ప్రేమలోనే ఉంటాం.. కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు: రకుల్

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ చిత్రం ‘థ్యాంక్ గాడ్’ విడుదలకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో నడుస్తున్నాయి. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్.. చిత్ర విశేషాలతో పాటు, తన పెళ్లి విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది. పెళ్లికి అప్పుడే తొందరపడటం లేదన్న రకుల్.. ప్రేమికుడైన జాకీ భగ్నానీతో ఇంకొంత కాలం ప్రేమలోనే ఉండాలని అనుకుంటున్నట్లుగా తెలిపింది.

ఆమె మాట్లాడుతూ.. ‘‘నా వ్యక్తిగత విషయాలు గురించి చెప్పడానికి అస్సలు ఇష్టపడను. నా ప్రేమ అనేది నా వ్యక్తిగతమైన విషయం. కానీ ఎందుకు రివీల్ చేశానంటే.. అది నా వ్యక్తిగత విషయమే అయినా.. చాలా అందమైన విషయం. అందుకే అందరితో పంచుకోవాలని అనిపించింది. నాకు నచ్చిన విషయం గురించి ఎవరైనా మాట్లాడుతుంటే వినడానికి కూడా నేను ఇష్టపడతాను. అందుకే నా ప్రేమ విషయాన్ని అందరితో పంచుకున్నాను. అయితే ప్రేమ గురించి చెప్పాను కదా.. అని పెళ్లి ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారు. అలాంటి వారందరికీ నేను చెప్పేది ఏమిటంటే.. పెళ్లి విషయంలో మేము తొందరపడటం లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్‌పైనే ఉంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. కొన్ని రోజులు మేమిద్దరం ప్రేమలో ఉండాలనుకుంటున్నాము. పెళ్లి చేసుకోవాలని అనిపించినప్పుడు మాత్రం అందరికీ ఆ విషయాన్ని తప్పకుండా తెలియజేస్తాను. ప్రస్తుతం నటనపైనే నా దృష్టంతా ఉంది” అని రకుల్ తెలిపింది.

Advertisement