Abn logo
Mar 24 2020 @ 22:58PM

ఆ విషయంలో పెద్దల మాట వినను: త్రిష

సౌత్ సినీ ఇండస్ట్రీని గత 18 ఏళ్లుగా ఏలుతూ వస్తోంది హీరోయిన్‌ త్రిష. తెలుగు, తమిళ భాషల్లోని అగ్రహీరోలందరితో తెరపై రొమాన్స్ చేసి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది ఈ చెన్నై సుందరి. కెరీర్‌లో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న ఈ మధ్యకాలంలో కాస్త స్లో అయింది. దీంతో ఇక పెళ్ళి చేసుకుంటుందేమో అనే టాక్ బయటకొచ్చింది. అయితే అవన్నీ ఊహాగానాలే అంటున్న త్రిషతో...


ఇటీవలి కాలంలో నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారట?

ఆ అలవాటు నాకు మొదటి నుంచీ లేదు. రమ్మన్న సమయానికి రావడం, షూటింగ్‌ అయిపోయేంత వరకూ ఉండడం అలవాటు. అదేవిధంగా ప్రమోషన్లకు కూడా కరెక్ట్‌ టైముకే వస్తాను. ఇటీవలి కాలంలో చూసుకోకుండా ఒకే సమయాన్ని ఇద్దరికి ఇవ్వడంతో ఇలాంటి వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత టైమ్‌ కొద్దిగా అడ్జస్ట్‌ చేసుకుని రెండు కార్యక్రమాలకి హాజరయ్యాను. అప్పుడప్పుడు ఇలాంటివి కామన్‌. దానికి నేను నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాను అనడం భావ్యం కాదు.


ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు?

ఎక్కువ సినిమాలు చేతిలో ఉన్నప్పుడు తక్కువ టైమ్‌ దొరుకుతుంది. అసలు నా గురించి నేను పట్టించుకోలేనంత బిజీగా ఉంటాను. అందుకే దొరికిన కొద్ది ఖాళీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాను. అసలు మనం ఏం చేస్తున్నాం? చేస్తున్న సినిమాలు ప్రేక్షకులకు నచ్చుతున్నాయా? లేదా అని విశ్లేషించుకుంటాను. అలాగే వ్యక్తిగతంగా లైఫ్‌ ఎలా ఉంది? అని సెల్ఫ్‌ చెక్‌ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాను. దొరికిన టైమ్‌లోనే నాతో నేను ఎక్కువగా గడుపుతాను. స్ట్రెస్‌గా ఉన్నప్పుడు ఎలానూ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్‌ నాకు తోడుగా ఉంటారు 


మాలీవుడ్‌లోకి అడుగుపెట్టినట్టున్నారు?

మాలీవుడ్‌లో సినిమా చేయక పదిహేను సంవత్సరాలకు పైగా అయింది. కెరీర్‌ ప్రారంభంలో అక్కడ సినిమా చేశాను. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. అక్కడ మంచి కథలు, మంచి అవకాశాలొస్తున్నాయి. అందుకే అక్కడ చేస్తున్నాను. 


మీ పెళ్ళి విషయంలో వస్తున్న వార్తల గురించి?

త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాన్న వార్తలు వచ్చాయి. పెళ్ళి చేసుకుంటానని చెప్పానే తప్ప ఎప్పుడు చేసుకుంటానని చెప్పలేదు. పెళ్ళి విషయంలో పెద్దలు చెప్పిన మాట వినను. వారు చూసిన వ్యక్తిని మాత్రం చేసుకోను. ప్రేమించే చేసుకుంటాను. అదీ విదేశాల్లోనే చేసుకుంటాను. నాకు లాస్‌ వేగాస్‌ అంటే చాలా ఇష్టం. కుదిరితే అక్కడే చేసుకుంటాను. 


ఎలాంటి వ్యక్తిని చేసుకోవాలనుకుంటున్నారు?

నన్ను బాగా చూసుకునే వ్యక్తి అయి ఉండాలి. ఆ వ్యక్తి హీరో కానవసరం లేదు. అందచందాలతో పెద్దగా పనిలేదు. రంగు విషయంలో కూడా పట్టింపులు లేవు. ఎలా ఉన్నా ఫర్వాలేదు. మంచి మనసు ఉండాలి. నన్ను బాగా చూసుకోవాలి. అలాంటి వ్యక్తి దొరికితే వెంటనే చేసుకుంటాను. 


ఓ వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నారట?

ఆ విషయం నాకు ఇంత వరకూ తెలియదు. నాకు తెలియకుండా డేటింగ్‌లో ఉన్నానేమో! 


సినిమాల్లోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మీలో ఏమార్పు రాలేదు? మీ సీక్రెట్‌ ఏమిటి?

రహస్యం ఏమీ లేదు. నాకు ఉపవాసాల మీద పెద్దగా నమ్మకం ఉండదు. నోరు కట్టుకుని డైటింగ్‌ చేయడం కూడా ఇష్టం ఉండదు. కడుపు నిండా తిని, కంటినిండా నిద్రపోతాను. వ్యాయామం కూడా ప్రతిరోజూ చేయాలంటే నాకు బోర్‌. వారంలో నాలుగైదు రోజులు మాత్రమే చేస్తాను. నేను ఏమాత్రం బరువు పెరగకపోవడానికి నా శరీరతత్వం కూడా ఓ కారణం. 


తెలుగు సినిమాల్లో నటించను అన్నారట?

ఇది పూర్తిగా అబద్ధం. నాకు హీరోయిన్‌గా గుర్తింపు వచ్చింది తెలుగు సినిమాలతోనే! అలాంటిది ఇక్కడ నటించను అని ఎందుకు చెబుతాను? ఓ తెలుగు సినిమాలో నటించమని అడిగారు. అంతకన్నా ముందే కోలీవుడ్‌లో సినిమాలకు కమిట్‌ అయ్యాను. వాటికి ఇబ్బంది అవుతుందని నటించలేనని చెప్పానే తప్ప తెలుగు సినిమాలు చేయను అని చెప్పలేదు. 

–కె. రామకృష్ణ

Advertisement
Advertisement
Advertisement