ఆమె ధైర్యం స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2020-09-14T05:30:00+05:30 IST

సూర్యాపేట జిల్లా నడిగూడెం గురుకుల బాలికల పాఠశాల సముదాయం. తరగతులు పూర్తి కావడంతో పిల్లలందరూ మైదానంలో ఆడుకుంటున్నారు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద

ఆమె ధైర్యం స్ఫూర్తిదాయకం

చేతికి చిన్న దెబ్బతగిలితేనే విలవిల్లాడిపోతాం. 

అలాంటిది ఆ చిన్నారి రెండు చేతులూ పోయాయి. 

స్కూల్లో ఆడుకుంటుండగా జరిగిన ప్రమాదం 

ఆ బాలిక పాలిట శాపంగా మారింది. 

బాగా చదువుకుని టీచర్‌ కావాలన్న ఆ చిన్నారిని 

ఏడాదిన్నర పాటు పాఠశాలకు దూరం చేసింది. 

రెండు చేతులు తీసేసిన వైద్యులూ ఆశలు వదిలేశారు. కానీ ఆ చిన్నారి మాత్రం మనోధైర్యాన్ని కోల్పోలేదు. శస్త్రచికిత్సలకు తట్టుకుని నిలిచింది. కృత్రిమ చేతులతో తిరిగి పాఠశాలలో అడుగుపెట్టింది. సూర్యాపేట జిల్లా, ముకుందాపురానికి  చెందిన దగ్గుపాటి కీర్తన నోనిబ్బరం మహిళా లోకానికి స్ఫూర్తిదాయకం. 




సూర్యాపేట జిల్లా నడిగూడెం గురుకుల బాలికల పాఠశాల సముదాయం. తరగతులు పూర్తి కావడంతో పిల్లలందరూ మైదానంలో ఆడుకుంటున్నారు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద శబ్దం. ఏం జరిగింది! అని అందరూ పరుగెత్తారు. అదే పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న దగ్గుపాటి కీర్తన ఇనుప పైపుతో ఆడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలకు తగిలింది. రెండు చేతులకు తీవ్రగాయాలతో స్పృహతప్పిన ఆ చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆ చిన్నారి రెండు చేతులు తొలగించారు.


అయినా ఆమె మనోధైర్యాన్ని కోల్పోలేదు. 18 నెలల తరువాత కృత్రిమ చేతులతో మళ్లీ పాఠశాలలో అడుగుపెట్టింది. మునగాల మండలం ముకుందాపురానికి చెందిన దగ్గుపాటి నాగరాణి, ఏసు దంపతుల రెండో కూతురు కీర్తన. టీచర్‌కావాలనే లక్ష్యంతో గురుకులంలో సీటు సంపాదించి చదువుకుంటోంది. గత ఏడాది ఫిబ్రవరి 16న క్రీడా మైదానంలో ఇనుప పైపుతో ఆడుతుండగా విద్యుత్‌ తీగలకు తగిలి ప్రమాదానికి గురైంది. వెంటనే కోదాడ, అక్కడి నుంచి హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. తీవ్రమైన గాయాలతో ఆస్పత్రికి చేరిన బాలికకు చికిత్స చేసిన వైద్యులు ఒకదశలో ఆశలు వదులుకున్నా, కీర్తన మాత్రం మనోధైర్యం కోల్పోలేదు.


రెండు చేతుల నల్లబడి పోవడంతో ఇన్‌ఫెక్షన్‌ వస్తే, ప్రాణానికే ప్రమాదం అని మోచేతి వరకు రెండు చేతులను తొలగించారు. గురుకుల విద్యాసంస్థల రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వైద్య ఖర్చులు భరించేందుకు ముందుకు రావడంతో పాటు తల్లిదండ్రులను ఒప్పించారు. మొదటగా ఎడమ చేతికి సర్జరీ చేసి మోచేతి వరకు తొలగించారు. పదిరోజుల తర్వాత కుడి చేయి తొలగించారు.


తరువాత రెండు నెలల పాటు ఐసీయూలో ఉంచితే కోలుకుంది. గత నెలలో జపాన్‌ దేశం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కృత్రిమ చేతులు అమర్చారు. ఈ చేతులతో రాయగలిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. ప్రమాదానికి గురైన నాటి నుంచి నేటి వరకు రూ. 38 లక్షలు ఖర్చుకాగా గురుకుల సంస్థ, ప్రభుత్వం నిధులను సమకూర్చాయి.




అలవాటు కావాలి!

కృత్రిమ చేతులు ధరించి పనులు చేసుకోవడం అంత సులువు కాదు. అందులోనూ ఎలక్ర్టిక్‌ పరికరాలతో తయారుచేసిన ఈ చేతులకు  అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. కృత్రిమ అవయవాలు తొడుక్కున్నాక చెమటలు పట్టడం, చీదరగా అనిపించడం జరిగినా తాత్కాలికమేనని వైద్యులు అంటున్నారు. ఈ కృత్రిమ చేతుల్లో అమర్చిన బ్యాటరీ నాలుగు గంటల పాటు పనిచేస్తుంది. 


‘‘తోటి వారి సహాయంతో నెమ్మదిగా రాయగలుగుతున్నాను. ఇతర పనులన్నీ చేసుకునే పరిస్థితి లేదు. పరీక్షలు రాయాలంటే ఇంకొకరి సాయం తప్పదు. కొంతకాలం అలవాటు పడితే మార్పు ఉంటుందేమో చూడాలి. హైదరాబాద్‌లోని కేర్‌ వెల్‌ ఆస్పత్రిలో పన్నెండు రోజులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రెండేళ్ల వరకు ఈ పరికరాలు పని చేస్తాయని డాక్టర్లు చెప్పారు’’ అని తన అనుభవాన్ని పంచుకున్నారు కీర్తన. అక్క, చెల్లి, స్నేహితులతో ఆడుకుంటూ సరదాగా గడిపేది కీర్తన. ముగ్గురు ఆడపిల్లలైనా బాగా చదువుకోవాలని అనుకునే వారు.


‘‘ ఆ రోజు చెల్లెలిని చూసి చలించిపోయా. బాగా చదివి నేను డాక్టర్‌, చెల్లి టీచర్‌ అవుదామనుకున్నాం. అనుకొని ప్రమాదం మా కుటుంబంలో వేదనను నింపింది. అయితే మళ్లీ మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నా. బడికి వచ్చిన చెల్లితో హుషారుగా చదువుకుంటూ అన్నీ మరిచిపోయేలా చేస్తున్నాను’’ అని అంటారు కీర్తన అక్క దగ్గుపాటి కృష్ణవేణి. ఓ వైపు గాయం తాలూకు బాధ , మరోవైపు నా పనులు కూడా నేను చేసుకోలేకపోతున్నానే అన్న వేదనతో కీర్తన కుమిలిపోయేది. ఆ బాధ నుంచి బయట పడేయడానికి కీర్తన చెల్లి దగ్గుపాటి శ్రుతి అక్కవెంటే  ఉండేది.


‘‘కదలలేని అక్కను చూసి రోజూ ఏడిచే దాన్ని. అక్క వద్దే ఉంటూ ఆ మాట, ఈ మాట చెబుతూ అన్నం తినిపిస్తూ, జ్యూసులు తాగించే దాన్ని’’ అని అక్కతో అనుబంధాన్ని పంచుకుంటుంది శ్రుతి. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్న కీర్తన తన లక్ష్యాన్ని చేరుకోవాలని మనమూ ఆశిద్దాం!

ఏం జరిగిందో తెలియదు!




తరగతులు ముగిశాక తోటి విద్యార్థులతో కలసి ఆడుకుంటున్నా. నా చేతిలో ఉన్న పైపు వైర్లకు తగిలింది. ఒళ్ల్లంతా మంటలు, చేతులు, కాళ్ళు బిగుసుకుపోవడం, ఏడవడమే గుర్తుంది. ఆ తర్వాత ఆస్పత్రిలో కళ్లు తెరచి చూసే సమయానికి ఉపాధ్యాయులు, అమ్మ ఎడుస్తూ కనిపించారు. నాకు ఏమి జరిగిందో తెలియలేదు. స్నేహితులు రాలేదా అని పిలుస్తూ ఏడ్చాను. రెండు చేతులు తీసేశాక బాధేసినప్పటికీ మళ్ళీ బడికి వెళ్ళాలనే ధైర్యాన్ని కూడగట్టుకొని భరిస్తూ ఉండిపోయాను. ఉపాధ్యాయులను, అమ్మ, అక్క, చెల్లిని గుర్తు చేసుకుంటూ రెండు నెలలు నరకం అనుభవించాను. ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చాక సొంత పనులు చేసుకోలేకపోయాను. అమ్మే అన్నం తినిపించేది. నా పనులు నేను చేసుకోలేకపోతున్నానే అని ఆవేదన కలిగేది. కృత్రిమ చేతులు వచ్చాక తిరిగి స్కూల్‌కు వెళ్లడం ఆనందంగా ఉంది. ఉన్నత చదువులు నా అవిటి తనాన్ని దూరం చేస్తాయని 

నా ఆశ. 


 చాపల శ్రీహరి, నడిగూడెం 




ఈ కష్టం పగవాడికి కూడా వద్దు 

నా ముగ్గురు బిడ్డలు బాగా చదివి మాకు ఆదరువు అవుతారని అనుకున్నాం. కానీ నా రెండో బిడ్డను కరెంట్‌ ప్రమాదం కోలుకోనీయకుండా చేసింది. పగవానికి కూడా ఈ కష్టం రావద్దని వెడుకుంటున్నా! కరెంట్‌ షాక్‌  కొట్టినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోవడంతో బిడ్డ బతికి బయటపడింది. నాటి నుంచి ఇప్పటి దాకా అన్ని పనులు చేస్తూ అండగా ఉంటూ సాకుతున్నాం.


రెండు చేతులు లేకపోయినా కూతురును కళ్ళలో పెట్టి కాపాడుకుంటున్నాం. కూలీ పనికి  కూడా పోవడం లేదు. ప్రవీణ్‌సార్‌, ఆర్‌సీవో అరుణకుమారి, ప్రిన్సిపాల్‌ బిక్షమయ్య, ఎమ్మెల్యె బొల్లం మల్లయ్యయాదవ్‌ ఇచ్చిన ప్రోత్సాహం, ప్రభుత్వం ఇచ్చిన చేయూత బిడ్డను కాపాడాయి. 

- దగ్గుపాటి నాగరాణి, కీర్తన తల్లి 





నా బిడ్డ కష్టం చూడలేకపోతున్నా!


ముగ్గురు అమ్మాయిలే అయినా కొడుకుల్లా పెంచుకుంటున్నా. నా బిడ్డ కష్టం చూసి తట్టుకోలేకపోతున్నాను.  బంధువులు, మిత్రులు ఉపాధ్యాయులు ఓదార్చినా నా బాధ తీరేదికాదు. సెంటుభూమి లేకపోయినా రెక్కల కష్టంతో ముగ్గురు బిడ్డలను పోషించుకుంటున్నా. నా బిడ్డ భవిష్యత్తులోనైనా తన పనులు తానే చేసుకుంటుందన్న ఆశ ఉంది. 

- దగ్గుపాటి ఏసు, కీర్తన తండ్రి 


Updated Date - 2020-09-14T05:30:00+05:30 IST