Oct 21 2021 @ 17:28PM

‘ఎఫ్ 3’కి గ్లామర్ డోస్‌ ఇచ్చేందుకు వచ్చేసింది

‘ఎఫ్ 2’కి మించిన వినోదాన్ని పంచేలా దర్శకుడు అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘ఎఫ్ 2’లో ఉన్నట్టుగానే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్‌లు తమ పాత్రలను పోషిస్తుండగా రాజేంద్ర ప్రసాద్ తన పాత్రను కంటిన్యూ చేస్తున్నారు. ఇక సునీల్ కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అతనితో పాటు ఈ సినిమాకు మరింత గ్లామర్ డోస్ ఇచ్చేందుకు హీరోయిన్ సోనాల్ చౌహాన్‌ను కూడా తీసుకున్నట్లుగా ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది.

ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో సోనాల్ చౌహాన్ షూటింగ్‌లో జాయిన్ అయినట్లుగా తెలుపుతూ.. ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లో గత కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ సుధీర్ఘ షెడ్యూల్‌లో దాదాపు ముఖ్య తారాగణం అంతా పాల్గొంటున్నట్లుగా మేకర్స్ తెలిపారు. కాగా, ఈ ప్రాజెక్ట్‌లో తనని కూడా భాగం చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లుగా సోనాల్ చౌహాన్ తెలుపగా.. ఈ ప్రాజెక్ట్‌లోకి ఆమెను స్వాగతిస్తున్నట్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు.