మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. అయితే ఇది పక్కాగా తెలుసుకోండి..!

ABN , First Publish Date - 2020-02-18T20:23:13+05:30 IST

ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) ఖాతాదారులుగా ఉన్న ఉద్యోగులు ఇటీవల కాలంలో రకరకాల మోసాలకు...

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. అయితే ఇది పక్కాగా తెలుసుకోండి..!

అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు..

వ్యక్తిగత సమాచారం, ఖాతాల వివరాలను తెలియని వ్యక్తులకు ఇవ్వొద్దని సంస్థ సూచన


ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) ఖాతాదారులుగా ఉన్న ఉద్యోగులు ఇటీవల కాలంలో రకరకాల మోసాలకు గురవుతున్నారు. ఉద్యోగులు దాచుకున్న ఖాతాల నుంచి సొమ్ము వారికి తెలియకుండానే మాయమైపోతున్న ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. అందువల్ల పీఎఫ్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇందుకోసం తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా పీఎఫ్‌ ఖాతాదారులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించింది.


బ్యాంకుల మాదిరిగా ఖాతాదారులైన ఉద్యోగులు అడిగిన వారికల్లా తమ వ్యక్తిగత సమాచారాన్ని అంటే పాన్‌ కార్డు ఆధార్‌ కార్డు వంటి వివరాలు పంపించకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకసారి ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల నుంచి నగదు మాయమైపోతే దానిని రికవరీ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అవుతుంది. చాలా సందర్భాలలో ఉద్యోగులు ఆ సొమ్మును నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అందువల్ల ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు అంటున్నారు.


నగదు ఎలా మాయం అవుతుంది?

ఉద్యోగులకు సంబంధించి అందరికీ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతా ఉంటుంది. ఈ ఖాతాకు సంబంధించి ప్రతి ఉద్యోగికి ప్రత్యేకంగా ఒక నంబర్‌ను కేటాయిస్తారు. ప్రభుత్వ జీపీఎఫ్‌ను ఒక విభాగం నిర్వహిస్తుంటే... స్థానిక సంస్థలకు సంబంధించి పీఎఫ్‌ను జిల్లా పరిషత్తు నిర్వహిస్తోంది. దీంతోపాటు కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి ఆయా కంపెనీలు ఉద్యోగుల నుంచి నెలవారి కొంత వసూలు చేసి పీఎఫ్‌ ఖాతాలకు జమ చేస్తోంది. ఇది ప్రత్యేకమైన ఖాతాలో ఉంటుంది. ఈ ఖాతా నుంచి ఉద్యోగి ఉద్యోగాన్ని మానివేసే సమయంలో కాని లేదా ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారే సమయంలో గానీ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. లేకుంటే పదవీ విరమణ సమయంలో కూడా దాచుకున్న సొమ్మును పొందే వెసులుబాటు కల్పించారు.


గతంలో ఈ విధంగా దాచుకున్న సొమ్మును తీసుకునేందుకు అనేక రకాల ప్రక్రియలను పూర్తిచేయాల్సి ఉండేది. అయితే గత ఆరు నెలల కాలం నుంచి పీఎఫ్‌ ఖాతాల నుంచి దాచుకున్న సొమ్మును ఖాతాదారులే నేరుగా డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు.  ఈ సదుపాయం ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ ఇందులో ఉన్న ఇబ్బందులు కారణంగా ఉద్యోగులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం తెలుసుకున్నవారు సొమ్మును డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ పద్ధతిని కొంతమంది తమకు అనుకూలంగా మార్చుకుని పీఎఫ్‌ ఖాతాదారులైన ఉద్యోగులతో సంబంధం లేకుండా ఈ ఖాతాల నుంచి నగదు డ్రా చేసుకుంటున్నారు.


ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుని ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఇటువంటి సంఘటనలు గత నాలుగు నెలలుగా అనేకం వెలుగులోకి వచ్చాయి. ఖాతాదారులైన ఉద్యోగులకు తెలియకుండా వారి ఖాతాల్లోని వేలాది రూపాయల నగదు మాయమైపోతోంది. ఏదైనా అవసరం వచ్చినప్పుడు నగదు డ్రా చేసుకోవచ్చునని భావించే ఉద్యోగులు తమ ఖాతాలలో నగదు మాయమైపోతున్న నగదు విషయంలో గగ్గోలు పెడుతున్నారు. దీంతో ఈ విధానానికి కట్టడి చేయడానికి పీఎఫ్‌ అథారిటీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో ఉద్యోగుల సహకారం కూడా ఎంతో అవసరమని, వారి సహకారం లేకపోతే ఇటువంటి మోసాలను కంట్రోల్‌ చేయడం కష్టమంటున్నారు. ఈ మేరకు ఉద్యోగులకు అవగాహన కలిగించడానికి పలు చర్యలు తీసుకుంటున్నారు.


