Abn logo
Apr 7 2021 @ 00:00AM

వ్యర్థాల పని పట్టడమే ఆమె పని!

వ్యర్థాలు కనిపిస్తే, వాటి పక్క నుంచి వెళ్లిపోతాం! కానీ ఓ హైదరాబాద్‌ అమ్మాయి, వాటి పని పక్కాగా పట్టాలనుకుంది! ఎలకా్ట్రనిక్‌ ఇంజనీరింగ్‌ చదివినా, పర్యావరణ హితానికి తోడ్పడే పైచదువులతో...వ్యర్థాల వృథాను అరికట్టే వృత్తిలోకి అడుగుపెట్టింది!పుట్టి, పెరిగిన హైదరాబాద్‌ కేంద్రంగా పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతున్న ఆ అమ్మాయే... కోసూరి సాహితీ స్నిగ్ధ!


నర్సాపూర్‌ బి.వి.ఆర్‌.టి కాలేజీలో ఎలక్ర్టానిక్‌ ఇంజనీరింగ్‌ చదివే రోజుల్లో, రోజూ హైదరాబాద్‌ నుంచి కాలేజీకి బస్‌లో ప్రయాణం చేసేదాన్ని. అడవి గుండా సాగే ఆ గంట ప్రయాణంలో మనుషుల సంచారం లేకపోయినా... కోతులు, ప్లాస్టిక్‌ సీసాలు దారి పొడవునా బోలెడన్ని కనిపించేవి. ఆ ప్లాస్టిక్‌ వేస్టేజీ చూసినప్పుడల్లా పర్యావరణానికి నేనెలా సహాయపడగలననే ఆలోచన మనసులో మెదిలేది. అయితే అందుకోసం నడుం బిగించాలనే నిర్ణయం ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌లో తీసుకున్నాను.


పర్యావరణంపై అవసరమైన పరిజ్ఞానం ఏర్పరుచుకోవడం కోసం, ఇంజనీరింగ్‌ ముగించి, క్యాలిఫోర్నియాలో గ్రీన్‌ టెక్నాలజీ్‌సలో మాస్టర్‌ డిగ్రీ చేశాను.  రెన్యూవబుల్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌, సుస్థిరత... వంటి అంశాల మీద పట్టు సాధించాను. ఆ తర్వాత అమెరికా, కెన్యా, దుబాయ్‌ల్లోని ఎన్‌జీవోలు, ప్రభుత్వేతర సంస్థల్లో రెండేళ్ల పాటు రెన్యూవబుల్‌ ఎనర్జీ, గ్రీన్‌ బిల్డింగ్‌, ఫుడ్‌ వేస్ట్‌ రీసెర్చ్‌ సర్టిఫికేషన్స్‌, క్లైమేట్‌ ఛేంజ్‌ ప్రోగ్రామ్స్‌ ఇన్‌ గవర్నమెంటల్‌ బాడీస్‌ అనే అంశాల్లో ప్రాజెక్టులు కూడా చేశాను.


అయితే నేను పుట్టి, పెరిగిన ప్రాంతానికి నా సేవలు అవసరమని అనిభావించి, 2018లో హైదరాబాద్‌కు వచ్చేశాను. వేస్ట్‌ వెంచర్స్‌ ఇండియా అనే సంస్థలో బిజినెస్‌ డెవల్‌పమెంట్‌ ప్లానర్‌గా చేరాను. ప్రస్తుతం సీవోవో, డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. 


కంపోస్ట్‌ బిన్స్‌ సహాయంతో...

ప్రారంభంలో ప్లాస్టిక్‌, మెటల్‌, పేపర్‌, ఈ వేస్ట్‌, గ్లాస్‌... ఇలా పొడి చెత్త సేకరణ చేపట్టాను. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్ల నుంచి ఈ చెత్తను సేకరించి, వర్గీకరించి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్ట్‌ సర్టిఫై చేసిన రీసైక్టర్లకు సరఫరా చేయడం నా విధి. ఆ తర్వాత క్లయుంట్స్‌ ఎంతోమంది, నేలపాలవుతున్న ఆహారంతో నేల కాలుష్యం పెరుగుతోంది కాబట్టి ఆ బాధ్యత కూడా తీసుకోమని నన్ను అభ్యర్థించారు. దాంతో ఆ ఆహార వ్యర్థాలను సేకరించి, దాన్ని ఎరువుగా మలిచే ప్రక్రియ మొదలుపెట్టాను.


