్‌ ఇక్బాల్‌ తౌసిఫీ, అన్వర్‌ మొఅజ్జం, జమీలా నిషాత్‌, చిత్రకారులు సయీద్‌ బీన్‌ మహమ్మద్‌ నిషాలతో పాటు అబ్దుల్‌ హక్‌ సాబ్‌, గులాం యాజ్దానీలు కూడా మల్లేపల్లిలో ఉండేవారు. వాళ్ళకు సంబంధించిన విషయాలు, ముచ్చట్లను ఇందులో భాగం చేశారామె. మనకు తెలియని ఇంకో విషయాన్ని కూడా రచయిత్రి ఇక్కడ ప్రస్తావిస్తారు, ఆనాటి రాజకీయ కార ణాలవల్ల ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఉర్దూ కవి, ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ నినాదాన్ని రూపొందించిన హస్రత్‌ మొహానీ మల్లేపల్లిలో కొంతకాలం నివాసం ఉన్నారట. 


డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి ‘ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ’ను ఆవిష్కరిస్తూ ఆనాటి నిజాం రాజ్యం, హైద రాబాద్‌ స్టేట్‌, ఆంధ్రప్రదేశ్‌లోని అనేకమంది పెద్దల జీవితాల నేపథ్యంగా తెలంగాణ చరిత్రకు అనేక సాహిత్య, సాంస్కృతి కాంశాలను జోడించారు. జీలానీ బానూ కథ కూడా మనకు తెలియని హైదరాబాద్‌కు, ఇక్కడి జీవితాలకు, సాహిత్య సంస్కృతికి సంబంధించిన అనేక అంశాలను తెలపడంలో దోహదకారిగా నిలబడనుంది. జీలానీ బానూ చెప్పుకున్న ప్రకారం బాల్యంలో ఆమెని ప్రభావితం చేసినవారిలో తొలి ప్రధాని పండిత్‌ నెహ్రూ ఒకరు. బాల్యంలో పత్రికల్లో వచ్చే నెహ్రూ ఫొటోలను కత్తిరించి దాచుకునేవారట. ఆ ప్రభావం తోనే పిల్లలకోసం నెహ్రూకు సంబంధించిన కథలను రాయగా వాటిని ఎన్‌.బి.టి బాల సాహిత్యంలో భాగంగా ఉర్దూ, ఇంగ్లీష్‌, తెలుగు, ఒడియాతో పాటు మరికొన్ని భారతీయ భాషల్లో అచ్చువేసింది. బాల్యంలో జీలానీ మెహర్‌, అఫ్జల్‌ మహమ్మద్‌, అహ్మద్‌ జలీస్‌లతో కలిసి హౌస్‌ మ్యాజైన్‌ నడి పారు. ఇది పిల్లలు నడిపిప రాత పత్రిక. ఇంకా ప్రముఖ నాటకాలను అనుకరిస్తూ నాటకాలు వేసేవారట. జీలానీ బానూ తన తొలి రచనలను బాల సాహిత్య పత్రికలు, శీర్షికలలోనే మొదలుపెట్టారు. ఆకాశవాణి బొంబాయిలో చిన్నారుల కోసం రఫత్‌ సరోష్‌ మన బాలనందం లాంటి కార్యక్రమాన్ని నిర్వహించగా, ఆ కార్యక్రమం కోసం నాటకాన్ని రాసి పంపించేవారు జీలానీ బానూ. అది ప్రసారం కావడమే కాక పదిరూపాయల పారితోషికం కూడా లభించడాన్ని గురించి ఎంత గొప్పగా చెబుతారో ఆమె. తెలంగాణలో నేడు కొత్త విప్లవంలా సాగుతున్న బాలల రచనలు ఈ సందర్భంగా గుర్తుకువస్తున్నాయి. మల్లేపల్లి సమీపంలోని జంగంబస్తీలో తన బాల్యంలో అనేక నాటకాలు చూశారట జీలానీ బానూ. ఆ ప్రభావం ఆమె మీద బాగా కనిపిస్తుంది కూడా. తనకు సీతారాముల నాటకంలోని శ్లోకాలు, మంత్రాల కంఠతా వచ్చేవట. మరు సటి రోజు ఆ నాటకాన్ని తమ ఇంట్లో పిల్లలందరూ కలిసి ప్రదర్శించేవారట. 