అధికారుల ప్రచారం

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో) ప్రభుత్వరంగ సంస్థ ఉద్యోగుల పీఎఫ్‌ వ్యవహారాలను పర్యవేక్షించే సిబ్బంది కలిగిన సంస్థ. ఈ సంస్థ అధికారులు  ఖాతాదారులైన ఉద్యోగులకు తమకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి అందించకూడదని ప్రత్యేకమైన ఆదేశాలను జారీ చేసింది. ఫోన్‌ ద్వారా ఎలాంటి వివరాలను ఎవరికీ అందించరాదంటూ తమ సంస్థ ట్విట్టర్‌ ద్వారా ఖాతాదారులకందరికీ సమాచారాన్ని అందించింది. ఈ పీఎఫ్‌వో సంస్థ పేరుతో కొంతమంది వివరాలను ఖాతాదారుల నుంచి పొందుతున్నారని, వాటి ఆధారంగా వారి వ్యక్తిగత ఖాతాల నుంచి నగదు డ్రా చేస్తున్నారని తెలియజేసింది. సాధారణంగా తమ సంస్థ ఖాతాదారుల నుంచి ఎటువంటి వివరాలను ఎప్పుడూ అడగదని, బ్యాంకు ఖాతాలో డబ్బులను జమ చేయమని కూడా కోరదని పేర్కొంది. కానీ ఇటీవల కాలంలో సంస్థ పేరుతో కొంత మంది పీఎఫ్‌ ఖాతాదారులకు ఫోన్లు చేసి వారి వివరాలను కావాలని అడుతున్నారని, ఇలా ఎవరడిగినా తమకు సమాచారాన్ని అందించాలని పేర్కొన్నారు. కొంతమంది నేరగాళ్లు ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను ఫోన్‌ ద్వారా తెలుసుకుంటున్నారని, ఒకవేళ ఎవరైనా అడిగినా ఎటువంటి సమాచారాన్ని ఇవ్వరాదని సూచించింది. ఆధార్‌, బ్యాంకు ఖాతా నంబరు, పాన్‌ కార్డు నంబరు వంటివి సాధారణ మొబైల్‌ లేదా స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా ఎవరికీ తెలియజేయకూడదని, ఒకవేళ అలా తెలియజేస్తే మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు మోసపోయిన వారంతా తమ వివరాలను తెలియని వ్యక్తులకు అందించడం వల్లే నష్టపోయారని పేర్కొంది.

 

ఖాతాదారుల కోసం ప్రత్యేక చర్యలు

ప్రావిడెంట్‌ ఫండ్‌లో ఖాతా కలిగిన ఉద్యోగుల కోసం పీఎఫ్‌ అధికారులు కొన్ని ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. 

    • ఖాతాదారులు తమకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలంటే చాలా మాధ్యమాలను అందుబాటులోకి తెచ్చింది.
    • ఏపీఎఫ్‌ఐజీఎంస్‌ అనే పోర్టర్‌ అందుబాటులో ఉంటుంది. ఇందులో వ్యక్తిగత ఖాతా నంబరును నమోదు చేశాక తమ సమస్యను తెలియజేస్తే అందుకు తగిన జవాబు లేదా పరిష్కారం ఫోన్‌ ద్వారా రిప్లైగా వస్తుంది.
    • పీఎఫ్‌కు సంబంధించి కాల్‌ సెంటర్లు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఖాతాదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉంది. 
    • కార్మికశాఖకు ఉన్న ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ద్వారా పీఎఫ్‌కు సంబంధించిన సమస్యలను తెలియజేసే అవకాశాన్ని కూడా కల్పించారు.
    • జిల్లా కేంద్రాలలో 24 గంటలపాటు పనిచేసే కాల్‌ సెం టర్లు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా అధికారులకు నేరుగా సమస్యలను తెలియజేసే వెసులుబాటు ఉంది.
    • సమస్యలను తెలియజేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిద్వారా సెలవు రోజుల్లో కూడా ఫోన్‌ చేసి సమస్యలను తెలియజేయవచ్చు.
    • పీఎఫ్‌కు సంబంధించి టోల్‌ఫ్రీ నంబర్‌ 1800118005 నంబర్‌కు కాల్‌ చేసి సమస్యలను తెలియజేయవచ్చు.
    • పీఎఫ్‌ ఖాతాదారులు తమకు సంబంధించిన అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌, కేవైసీ తదితర సమస్యలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
    • పీఎఫ్‌ ఖాతాదారులు తమ సమస్యలను ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేయడానికి ఈ విధానం ఎంతో అనుకూలంగా ఉంటుంది.
    • ఫిర్యాదు చేయాలంటే ఖాతాదారులకు సంబంధించిన యూఏఎన్‌ నంబర్‌ తప్పనిసరిగా ఉండాలి. ఈ నంబర్‌ లేకపోతే కంపెనీ పేమెంట్‌ ఆర్డర్‌ నంబర్‌ ఉంచుకోవాలి. లేదా కంపెనీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ నంబర్‌ ఆధారంగా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌

ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాదారులకు ఇటీవల కాలంలో ప్రభుత్వం యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ను కేటాయిస్తుంది. ఈ నంబర్‌ ఆధారంగా ఉద్యోగి సర్వీసులో చేరిన తేదీ, అతని ఆర్థిక పరిస్థితి వంటి తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. గతంలో ఇటువంటి నంబర్‌ ఉండేది కాదు. సాధారణ పీఎఫ్‌ నంబర్‌ వల్ల మోసాలు జరుగుతున్నాయని అధికారులు యూఏఎన్‌ నంబరును కేటాయించింది. ఒకసారి కేటాయించిన నంబర్‌ ఆ ఉద్యోగి పదవీ విరమణ చేసే వరకు ఉంటుంది. దీనిని మరొకరికి కేటాయించే అవకాశం కూడా ఉండదు. ఈ నంబర్‌ వ్యక్తిగత భద్రతతో ఉద్యోగుల వద్ద ఉంచుకోవాలి. ఈ నంబర్‌ తెలిస్తే ఉద్యోగి ఏ విభాగంలో పని చేస్తున్నాడు, తన ఖాతాలో ఎంత నగదు ఉన్నదన్న వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఈ నంబర్‌ను కూడా ఇతరులెవరికీ తెలియకూడదని పీఎఫ్‌ అధికారులు సూచిస్తున్నారు. ఈ నంబర్‌ తెలిస్తే ఉద్యోగికి సంబంధించిన ఇతర వివరాలను కూడా తెలుసుకునే వీలుంటుందని, దీని ఆధారం సదరు ఖాతాలో నగదు మాయమవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని సూచిస్తున్నారు.


పీఎఫ్‌ అధికారుల నిర్ణయం మంచిది

పీఎఫ్‌ ఖాతాదారుల విషయంలో అప్రమత్తత కల్పించడానికి సంబంధిత అధికారులు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తాయి. చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల అధికారులు సమాచారం అడుగుతున్నారని భావించి తమకు సంబంధించిన వివరాలను ఫోన్‌ చేసిన వారికి తెలియజేసి చాలామంది నష్టపోయారు. పీఎఫ్‌ అధికారులు గతంలో ఈ విషయాలను పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు ప్రత్యేకంగా చర్యలు తీసుకుని ఖాతాదారులకు అవగాహన కలిగిస్తున్నందున రానున్న కాలంలో ఉద్యోగులు మోసాలకు గురయ్యే ప్రమాదం ఉండదు.

పిన్నంరాజు శేషు, ఉద్యోగి


కొత్త నంబర్లు కేటాయించాలి

ప్రస్తుత యూఏఎన్‌ నంబర్‌ల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు గుర్తించినందున ఈ నంబర్లను మార్పు చేయాలి. ఈ నంబర్ల ఆధారంగా ఉద్యోగుల వివరాలన్నీ తెలియజేసేలా ఉండకుండా చూసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మోసాలు జరగకుండా అధికారులు ఇన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉండదు. మోసాలు చేసే వారికి చెక్‌ పెట్టవచ్చు. డిజిటలైజేషన్‌ మాదిరిగా నంబర్లను మార్పు చేసి ఖాతాదారులందరికీ అందిస్తే కొంత ప్రయోజనం ఉంటుంది.

-పి.ఓంకార్‌, ఉపాధ్యాయుడు

Updated Date - 2020-02-18T20:23:13+05:30 IST