UAE చేసిన కీలమైన ఈ మార్పుల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

ABN , First Publish Date - 2021-12-09T15:49:49+05:30 IST

అరబ్ దేశం యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ఇటీవల అధికారిక పనిదినాలను కుదిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని విధంగా కేవలం నాలుగున్నర రోజులే అధికారిక పని దినాలు నిర్ణయించింది. అలాగే ఈ నాలుగున్నర రోజుల్లో రోజుకు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు వారాంతపు సెలవు దినాలను కూడా సవరించింది.

UAE చేసిన కీలమైన ఈ మార్పుల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

ఎన్నారై డెస్క్: అరబ్ దేశం యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ఇటీవల అధికారిక పనిదినాలను కుదిస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని విధంగా కేవలం నాలుగున్నర రోజులే అధికారిక పని దినాలు నిర్ణయించింది. అలాగే ఈ నాలుగున్నర రోజుల్లో రోజుకు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు వారాంతపు సెలవు దినాలను కూడా సవరించింది. శని, ఆదివారంతో పాటు శుక్రవారం హాఫ్‌డే సెలవు ఉంటుంది. అంటే.. వారానికి మొత్తం రెండున్నర రోజులు సెలవులన్నమాట. జనవరి 1 నుంచి ఈ కొత్త టైమ్‌టేబుల్‌ అమలులోకి రానుంది. దేశంలోని ఫెడరల్ గవర్నమెంట్ సెక్టార్‌ పరిధిలోకి వచ్చే అన్ని సంస్థలకు ఇది వర్తిస్తుంది. 


ఇక ఈ కొత్త టైమ్‌టేబుల్‌ ప్రకారం.. సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు(8గంటలు) పని గంటలు. అదే శుక్రవారం రోజు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు(నాలుగున్నర గంటలు) మాత్రమే కార్యాలయాలు పని చేస్తాయి. ఏడాది పొడవునా శుక్రవారం మధ్యా హ్నం నమాజు వేళను 1.15గా నిర్ణయించారు. పోటీ తత్వాన్ని మెరుగుపరచే లక్ష్యంతోపాటు ప్రపంచ మార్కెట్లు, వాణిజ్యాన్ని పరిగణనలోకి తీసుకొని వారాంతాన్ని శని, ఆదివారాలకు మార్పు చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.


దుబాయ్ స్కూల్స్: 

తాజాగా యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన నాలుగున్నర వారాంతపు పని దినాలను దుబాయ్ స్కూల్స్ కూడా పాటించాల్సి ఉంటుంది. "వారాంతపు పని విధానాన్ని మారుస్తూ యూఏఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో దుబాయ్‌లోని ప్రైవేట్ విద్యారంగం కూడా ఉంది" అని దుబాయ్‌లోని నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కేహెచ్‌డీఏ) ధృవీకరించింది. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ.. గవర్నమెంట్ తీసుకున్న కొత్త నిర్ణయానికి అనుగుణంగా సాఫీగా మార్పు జరిగేలా చూసేందుకు తాము కూడా దుబాయ్‌ విద్యా సంఘంలోని మా సహోద్యోగులతో కలిసి పని చేస్తామని అన్నారు.  


అబుధాబి పాఠశాలలు: 

అబుధాబి విద్య మరియు నాలెడ్జ్ శాఖ (ఏడీఈకే) అబుధాబి అంతటా పాఠశాల పని దినాలను మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా కీలక ప్రకటన చేసింది. 2022 జనవరి నుండి అబుధాబి ప్రైవేట్ & చార్టర్ పాఠశాలలు అబుధాబి ప్రభుత్వం ప్రకటించిన కొత్త పని దినాల షెడ్యూల్‌ను అనుసరిస్తాయని ఏడీఈకే పేర్కొంది. 

స్కూల్ డేస్: సోమవారం-గురువారం(ఫుల్ డే), శుక్రవారం (హాఫ్ డే)

వీకెండ్స్: శనివారం-ఆదివారం అని తెలిపింది. మిగతా వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఏడీఈకే ట్వీట్ చేసింది. 


ప్రైవేట్ సెక్టార్:

ప్రభుత్వం రంగ సంస్థలే కాకుండా ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు కూడా తాజాగా తీసుకొచ్చిన వారాంతపు పని దినాల ప్రకారం తమకు అనువైన పని వేళలను నిర్ణయించుకోవాలని ఆ దేశ మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రి డాక్టర్ అబ్దుల్‌రహ్మాన్ అల్ అవార్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి అన్ని సంస్థలు నాలుగున్నర రోజులే అధికారిక పని దినాలను అనుసరించాలని సూచించారు. ఈ మేరకు దేశంలోని ప్రైవేట్ సంస్థలు ముందే కార్యాచరణను రూపొందించుకోవాల్సిందిగా తెలియజేశారు.  


యూఏఈ సెంట్రల్ బ్యాంక్:

ప్రభుత్వం ప్రకటించిన కొత్త వారాంతపు పని దినాల ప్రకారం యూఏఈ సెంట్రల్ బ్యాంక్ సైతం తన పని గంటలను మార్చుకోనుంది. ఇప్పటికే ఈ మేరకు కసరత్తు మొదలెట్టింది. పని వేళల్లో మార్పు ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ కమ్యూనిటీతో యూఏఈ బ్యాంకింగ్ రంగాన్ని ఏకీకృతం చేస్తుందని మంత్రి డా. అబ్దుల్‌రహ్మాన్ అల్ అవార్ అన్నారు. 2022 జనవరి నుండి కొత్త వర్కింగ్ అవర్స్‌కు అందరూ అలవాటు పడాల్సిందేనన్నారు. 


ఆర్థిక ప్రయోజనాలు:

ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం యూఏఈ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పని విధానం ఒక కొత్త అనుభవం. ఈ విధానం అనేక ప్రయోజనాలను సాధించగలదని వాకి అంచనా. ముఖ్యంగా విదేశీ పెట్టుబడుల ఆకర్షణను పెంచుతుంది. వాణిజ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే సమతుల్యత, ఆర్థిక వృద్ధిని పెంచడం, ప్రపంచ ఆర్థిక పటంలో యూఏఈ స్థానాన్ని ఏకీకృతం చేస్తుంది. దీంతో పాటు దేశీయ పర్యాటకాన్ని పునరుద్ధరించడంలో కీలకం కానుంది. ఈ సందర్భంగా ఆర్థికవేత్త మొహమ్మద్ అలీ యాసిన్ మాట్లాడుతూ.. “యూఏఈలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పని విధానం దేశానికి సంబంధించిన ప్రపంచ పోటీతత్వాన్ని, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్‌లతో సామరస్యాన్ని పెంచుతుంది. ఇది సెటిల్‌మెంట్‌లను అందిస్తుంది. ఆర్థిక రంగంలో భారాన్ని తగ్గిస్తుంది" అని అన్నారు.  

Updated Date - 2021-12-09T15:49:49+05:30 IST