పాపం.. ఈ హీరోలు ఇబ్బందులు పడుతున్నారు!

కోలీవుడ్: కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బకు చిత్రపరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. ఒకవైపు థియేటర్లు మూతపడటం, మరోవైపు షూటింగులు ఆగిపోవడంతో సెలెబ్రిటీల నుంచి లైట్‌ మ్యాన్‌ వరకు తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. పలు చిత్రాలను పూర్తి చేసిన పలువురు హీరోల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పూర్తి చేసిన సినిమాలు విడుదలకు నోచుకోక, కొత్తగా అంగీకరించిన ప్రాజెక్టులు పూర్తిచేయలేక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఒక ఏడాది ఒకటి రెండు చిత్రాల్లో నటించే హీరోలకు ఎలాంటి సమస్యాలేదని చెప్పొచ్చు. కానీ, ఒక ఏడాదిలో అరడజను సినిమాల్లో నటించే హీరోలకే ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిపడింది. వీరు ఇప్పటికే పూర్తి చేసిన చిత్రాలు విడుదల కాలేదు. అలాగే, ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయలేక, కొత్తగా వచ్చే ప్రాజెక్టులను అంగీకరించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారిలో హీరోలు విజయ్‌ సేతుపతి, హీరోగా మారిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌, అరుణ్‌ విజయ్‌, విజయ్‌ ఆంటోనీలు ఉన్నారు. 


విజయ్‌ సేతుపతి నటించిన ‘తుగ్లక్‌ దర్బార్‌’, ‘కడైసి వివసాయి‘, ‘మామణిదన్‌’, ‘లాభం’, ‘యాదుం ఊరే యావరుం కేళీర్‌’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే, జీవీ ప్రకాష్‌ నటించిన ‘జంగరన్‌’, ‘జైల్‌’, ‘అయిరమ్‌ జెన్మంగళ్‌’, ‘బ్యాచిలర్‌’, ‘అడంగాదే’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇకపోతే అరుణ్‌ విజయ్‌ నటించిన ‘అగ్నిచ్చిరకుగళ్‌’, ‘బార్డర్‌’, ‘సినమ్‌’.. విజయ్‌ ఆంటోనీ నటించిన ‘తమిళరసన్‌’, ‘కొడియిల్‌ ఒరువన్‌’, ‘అగ్నిచ్చిరకుగళ్‌’, ‘కాక్కి’ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. థియేటర్లు మూసివేయడంతో ఈ చిత్రాలు ఎపుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయో తెలియదు.  

Advertisement