ఇళ్లలో లేదా అపార్ట్‌మెంట్లలో ఎవరికివారు కంపోస్ట్‌ తయారుచేసుకుంటాం అనుకునే వారికి కంపోస్ట్‌ బిన్స్‌ కూడా అమ్ముతున్నా. వీటి ధర 2వేల  మొదలు, సామర్ధ్యాన్ని బట్టి ఒక్కొక్క కమ్యూనిటీ బిన్‌ 10 నుంచి 15 వేల వరకూ ఉంటుంది. కొన్ని కమ్యూనిటీలలో ఆహార వ్యర్థాలు కంపో్‌స్టగా మార్చేందుకు సరిపడా చోటు, మ్యాన్‌ పవర్‌ ఉండదు. అలాంటివాళ్ల దగ్గర నుంచి నామమాత్రపు రుసుముతో ఆహార వ్యర్థాలను సేకరించి, కంపో్‌స్టగా మలిచి, అందులో సగం తిరిగి వారికే అందిస్తున్నా.


ఇందుకు మేము వసూలు చేసే రుసుము ఒక ఫ్లాట్‌కు 150 రూపాయలు మాత్రమే! మా దగ్గర తయారయ్యే ఎక్కువ శాతం కంపో్‌స్టను హైదరాబాద్‌ చుట్టుపక్కల సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు తీసుకెళ్తూ ఉంటారు. ప్రస్తుతం వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా పెద్ద పెద్ద గేటెడ్‌ కమ్యూనిటీలు ఉన్న నార్సింగి, గచ్చిబౌలి వంటి ప్రదేశాల్లో పని చేస్తున్నా. వట్టినాగులపల్లి, అజీజ్‌నగర్‌ ప్రాంతాల్లోని కమ్యూనిటీలు, మున్సిపాలిటీలతో కూడా పని చేసే ఆలోచనలో ఉన్నా.


కుటుంబం తోడ్పాటుతోనే...

పర్యావరణానికి మేలు కలిగే పని చేయాలని ఎంతోమంది అనుకుంటారు. కానీ ఈ రంగాన్నే కెరీర్‌గా ఎంచుకునేవారు ఎంతమంది? ఇప్పటి యువతకు ఆసక్తి ఉన్నా, వారికి కుటుంబం ప్రోత్సాహం దక్కదు. కానీ నా విషయం ఇందుకు విరుద్ధం. చదివింది ఎలకా్ట్రనిక్‌ ఇంజనీరింగ్‌, లక్షల సంపాదనతో అమెరికాలోనే స్థిరపడే అవకాశం ఉన్నా, పర్యావరణ హితం కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు కుటుంబం నా భుజం తట్టి ప్రోత్సహించింది.


పుట్టింటివారితో పాటు, అత్తింటివారు కూడా నాకు తోడ్పాటు అందించారు. మరీ ముఖ్యంగా మా మామగారు కె.వి.సుబ్బరాజు గారు నన్ను అమితంగా ప్రోత్సహించారు. 2019లో నా పెళ్లైంది. అప్పట్లో నేను ఎంచుకున్న రంగాన్ని ప్రోత్సహించినా పిల్లలు పుట్టిన తర్వాత కూడా కోడలిని కెరీర్‌లో ఎదిగేలా ప్రోత్సహించే అత్తింటి వారు ఎంతో అరుదు. ఇప్పుడు నాకు మూడు నెలల వయసున్న కవల పిల్లలు. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో ఫీల్డ్‌ వర్క్‌ ఉంటుంది.


పిల్లలు ఉన్నప్పుడు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? అని ఎప్పుడూ నన్ను వెనక్కి లాగలేదాయన. నీ మాదిరిగా నేటి తరం కూడా పర్యావరణ హితానికి కృషి చేయాలి అంటూ ఉంటారాయన. ఈ రంగం పట్ల అందరికీ అవగాహన పెరిగేలా చేయవలసిందంతా చేస్తూ ఉండమని ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. పౌలీ్ట్ర వ్యాపారంలో ఉన్న ఆయనతో పాటు, మా వారు సుజిత్‌ వర్మ, కెన్యాలో ఉంటున్న నా తల్లిదండ్రులు నాకు మద్దతుగా నిలుస్తుంటారు. 


పొడి వ్యర్థాలు కూడా!

