హెరిటేజ్‌ ఆదాయం రూ.667 కోట్లు

ABN , First Publish Date - 2022-01-22T08:14:18+05:30 IST

హెరిటేజ్‌ ఫుడ్స్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి గాను కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.667 కోట్ల నికర ఆదాయాన్ని నమోదు చేసింది....

హెరిటేజ్‌ ఆదాయం రూ.667 కోట్లు

హైదరాబాద్‌: హెరిటేజ్‌ ఫుడ్స్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి గాను కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.667 కోట్ల నికర ఆదాయాన్ని నమోదు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంతో పోల్చితే ఆదాయం 10.3 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ రూ.20.8 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో  లాభం రూ.46.4 కోట్లుగా ఉంది.


త్రైమాసిక కాలంలో మొత్తం డెయిరీ ఆదాయంలో విలువ ఆధారిత (వాల్యూ యాడెడ్‌) ఉత్పత్తుల వాటా 25 శాతం వృద్ధి చెంది రూ.164.70 కోట్లుగా నమోదైందని హెరిటేజ్‌ ఫుడ్స్‌ వెల్లడించింది. కాగా డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలలకు గాను రూ.1,985.40 కోట్ల ఆదాయంపై రూ.83.9 కోట్ల నికర లాభాన్ని కంపెనీ నమోదు చేసింది. వాల్యూ యాడెడ్‌ ఉత్పత్తుల పోర్టుఫోలియో విస్తరణతో డిసెంబరు త్రైమాసిక ఆదాయంలో పటిష్ఠమైన వృద్ధిని నమోదు చేసినట్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రహ్మణి నారా వెల్లడించారు. డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయటంతో పాటు డెట్‌ ఫ్రీ హోదా, కంపెనీ చేతిలో నగదు నిల్వలు సరిపడినంత స్థాయిలో ఉండటం కూడా కలిసి వచ్చిందని పేర్కొన్నారు. 


కాగా డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ వివిధ విభాగాల్లో పలు ఉత్పత్తులను విడుదల చేసిందని బ్రహ్మణి తెలిపారు. వెనీలా, బటర్‌స్కాచ్‌, చాక్లెట్‌ ఫ్లేవర్లలో ఫ్రోజెన్‌ డిసర్ట్‌ ప్యాక్‌లతో పాటు ఎంపిక చేసిన మార్కెట్లలో ఏ2 ఫ్రెష్‌ మిల్క్‌ను హెరిటేజ్‌ ఫుడ్స్‌ విడుదల చేసింది. త్రైమాసిక కాలంలో బెంగళూరు మార్కెట్లోకి హెరిటేజ్‌ నొవాండై ఫుడ్స్‌ అడుగుపెట్టడంతో పాటు అన్ని మార్కెట్లలోకి నేచురల్‌ ఫ్రెష్‌ ప్రొ బయోటిక్‌ పెరుగును ప్రవేశపెట్టినట్లు బ్రహ్మణి నారా వెల్లడించారు.

Updated Date - 2022-01-22T08:14:18+05:30 IST