హెర్డ్‌ ఇమ్యూనిటీ ఆశలపై నీళ్లు?

ABN , First Publish Date - 2020-07-08T07:39:28+05:30 IST

కరోనాకు పూర్తిగా అడ్డుకట్ట వేసేవి రెండే మార్గాలు. ఒకటి వ్యాక్సిన్‌. రెండు సమూహ రోగనిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ). అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వంటివారు తొలినాళ్లలో హెర్డ్‌ ఇమ్యూనిటీపైనే ఆశలు పెట్టుకున్నారు...

హెర్డ్‌ ఇమ్యూనిటీ ఆశలపై నీళ్లు?

  • స్పెయిన్‌లో 5శాతం మందిలోనే యాంటీబాడీస్‌
  • అక్కడి శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

మాడ్రిడ్‌, జూలై 7: కరోనాకు పూర్తిగా అడ్డుకట్ట వేసేవి రెండే మార్గాలు. ఒకటి వ్యాక్సిన్‌. రెండు సమూహ రోగనిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ). అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వంటివారు తొలినాళ్లలో హెర్డ్‌ ఇమ్యూనిటీపైనే ఆశలు పెట్టుకున్నారు.  ఇజ్రాయెల్‌, యూర ప్‌లోని కొన్నిదేశాలు కూడా హెర్డ్‌ ఇమ్యూనిటీ దిశగా ప్రయోగాలు చేశాయి. కానీ.. స్పెయిన్‌ శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యయనం, హెర్డ్‌ ఇమ్యూనిటీ ఆశలపై నీళ్లు జల్లింది. కరోనా విలయతాండవం చేసిన దేశాల్లో స్పెయిన్‌ కూడా ఒకటి. ఆ దేశంలో 2 లక్షల మందికి పైగా వైరస్‌ బారిన పడ్డారు. వారిలో 60 వేల మందిని పరీక్షించగా.. కేవలం 5 శాతం మందిలో మాత్రమే యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్టు స్పెయిన్‌లోని ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎపిడమాలజీ: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ కార్లోస్‌ 3’ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.


స్పెయిన్‌లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న ఏప్రిల్‌ 27 మే 11 నడుమ 61,075 మందిపై ఈ అధ్యయనం చేశారు. ఒక దేశ/ఒక ప్రాంత జనాభాలో 70 నుంచి 90 శాతం మంది వైర్‌సను తట్టుకునే శక్తిని (యాంటీ బాడీస్‌ అభివృద్ధి చెందడం) కలిగి ఉండటాన్ని హెర్డ్‌ ఇమ్యూనిటీగా వ్యవహరిస్తారు. జనాభాలో అంతమందికి వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా లేదా ఎక్కువ మందికి వైరస్‌ సోకడం ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీ వస్తుంది. కానీ, స్పెయిన్‌లో వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉన్నా.. యాంటీబాడీస్‌ అభివృద్ధి చెందినవారి సంఖ్య కేవలం 5 శాతంగా తేలడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే అందుకు భౌతిక దూరం పాటించడం, వైరస్‌ సోకినవారిని గుర్తించి, ఐసోలేట్‌ చేయడమే మార్గాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2020-07-08T07:39:28+05:30 IST