Oct 19 2021 @ 11:43AM

హీరో, దర్శకుడు ఒకేసారి ఫామ్ లోకొచ్చారు!

కరోనా సెకండ్ వేవ్ అనంతరం టాలీవుడ్ లో పలువురు హీరోలు సక్సెస్ ట్రాక్ ఎక్కుతున్నారు. కొందరు దర్శకులు తిరిగి ఫామ్ ను అందుకుంటున్నారు. అయితే ఒకే సినిమాతో హీరో, దర్శకుడు సక్సెస్ ను అందుకోవడం అన్నది ‘మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీతోనే సాధ్యమైంది. తొలి మూడు చిత్రాల రిజల్ట్ తో తీవ్రంగా నిరాశ చెందిన అక్కినేని వారి నటవారసుడు అఖిల్.. ఎట్టకేలకు నాలుగో చిత్రమైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తో హ్యూజ్ సక్సెస్ సాధించారు. ఈ సినిమా యూత్ ను వివరీతంగా అలరిస్తుండడంతో.. ఓవర్సీస్ లో సైతం డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా విజయోత్సాహంలో ఉన్న అఖిల్.. తదుపరి చిత్రం ‘ఏజెంట్’ విషయంలో మరింత కేర్ఫుల్ గా అడుగులేస్తున్నారు. ఇక దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ .. దాదాపు 13 ఏళ్ళ తర్వాత మళ్ళీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’  సినిమాతో అద్భుతమైన విజయం సొంతం చేసుకున్నారు.  ‘బొమ్మరిల్లు’ మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన భాస్కర్.. ఆ తర్వాత బన్నీతో తీసిన ‘పరుగు’ మూవీ యావరేజ్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత వచ్చిన ‘ఆరెంజ్, ఒంగోలు గిత్త’,  తొలి తమిళ డెబ్యూ ‘బెంగళూర్ నాట్కళ్’ మూవీస్ భాస్కర్ కు భారీ డిజాస్టర్స్ అందించాయి. అయినా సరే.. ఏమాత్రం డీలా పడకుండా.. ఈ సినిమాతో మళ్ళీ ఇన్నాళ్ళకు తిరిగి ఫామ్ లోకి వచ్చారు భాస్కర్. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్, భాస్కర్ ఇద్దరూ టాలీవుడ్ లో యమా బిజీ అవుతారని వేరే చెప్పాల్సిన పనిలేదు.