స్వాతంత్య్రం సిద్ధించాక హైదరాబాద్‌ స్టేట్‌లోని రాజకీయ పార్టీలతో పాటు, సాహితీవేత్తలు కూడా రెండు వర్గాల య్యారు. హైదరాబాద్‌ స్వతంత్ర దేశంగా ఏర్పడాలని ఒక వర్గం, మరో వర్గం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావాలని. ఆ సమయంలో జరిగిన అభ్యుదయ రచయితల కార్యక్రమాలు, విధానాల గురించి జీలానీ బానూకు బాగా అవగాహన ఉంది. కారణం చాలామంది ఆనాటి అభ్యు దయ రచయితలు మల్లేపల్లిలో ఉండడం, ఎక్కువ సమా వేశాలు వీరి ఇంట్లోనే జరగడం, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకున్నా జీలానీ తండ్రి అల్లామ హైరత్‌ బదాయూనీకి అభ్యుదయ రచయితల కార్యకలాపాలతో సంబంధం ఉండడం వంటివి. మఖ్దూం, రాజ్‌ బహదూర్‌ గౌర్‌, ‘పయాం’ ఎడిటర్‌ సయ్యద్‌ అఖ్తర్‌ హసన్‌, సులేమాన్‌ అరీబ్‌తో పాటు మరికొందరితో కలిసి ఆయన పనిచేశారు. తన కథలో జీలానీ బానూ మఖ్దూం వ్యక్తిత్వాన్ని, ఉద్యమో త్సాహాల్ని, తన రచనలు పట్ల ఆయనకున్న అభిమానాన్ని చాలా సందర్భాల్లో వర్ణించారు. అట్లాగే ఇక్భాల్‌, హస్రత్‌ మొహానీ, బహదూర్‌షా జఫర్‌లను జ్ఞాపకం చేయడమే కాక వారి షాయరీలను గుర్తుకు తెస్తారు. 


జీలానీ బానూ ఆత్మకథలో సందర్భానుసారంగా వివరించిన మరో అంశం తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న సమయంలో జరిగిన నిజాం సైన్యపు దాష్టికాలు, అరాచకాల గురించి. ‘...జాగీర్దార్లూ, జమీం దార్లపై రైతులు, వ్యవసాయ కూలీలు తిరగబడడమే ఈ ఉద్యమం లక్ష్యంగా ఉండేది’ అంటారామె. ఈ ఉద్యమాన్ని నిజాంసర్కారు ఎలా ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నం చేసిందో తన ఈ కథలోనూ, తరువాతి రచనల్లోనూ చూపించారు. తండ్రి ప్రోత్సాహంతో విరివిగా కథలు రాసిన జీలానీ బానూ తెలంగాణ ప్రజల గోసను అక్షరబద్ధం చేశారు. ముఖ్యంగా రచయిత్రిగా తెలంగాణ పల్లెల్లో ఏం జరుగుతుందో, అక్కడి రైతులు, నిరుపేదల స్థితిగతులు ఏమిటో తెలుసుకునేందుకు స్వయంగా గ్రామాలకు వెళ్లారు జీలానీ బానూ. రైతులపై పెత్తందార్ల దాష్టీకాలు, రైతులను పీడించే జమీందార్లు, జాగీర్దార్ల సంఘటనలను ప్రత్యక్షంగా చూసిన ఆమె ఆ ఇతివృత్తంతోనే ‘బారిషే సంగ్‌’ నవల రాశారు. ఇది హిందీ, ఇంగ్లీష్‌, మరాఠీ, మలయాళం భాష ల్లోకి అనువాదమయ్యంది.  


‘సమాజంలో ఏంజరుగుతుందో పట్టించుకోకుండా, గదిలో తలుపులు బంధించుకుని కూచుని నేను కథలు రాయ లేదు. నా చుట్టుపక్కల పరిస్థితులు, గ్రామాలలోని ఘటనలు, అసహాయ మహిళలు, పొలాల్లో కూలిపని చేసుకునే పిల్లలు.... ఇలా అందరిని దగ్గర నుంచి చూశాకే రచనలు’ చేశారు రచయిత్రి జీలానీ బానూ. స్వాతంత్య్రం వచ్చాక చాలా యేండ్ల వరకు కూడా తెలంగాణలో వెట్టిచాకిరి కొన సాగింది. తెలంగాణ రైతలు కడగండ్లు, కష్టాలకు చలించి జీలాని బానూ ‘నర్సయ్య కీ బావ్డీ’ పేరుతో రాసిన నాటకాన్ని తరువాత ప్రముఖ చలనచిత్ర దర్శకుడు శ్యాం బెనగల్‌ ‘వెల్‌డన్‌ అబ్బా’ పేరుతో తెరకెక్కించారు. ఇవే కాకుండా అనేక కథా సంపుటాల్లోని కథల్లో హైదరాబాద్‌ జీవితాల్ని, సంఘటనల్ని నిక్షిప్తం చేశారు రచయిత్రి. 


జీలానీ బానూ గురించి చెప్పుకున్నట్టే, హైదరాబాద్‌లో నివసిస్తూ, అక్కడి జీవితాల్ని, 1948కి ముందూ, తరువాతి పరిస్థితులను, ప్రజల జీవన స్థితిగతులను ‘చార్మినార్‌ కథలు’లో  చిత్రించిన వారిలో తెలుగులో మనకు నెల్లూరి కేశవస్వామి కనిపిస్తారు. ఆయన కథలలాగే సామాజిక పరిణామాలకు సాహిత్య రూపం ఇచ్చిన సామాజిక చరిత్ర రచనగా జీలానీ బానూ బాల్య, యవ్వనాల ఆత్మకథ ‘మై కౌన్‌ హూ?’ చూడవచ్చు.

(జూలై 14న జీలానీ బానూ 85వ పుట్టినరోజు)

పత్తిపాక మోహన్‌


Updated Date - 2021-07-12T05:56:07+05:30 IST