ప్లాస్టిక్‌, టెట్రా ప్యాక్‌, కార్టన్స్‌, ఎలకా్ట్రనిక్‌ వేస్ట్‌తో కూడిన పొడి చెత్తను కూడా సేకరిస్తా. ఈ చెత్తను 20 రకాలుగా వర్గీకరించి, రీసైక్లర్స్‌కు పంపిస్తా. గ్లాసు, ప్లాస్టిక్‌, ఎలకా్ట్రనిక్‌ వేస్ట్‌... ఇలా వేర్వేరు వ్యర్థాలను రీసైకిల్‌ చేసే 12 రకాల వేర్వేరు రీసైకిలర్స్‌తో అనుసంధానంగా పని చేస్తున్నా. అక్కడ వాటిని పెల్లెట్స్‌ లేదా గ్రాన్యూల్స్‌ రూపాల్లోకి మార్చి, డస్ట్‌ బిన్స్‌, బక్కెట్ల తయారీకి ఉపయోగిస్తారు. టెట్రాప్యాక్స్‌ను రీసైకిల్‌ చేయగా వచ్చిన, కంపోజిట్‌ బోర్డులతో ఫర్నిచర్‌ కూడా తయారవుతోంది. వీటన్నిటి కన్నా ఎలక్ర్టానిక్‌ వేస్ట్‌ పర్యావరణానికి అత్యంత అధికమైన హాని కలిగిస్తుంది.


ఈ వ్యర్థాల్లో పాదరసం, సీసం లాంటి ప్రమాదకరమైన వ్యర్థాలు భూ కాలుష్యాన్ని కలుగజేస్తాయి. కాబట్టి వాటిని ఎంతో జాగ్రత్తగా రీసైకిల్‌ చేయవలసి ఉంటుంది. తడి, పొడి చెత్తలతో పాటు రిజెక్ట్‌ వేస్ట్‌ సేకరణ, పంపిణీ కూడా చేస్తున్నాం. డైపర్స్‌, శానిటరీ న్యాప్కిన్స్‌, విరిగిన గాజు ముక్కలు, స్పాంజ్‌లు, మెడికల్‌ వేస్ట్‌ ఈ కోవలోకి వస్తాయి. వీటిని నేరుగా సేకరించకపోయినా, మాకు అందిన చెత్తలో ఇవి ఉంటే, వేరు చేసి ఇన్‌సెనరేటర్‌లో వేసి కాల్చేస్తూ ఉంటాం. 


పర్యావరణ స్పృహ బాల్యం నుంచే మొదలవ్వాలి. కాబట్టి భూకాలుష్యం గురించి, రీసైక్లింగ్‌ లాభాల గురించి పిల్లలకు తల్లిదండ్రులే అవగాహన ఏర్పరిచి, వారికి మార్గనిర్దేశం చేయాలి. అలాగే ఈ రంగం గురించి నేటి యువతకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. నిజానికి ఈ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.


వారు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలు మానేసి, రాకపోయినా, వారాంతాల్లో వాలంటీర్లుగా సేవలందించవచ్చు. మా లాంటి కంపెనీలతో కలిసి క్లీనప్‌ డ్రైవ్స్‌ చేపట్టవచ్చు. ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణ హితానికి నడుం బిగిస్తే, హైదరాబాద్‌ను ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీ’గా మార్చడం అసాధ్యమేమీ కాదు.


 వ్యర్థాల నుంచి ఎరువు..

ఆహార వ్యర్థాలను ఎరువుగా మార్చడానికి కొబ్బరి పొడిని వాడతాం. కంపో్‌స్టకు కావలసింది కార్బన్‌, నైట్రోజన్‌, గాలి. గాలి చొరబడకుండా ఉంచేస్తే, ఆహార వ్యర్థాలు కుళ్లిపోయి, దుర్వాసన వస్తుంది. అవే వ్యర్థాలను ఓ క్రమపద్ధతిలో నిల్వ చేస్తే పోషకభరిత ఎరువుగా మారుతుంది. ఆహార వ్యర్థాల్లో కొబ్బరి పొడిని కలిపినప్పుడు, అది తడిని మొత్తం పీల్చేసుకుంటుంది. పైగా గాలి చొరబడానికి వీలుగా తయారవుతుంది. ఇలా కుప్పలుగా తయారుచేసుకున్న వ్యర్థాల లోపలి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరిగిపోతూ ఉంటాయి.


60 నుంచి 65 డిగ్రీల ఉష్ణోగ్రతలకు చేరుకున్నప్పుడు వ్యాధికారక సూక్ష్మక్రిములు చనిపోతాయి. అంతకన్నా ఉష్ణోగ్రత పెరిగితే ఎరువులోని పోషకాలు కూడా హరిస్తాయి. కాబట్టి చెత్తను ప్రతిరోజూ తిరగదిప్పుతూ సారవంతమైన కంపో్‌స్టగా తయారుచేస్తాం. ఇందుకు 30 రోజుల వ్యవధి పడుతుంది. విత్తనాలు, ఆకులు లాంటి వాటిని తొలగించడం కోసం కంపో్‌స్టను జల్లెడ పడతాం. అలా ఆహార వ్యర్థాలు, కొబ్బరి పొడితో మేలు రకం కంపోస్ట్‌ తయారవుతుంది.


  గోగుమళ్ల కవిత

Advertisement
Advertisement
Advertisement