Abn logo
Mar 22 2020 @ 22:35PM

మితిమీరిన అందాల ఆరబోత నా వల్ల కాదు: అమృతా అయ్యర్‌

‘30 రోజుల్లో ప్రేమించడమెలా’గో తెలుగువారికి చెప్పడానికి వెండితెర మీద దర్శనమివ్వబోతోంది అమృతా అయ్యర్‌. అవడానికి అమృత కన్నడ భామే అయినా ముందుగా మలయాళంతోనే వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత కోలీవుడ్‌లో పలు సినిమాలు చేసినా ఇలయ దళపతి విజయ్‌ ‘బిగిల్‌’ సినిమాలో కీర్తనగా తమిళ తంబీలకు మరింత చేరువైంది. ఇప్పుడు తెలుగువారిని తన అందచందాలతో కట్టిపడేయానికి సిద్ధపడుతోంది. తొలి సినిమా విడుదల కాకుండా మరో రెండు సినిమాలను తన ఖాతాలో వేసుకున్న అమృతా అయ్యర్‌తో...


మీ గురించి...?

మాది బెంగళూరు. నా చదువంతా అక్కడే! మా సిస్టర్‌ ప్రియాంక. తను మంచి డ్యాన్సరే కాదు బాడ్మింటన్‌ క్రీడాకారిణి కూడా. తను కర్నాటక ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. మాది చాలా సంప్రదాయ కుటుంబం. మా కుటుంబంలో ఇంత వరకూ నాకు తెలిసి ఎవరూ సినిమాల్లోకి రాలేదు. నేనే మొదటిదాన్ని.


సినిమాల్లోకి వస్తానంటే మీ పేరెంట్స్‌ ఏమీ అనలేదా?

చదువుకునే రోజుల్లోనే నేను మోడలింగ్‌ చేసేదాన్ని. సరదాగా మోడలింగ్‌ చేస్తానంటే ఒప్పుకున్నారు. మోడలింగ్‌ చేస్తున్న సమయంలోనే మలయాళంలో అవకాశం వచ్చింది. ఒకటి రెండు సినిమాలు చేసి ఆ తరువాత మానేద్దామని అనుకున్నాను. కోలీవుడ్‌లో విజయ్‌గారితో చేసిన ‘బిగిల్‌’ సూపర్‌ డూపర్‌ హిట్‌. ఆ తరువాత అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తెలుగులో నా మొదటి సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడమెలా’. దీని షూటింగ్‌ జరుగుతున్నప్పుడే రెండు సినిమాలకు కమిట్‌ అయ్యాను. తెలుగులో నాగశౌర్యగారి పక్కన చేస్తున్న సినిమా షూటింగ్‌ త్వరలోనే మొదలు కాబోతోంది. వరుస అవకాశాలు వస్తుండడంతో వారు కూడా ఏమీ అనడం లేదు. నాతో కాంప్రమైజ్‌ అయిపోయారు. 


తెలుగులో హీరో రామ్ సరసన చేస్తున్న ‘రెడ్‌’ సినిమా గురించి..?

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో ఓ పాత్ర చేస్తున్నాను. ఇది కూడా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా గురించి ఇప్పుడే అన్ని విషయాలు చెప్పేస్తే థ్రిల్‌ ఉండదు.


గ్లామర్‌గా కనిపించడానికి అభ్యంతరాలున్నాయా?

ఇది గ్లామర్‌ ఫీల్డ్‌ అని తెలిసే వచ్చాను. అందంగా చూపిస్తానంటే ఎలాంటి అభ్యంతరం లేదు. అలాగని మితిమీరిన అందాల ఆరబోత చేయమంటే మాత్రం నా వల్ల కాదు. ఈ విషయంలో నా లిమిట్స్‌ నాకున్నాయి. వాటిని ఎప్పుడూ క్రాస్‌ చేయను. 


కన్నడ అమ్మాయి కదా...భాష ఇబ్బంది అనిపించడం లేదా?

కష్టం అనుకుంటే ఏ పనైనా కష్టంగానే ఉంటుంది. చేయగలమని నమ్మితే తేలిగ్గానే చేయగలుగుతాం. భాష కూడా అంతే! మొదట కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కన్నడకూ, తెలుగుకూ దగ్గర సంబంధముంది. దాంతో తెలుగుతో ఎప్పుడూ పెద్దగా ఇబ్బంది పడలేదు. కానీ, తమిళ్, మలయాళం సినిమాలు చేసేటప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడ్డాను. కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తుండడంతో భాష బాగానే అర్ధమవుతోంది. మాట్లాడగలుగుతున్నాను. మలయాళమే ఇప్పటికీ కొద్దిగా కష్టంగా అనిపిస్తోంది.


బుల్లి తెర మీద కూడా చేసినట్టున్నారు?

ఒక్క సీరియల్‌ మాత్రమే చేశాను. ఇప్పుడు కూడా అవకాశాలొస్తున్నాయి కానీ, చేసేందుకు టైం లేదు. టైం దొరికితే మంచి సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు కనిపించాలని ఉంది. 


ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?

అనుకోకుండా నటిని అయ్యాను. ఇప్పటివరకూ ఫలానా పాత్ర చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి ఆలోచనే రాలేదు. భవిష్యత్తులో దానిగురించి ఆలోచిస్తానేమో!

–భరత్‌ కుమార్‌

Advertisement
Advertisement
Advertisement