Abn logo
Feb 24 2020 @ 23:54PM

నన్ను చేసుకోబోయే వాడు అలా ఉండాలి: పాయల్‌

ఎంత మోడర్న్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన అమ్మాయిలైనా సరే.. తెరమీద కొంచెం గ్లామరస్‌‌గా కనిపిస్తే వాళ్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు. కానీ ఆర్డీఎక్స్‌ సినిమాతో తెలుగువారికి పరిచయమైన పాయల్‌ రాజ్‌పుత్‌ మాత్రం మిగతా వారికి భిన్నమనే చెప్పాలి. తన సినిమాల్లో ముద్దు సీన్లు, ఇంటిమేట్‌ సన్నివేశాలలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా నటించడమే కాకుండా అలాంటి వాటి గురించి ముందే తన తల్లితో స్వేచ్చగా చర్చిస్తానంటున్న పాయల్‌ రాజ్‌ పుత్‌తో..


మొదటి రెండు సినిమాల్లో ఇంటిమేట్‌ సీన్లు ఎక్కువగా చేశారుకదా? అలాంటి పాత్రలు చేస్తే మీ పేరెంట్స్‌ ఏమీ అనరా?

సినిమాలకు సంబంధించి ప్రతిదీ మా అమ్మతో పంచుకోవడం నాకు అలవాటు. ఇప్పటికీ నేను ఏదైనా స్క్రిప్టు వింటే అందులోని విషయాలన్నీ అమ్మతో పంచుకుంటా. ఇన్ని ముద్దు సీన్లు ఉన్నాయి.. ఇలాంటి రొమాంటిక్ సీన్లు ఉంటాయని చెబుతుంటా. నీ మనసుకు నచ్చి నీకు సౌకర్యంగా అనిపిస్తే ఏదైనా చేయి అని ఆమె సలహా ఇస్తుంది. అయితే బోల్డ్‌గా ఉండే పాత్రలు ఎంత ఇష్టపడి చేసినా.. అమ్మానాన్నలతో కలిసి చూడటం అసౌకర్యంగానే ఉంటుంది. అలాగని అలాంటి పాత్రలు చేయవద్దంటూ నన్ను కట్టడి చేయరు.  


మీది చాలా పెద్ద కుటుంబమట నిజమేనా?

నిజమే! మాది ఉమ్మడి కుటుంబం కావడంతో ప్రతి పండగ మా ఇంట్లో ఒక పెద్ద సంబరంలా జరుగుతుంది. ముఖ్యంగా దసరా, దీపావళి లాంటి పండగలు మరింత ప్రత్యేకంగా చేస్తారు. నాకు ఖాళీ దొరికితే చాలు అమ్మతో కలిసి వంట గదిలో దూరిపోతా. నాకు అన్ని వంటలూ వచ్చు. ముఖ్యంగా పంజాబీ వంటకాలు అదరగొట్టేస్తా. ప్రస్తుతం మాంసాహారం తినడం మానేశా.


ఐటెంసాంగ్స్‌ కంటిన్యూ చేస్తారా?

ఏదో ఒక సినిమా అంటే చేసాను తప్ప, వరుసగా ఐటెంసాంగ్స్‌ చేసే ఆలోచన నాకు లేదు. ఇప్పటికి చాలా మంది నన్ను ఐటెంసాంగ్ చేయమని అడుగుతున్నారు కానీ నాకే నచ్చక చేయడం లేదు. వాటి ద్వారా గుర్తింపు కన్నా, నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే నాకు ఇష్టం. 


ఇప్పటికైనా మీ సినిమా కష్టాలు తీరినట్టేనా?

దాదాపు తీరినట్టే! మంచి హీరోయిన్‌ అనిపించుకోవడానికి ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాను. దక్షిణాదిన అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటే కోలీవుడ్‌లో కొందరు నన్ను దారుణంగా విమర్శించారు. నా ముఖం దక్షిణాదికి పనికిరాదని ముఖం మీదే చెప్పేసారు. ఆ మాటలు గుర్తుకు వస్తే ఇప్పటికీ నాకు కన్నీళ్ళు ఆగవు. వారు అలా విమర్శించడం నా మంచికే జరిగిందని అప్పుడప్పడు అనిపిస్తూ ఉంటుంది. 


భవిష్యత్తులో కోలీవుడ్‌లో చేసే ఉద్దేశం లేనట్టేనా?

ఎవరో ఒకరు నన్ను విమర్శించారనీ, మొత్తం ఇండస్ట్రీని తప్పు పట్టడం నాకు నచ్చదు. అక్కడ ఎవరికైనా నాతో పనిచేయాలని అనిపించి నా దగ్గరకు వస్తే అక్కడ తప్పకుండా పనిచేస్తాను. 


బాలీవుడ్‌కి వెళ్ళే ఉద్దేశం ఉందా?

వెళ్ళను. నాకు దక్షిణాదిన బాగుంది. నటీనటులను ఇక్కడి వారు నిజాయితీగా ప్రేమిస్తారు, ఆదరిస్తారు. వీరి అభిమానం చూస్తుంటే సొంత వ్యక్తులు గుర్తుకు వస్తారు. ఇంతటి అభిమానాన్ని వదులుకుని బాలీవుడ్‌కి వెళ్ళడం ఎందుకు? బాలీవుడ్‌లో స్టార్స్‌ అంటే ఇంత క్రేజ్‌ ఉండదు. ఇప్పటి వరకూ నాకు అక్కడి నుంచి ఎలాంటి అవకాశాలు రాలేదు. వచ్చినప్పుడు ఆలోచిస్తాను.


ప్రేమా, పెళ్ళి గురించి..

నన్ను చేసుకోబోయే వాడు అందంగా ఉండాలి.. ఇంత ఎత్తుండాలనేమీ చెప్పను. నాకు తగ్గట్టుగా ఉంటే చాలు. హాస్య చతురత మాత్రం తప్పనిసరి. నేనే విషయంలోనైనా అలిగితే నన్ను బుజ్జగించాలి. భవిష్యత్తులో చేసుకుంటే గీసుకుంటే ఖచ్చితంగా ప్రేమ పెళ్లి చేసుకుంటా. చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని మాత్రం అస్సలు చేసుకోను. 

–కె.రామకృష్ణ

Advertisement
Advertisement
Advertisement