Abn logo
Oct 22 2021 @ 00:50AM

వీరులారా.. వందనాలు..!

పోలీసు అమరవీరులకు ఘన నివాళి

కొవిడ్‌లో పోలీసుల సేవలు వెలకట్టలేనివి

అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుద్దాం

మహిళలకు రక్షణగా దిశ చట్టం

జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన, డీఐజీ కాంతిరాణా టాటా, ఎస్పీ ఫక్కీరప్ప

అనంతపురం క్రైం, అక్టోబరు 21: కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో పోలీసులు అందించిన సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన, అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతిరాణా టాటా, ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప కొనియాడారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి,  జిల్లాకు ప్రత్యేక గర్తింపు తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని అమరవీరుల స్థూపం వద్ద పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వీరు హాజరయ్యారు. ముందుగా అతిథులు.. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు సమాజం ప్రశాంతంగా ఉండాలంటే పోలీసుల పాత్ర కీలకమన్నారు. సమాజంలో ఉగ్రవాదులు, మావోయిస్టులు, తదితర అసాంఘిక శక్తులు ఉన్నప్పటీకి ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే పోలీసుల సమర్థవంతమైన సేవలే అందుకు కారణమని కొనియాడారు. దిశ చట్టం మహిళలకు రక్షణతో పాటు మరింత భద్రత కల్పిస్తోందన్నారు. డీఐజీ కాంతిరాణా టాటా మాట్లాడుతూ.. జిల్లాలోని పోలీసులు కొవిడ్‌ సమయంలో అందించిన సేవలు ఎప్పటీకి మరవలేనివని కొనియాడారు. ఆ సమయంలో 14 మంది పోలీసులు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రభుత్వం, పోలీసుశాఖ పరంగా బాధిత కుటుంబాలకు తగిన ప్రయోజనాలను కల్పించామన్నారు. ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప మాట్లాడుతూ... సమాజ సంరక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, ప్రతిఒక్కరూ పని చేయాలన్నారు. పోలీసుశాఖ పరంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు అనంతరం అమర వీరులను స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత అమరవీరుల స్థూపం వద్ద నివాళుర్పించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ నిశాంతకుమార్‌, జడ్పీ చైర్‌పర్సన గిరిజమ్మ, ఏఎస్పీలు నాగేంద్రుడు, హనుమంతు, రామ్మోహనరావు, రామకృష్ణప్రసాద్‌, డీఎస్పీలు ఉమామహేశ్వరరెడ్డి, శ్రీనివాసులు, మహాబూబ్‌బాషా, చైతన్య, ప్రసాద్‌రెడ్డి, ప్రసాద్‌రావు, ఏఓ శంకర్‌, పలు విభాగాల సూపరింటెండెంట్లు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడ్‌హక్‌ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్‌నాథ్‌, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసులునాయుడు, ఆనంద్‌, సరోజ, న్యాయ సలహాదారు విష్ణువర్దనరెడ్డి, పలువురు సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


ఆర్థిక చేయూత

పోలీసు అమర వీరుల కుటుంబాలకు ప్రభుత్వం, పోలీసుశాఖ సంయుక్తంగా ఆర్థిక చేయూత అందించాయి. కలెక్టర్‌, డీఐజీ, ఎస్పీ.. బాధిత కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు, చెక్కులను అందజేశారు. కొందరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగ కల్పన పత్రాలను అందజేశారు. రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మురళీకృష్ణ మృతి చెందడంతో అతడి భార్యకు రూ.10.25 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

- నగరంలోని పోలీసు శిక్షణ కళాశాల (పీటీసీ)లో పోలీసు అమర వీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతిరాణాటాటా అమర వీరుల స్థూపానికి గౌరవ వందనం చేసి, నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌ నేపథ్యంలో అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఎస్పీలు దేవదాస్‌, అల్లాబకష్‌, శ్రీనివాసులు, సీఐలు, ఎస్‌ఐలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.