ఇలాగైతే సాగేదెలా?

ABN , First Publish Date - 2020-07-06T05:30:00+05:30 IST

మనం బయటకు వెళ్లకుంటే రోగనిరోధక శక్తి ఎన్నటికీ పెరగదు. వైరస్‌తో పోరాడాలంటే ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే తప్ప స్కూళ్లను మూసేయడం పరిష్కారం కాదు.

ఇలాగైతే సాగేదెలా?

మనం బయటకు వెళ్లకుంటే రోగనిరోధక శక్తి ఎన్నటికీ పెరగదు. వైరస్‌తో పోరాడాలంటే ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే తప్ప స్కూళ్లను మూసేయడం పరిష్కారం కాదు.


‘‘కరోనా పెద్ద విపత్తు. రోజు రోజుకూ పెరుగుతున్న ఈ వైరస్‌ కేసుల సంఖ్య చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. ఇంతవరకూ ఇలాంటి విపత్తును నేను చూడలేదు. రాబోయే రోజుల్లో ‘కరోనా ముందు’, ‘కరోనా తర్వాత’ అని చెప్పుకుంటారేమో! ఎందుకంటే అందరిలోనూ కరోనా భయం బాగా నిండిపోయింది. కరోనా బాధితులను సమాజం నుంచి వెలివేస్తున్న అమానవీయ దృశ్యాలను చూస్తున్నాం. అందులోనూ 60ఏళ్లు దాటిన నాలాంటి పెద్దవాళ్లు ఈ విపత్తు సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. గడపదాటాలన్నా, నలుగురితో మాట్లాడాలన్నా, బాధలో ఉన్నవారిని గుండెలకు హత్తుకుని ఓదార్చాలన్నా భయం. అంతంత మాత్రంగా ఉన్న మానవసంబంధాలు కరోనా వల్ల మరింత విచ్ఛిన్నమైపోతున్నాయి. మనుషుల మధ్య, మనసుల మధ్య దూరాలు పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తేశాక సామాజిక దూరం, పాటించకపోవడం, కేసుల ట్రేసింగ్‌, వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్ల ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. 


నేనొక రిటైర్డ్‌ టీచర్‌. ఎన్నో ఉపాధ్యాయ ఉద్యమాలలో పాల్గొన్నాను. మార్క్సిజం ఒంటి బట్టించుకున్నా. స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మహిళా విభాగానికి ఛైర్‌పర్సన్‌ని. కరోనా నేపథ్యంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు ప్రత్యక్షసాక్షిని. వైద్యం, విద్య రంగాలకు ప్రభుత్వాలు పెద్ద పీట వేయాలి. కానీ బడ్జెట్‌లో ఈ రెండింటికీ తక్కువ కేటాయింపులే ఉండడం చూస్తున్నాం. కరోనా వచ్చిందని పాఠశాలలు మూసేస్తున్నారు. ఇది సరైన నిర్ణయం కాదు. మనం బయటకు వెళ్లకుండా ఉంటే రోగనిరోధక శక్తి ఎన్నటికీ పెరగదు. వైరస్‌తో పోరాడాలంటే ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేతప్ప స్కూళ్లను మూసేయడం పరిష్కారం కాదు. పిల్లలకు ఆన్‌లైన్‌లో విద్యాబోధన అంటున్నారు. మనదేశంలో ఎంతమంది పిల్లలకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది? ఎన్ని గ్రామాల్లో వైఫై సౌకర్యం ఉంది? చెప్పండి! పాఠశాలల్లో ఆఫ్‌లైన్‌ విద్యాబోధనే మంచిది. టీచరు, విద్యార్థి ఎదురెదురుగా ఉంటూ జరిగే బోధన పిల్లలపై చూపే ప్రభావమే వేరు. ‘ఆన్‌లైన్‌ తరగతులు’ అంటూ ప్రైవేటు స్కూళ్లు పిల్లల తల్లితండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. ఆండ్రాయిడ్‌ ఫోన్లు,  కంప్యూటర్లు పిల్లల చేతుల్లో పడితే వాళ్లు ఏ సైట్స్‌ చూస్తారో తెలియదు. తల్లిదండ్రులు వారిపై ఒక కన్ను ఉంచాల్సిన పరిస్థితి ఉంది. స్కూళ్లల్లో శానిటైజ్‌ బాగా చేసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలకు విద్యాబోధన సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మేము చేసిన ఒక సర్వేలో తల్లిదండ్రులు చాలామంది పిల్లలకు ఆఫ్‌లైన్‌ విద్యావిధానమే కావాలన్నారు. 




సంక్షోభంలో ఆడపిల్లల చదువులు

ఈ సమయంలో ఆడపిల్లల చదువులు సంక్షోభంలో పడే అవకాశం ఉంది. మగపిల్లల ఆన్‌లైన్‌ చదువులకు ఖర్చు పెట్టే తలితండ్రులు ఆడపిల్లలకు చదువెందుకు? అదొక పెద్ద ఖర్చు. పెళ్లి చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కేరళలో స్కూళ్లను బాగా శానిటేషన్‌ చేసి క్లాసులు ప్రారంభించారు. పిల్లలు సామాజిక దూరం పాటిస్తున్నారు. కానీ మనదగ్గర  మధ్యతరగతి పిల్లలు చదువుకు దూరమవుతుంటే, పేద పిల్లలు తిండి లేక అల్లాడిపోవడం బాధిస్తుంది. కరోనా కాలంలో మహిళలపై పనిభారం పెరిగింది. ఒక మహిళగా ఈ విపత్తుసమయంలో కుటుంబసభ్యుల గురించి ఎంతలా ఆందోళన పడుతున్నానో, ఒక టీచరుగా భవిష్యత్‌ తరాల వాళ్లు ఎలాంటి ప్రమాదంలో పడకూడదనే ఆలోచన నన్ను ఈ సమయంలో వెంటాడుతోంది.’’ 

- మోతుకూరి సంయుక్త, రిటైర్డ్‌ టీచర్‌  


Updated Date - 2020-07-06T05:30:00+05:30 IST