ఇవిగో ఆధారాలు.. రాజీనామా చేయండి

ABN , First Publish Date - 2020-09-20T08:54:16+05:30 IST

ఈఎ్‌సఐ మందుల కుంభకోణంలో నిందితుడు కార్తీక్‌ ఇచ్చిన కారును మంత్రి గుమ్మనూరు జయరాం గత డిసెంబరు నుంచి స్వయంగా వినియోగిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి

ఇవిగో ఆధారాలు.. రాజీనామా చేయండి

డిసెంబరు నుంచి బెంజ్‌లోనే మంత్రి జయరాం పర్యటనలు

కారుతో సంబంధం లేకపోతే 

ఇన్నాళ్లూ మీ దగ్గర ఎందుకుంది?

మాజీ మంత్రి అయ్యన్న సూటి ప్రశ్న

దమ్ముంటే జైల్లో పెట్టాలని సవాల్‌ 


విశాఖపట్నం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఈఎ్‌సఐ మందుల కుంభకోణంలో నిందితుడు కార్తీక్‌ ఇచ్చిన కారును మంత్రి గుమ్మనూరు జయరాం గత డిసెంబరు నుంచి స్వయంగా వినియోగిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలతో కూడిన వీడియోలను మీడియాకు విడుదల చేశారు. శనివారం విశాఖలోని ఆ పార్టీ కార్యాలయంలో అయ్యన్న మాట్లాడుతూ ఈఎ్‌సఐ కుంభకోణంలో ఏ-14గా ఉన్న కార్తీక్‌కు చెందిన బెంజ్‌ కారుతో తనకు సంబంధం లేదని మంత్రి చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనన్నారు. మంత్రి కుమారుడు ఈశ్వర్‌ పుట్టినరోజు కానుకగా కార్తీక్‌ గత డిసెంబరు 12న రూ.కోటి విలువైన కారును తెలంగాణ రిజిస్ట్రేషన్‌ (టీఎస్‌ 09 టీసీ 0262)తో కొనుగోలు చేసి ఇచ్చారన్నారు. అప్పటినుంచి ఆ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ అతికించి మంత్రి, ఆయన కుమారుడు వినియోగిస్తున్నారన్నారు. మంత్రికి సంబంధం లేకపోతే కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఎందుకు అతికించారని, అది పది నెలల నుంచి మంత్రి ఇంట్లోనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఈఎ్‌సఐ ఆస్పత్రులకు మందులు సరఫరా చేసే కార్తీక్‌... కార్మికమంత్రికి బినామీ అని అయ్యన్న ఆరోపించారు.


నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ చేసిన జయరాంకు సంబంధించి ఆధారాలు బయటపెట్టానన్నారు. ‘అయ్యా మంత్రిగారూ... ఇంతకంటే ఇంకేమై నా ఆధారాలు కావాలా? ఇప్పటికైనా నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయండి’ అని డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లాలో ఒక భూ కుంభకోణం తో మంత్రికి సంబంధం ఉందని, ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తానన్నారు. సొంత నియోజకవర్గంలో మంత్రే స్వయంగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. యువ పోలీస్‌ అధికారిణి ఒకరు పేకాట క్లబ్బుపై దాడిచేసి రూ.30 లక్షలు పట్టుకుని, మంత్రి తమ్ముడ్ని అరెస్టు చేశారన్నారు. గనుల కేసులో ఉన్న గాలి జనార్దన్‌రెడ్డికి మంత్రి జయరాం బినామీ అని అయ్యన్న ఆరోపించారు. సీఎం జగన్‌  తక్షణమే స్పందించి జయరాంపై విచారణ జరపాలన్నారు. మంత్రిపై చేపట్టే విచారణకు సంబంధించి ఆధారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. మంత్రిపై కాల్‌సెంటర్‌ 14400కు శుక్రవారం ఉదయం ఫోన్‌చేసి వివరాలు చెబితే 24గంటలైనా కనీసం తన సెల్‌కు మెసేజ్‌ ఇవ్వలేదన్నారు. ఒక మాజీమంత్రి స్వయంగా ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోతే సామాన్యుడి ఫిర్యాదు గతేమి కానని అయ్యన్న విమర్శించారు. మంత్రి అవినీతిపై ఆధారాలు బయటపెట్టిన నేపథ్యంలో తనపై ప్రభుత్వం ఎదురుదాడికి దిగినా వెనుకంజ వేయబోనని, దమ్ముంటే తనను జైల్లో పెట్టాలని సవాల్‌ చేశారు.  


మంత్రి అడ్డంగా దొరికారు: అమరనాథరెడ్డి 

పలమనేరు/విజయవాడ సిటీ, సెప్టెంబరు 19: ఈఎ్‌సఐ స్కాంలో మంత్రి జయరాం అడ్డంగా దొరికిపోయారని మాజీ మంత్రి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈఎ్‌సఐ స్కాంలో మంత్రి జయరాం కుమారుడికి ఉన్న సంబంధాన్ని బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా, కార్మికుల సొమ్మును అడ్డంగా దోచుకుంటున్న మంత్రి జయరాంను బర్తరఫ్‌ చేయాలని టీఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకుడు గొట్టుముక్కల రఘురామరాజు విజయవాడలో డిమాండ్‌ చేశారు. 


మతిభ్రమించి మాట్లాడుతున్నారు: జయరాం 

ఆలూరు, సెప్టెంబరు 19: బెంజ్‌ కారు విషయంలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, అయ్యన్నపాత్రుడు మతిభ్రమించి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గుమ్మనూరు జయరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కర్నూలు జిల్లా ఆలూరులో మాట్లాడుతూ సరిగ్గా మాట్లాడటం కూడా రాని మాజీ మంత్రి నారా లోకేశ్‌ బెంజ్‌ కా రు గురించి మాట్లాడడం సరికాదన్నారు. తన కుమారుడితో పరిచయం ఉన్న కారణంగా ఈఎ్‌సఐ కుంభకోణంలో 14వ ముద్దాయిగా కార్తీక్‌తో కారులో తిరిగి ఉండవచ్చని, కారు డ్రైవ్‌ చేసి ఉండవచ్చన్నారు. 

Updated Date - 2020-09-20T08:54:16+05:30 IST