గుప్త నిధులు

ABN , First Publish Date - 2021-04-01T05:53:44+05:30 IST

నేటినుంచి పదహారో విడత ఎన్నికల బాండ్లు విడుదల కాబోతున్నాయి కనుక, ఈ ఖర్చుదారీ ఎన్నికల వేళ రాజకీయపార్టీలను ఆదుకోదల్చుకున్నవారు...

గుప్త నిధులు

నేటినుంచి పదహారో విడత ఎన్నికల బాండ్లు విడుదల కాబోతున్నాయి కనుక, ఈ ఖర్చుదారీ ఎన్నికల వేళ రాజకీయపార్టీలను ఆదుకోదల్చుకున్నవారు ఆ పని నిరభ్యంతరంగా చేయవచ్చు. కేంద్రప్రభుత్వం, ఎన్నికల సంఘం ఈ బాండ్ల జారీమీద సానుకూలత చూపడంతో దేశ సర్వోన్నతన్యాయస్థానానికి స్టే ఇవ్వడానికి మనసు రాలేదు. పదిరోజుల పాటు అమ్మకంలో ఉండే ఈ బాండ్లు జారీ అయిన నాటి నుంచి పదిహేనురోజులు మాత్రమే చెల్లుతాయనీ, అంతలోగా రాజకీయపార్టీలు బ్యాంకు ఖాతాల్లో వాటిని డిపాజిట్‌ చేసుకోవాలని ఆర్థికమంత్రిత్వశాఖ ప్రకటించింది.


ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఈ బాండ్ల విక్రయంపై స్టే ఇవ్వాలని కోరుతూ ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌– (ఏడీఆర్‌)’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రార్థించినప్పుడు, మూడేళ్ళుగా వీటి విక్రయం నిరాఘాటంగా సాగుతున్నప్పుడు, ఇప్పుడు స్టే అవసరం ఏమిటని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు కొత్త బాండ్లను విక్రయిస్తే షెల్‌కంపెనీలు పుట్టుకొచ్చి పార్టీలకు అక్రమ నిధులు సమకూరుతాయన్నది ఏడీఆర్‌ వాదన. బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తుల, సంస్థల పేర్లు గోప్యంగా ఉంచడంవల్ల విదేశీ కంపెనీలనుంచి నిధులు వచ్చిపడుతున్నాయనీ, పార్టీల అకౌంట్లలోనూ పారదర్శకత లేకుండా పోతున్నదని ఏడీఆర్‌ ఆవేదన. అక్రమానికి అవకాశమే లేదని అటార్నీ బల్లగుద్ది వాదించడం, ఎన్నికల సంఘం కూడా విక్రయానికి అనుకూలంగా వినయంగా తలూపడంతో సుప్రీంకోర్టుకు కేసుకొట్టేయడం సులభమైంది.


చాలా కేసులు విచారణకు స్వీకరించినప్పుడు, వాదనలు వింటున్నప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఎన్నికల బాండ్లకు సంబంధించి అసలు కేసు ఇంకా విచారణలో ఉండగా, అనుబంధ దరఖాస్తు ఆధారంగా స్టే ఇవ్వడం కుదరదని న్యాయస్థానం అనదల్చుకున్నప్పుడు, నిజానికి ఈ అభ్యర్థన వినాల్సిన అవసరమే లేదు. మూడేళ్లుగా ఎన్నికల బాండ్ల విధానం అమల్లో ఉన్నంత మాత్రాన అది పవిత్రమైనదీ, లోపరహితమైనదీ కానక్కరలేదు. పారదర్శకతకు ద్రోహం చేస్తూ, ప్రతీ దశలోనూ గోప్యతను పాటిస్తున్న ఈ బాండ్లు అడ్డదోవలో సాగే నగదులావాదేవీలకంటే అన్యాయమైనవని ఏడీఆర్‌ ఎప్పటినుంచో మొత్తుకుంటున్నది. ఇచ్చినవారెవ్వరో, పుచ్చుకున్నదెవరో, ఎంత ఇచ్చారో, ఎందుకిచ్చారో ప్రజలకు తెలియకుండా రాజకీయపార్టీలకు రహస్యంగా కోట్లాది రూపాయలు సమకూర్చే ఈ విధానం ఇంకా కొనసాగడంలో న్యాయస్థానం పాత్ర కూడా కొంతమేరకు ఉంది. రెండేళ్ళుగా నడుస్తున్న కేసు ఎప్పటికి తేలుతుందో తెలియదు కానీ, అంతవరకూ ఆ చట్టాన్ని నిలిపివేయకూడదనీ, ముట్టుకోకూడదని కోర్టు భావిస్తోంది. కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలకు, చివరకు తీసుకున్న నిర్ణయానికీ హస్తిమశకాంతరం ఉన్నది. ప్రతిపక్షాలకు విరాళాలు ఇచ్చేవారిపై అధికారపక్షం కక్షగట్టే అవకాశాలున్నాయని పిటిషనర్‌ అన్నప్పుడు, అదే నిజమైతే చట్టాన్నే రద్దుచేయాల్సి ఉంటుందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. మొత్తం విరాళాల్లో 2019లో తొంభైశాతం, 2020లో అరవైశాతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకే పోయినప్పుడు, ప్రతిపక్షాలకు విరాళాలు ఇచ్చి దాతలెవరూ కొరివితో తలగోక్కోదల్చుకోలేదని అర్థం. దాతల, గ్రహీతల వివరాలు ప్రజలకు తెలియవు కానీ, ప్రభుత్వానికి అంటే, పాలకపక్షానికి తెలియకుండా పోదు. భూరివిరాళం ఇచ్చినవారెవ్వరో తెలిస్తే, అనంతర కాలంలో సదరు సంస్థకు ఏ కాంట్రాక్టు ఎందుకు దక్కిందో ప్రజలకు తెలిసిపోయే ప్రమాదం ఉంటుంది. పోటీచేస్తున్న అభ్యర్థుల ఆస్తిపాస్తులు, క్రిమినల్‌ రికార్డులు తెలుసుకొనే హక్కు ఉన్న ఓటరుకు విరాళాల వివరాలు మాత్రం తెలుసుకొనే అవకాశం లేదు. బాండ్లు కొనుగోలు చేసే కంపెనీలకు ఉండాల్సిన అర్హతలను పాలకులు సవరించుకుంటూ పోతుంటే, నిధుల సేకరణ లక్ష్యంతోనే షెల్‌ కంపెనీలు, కొత్త రాజకీయ పార్టీలూ పుట్టుకొస్తుంటే, సర్వోన్నత న్యాయస్థానం ప్రక్రియను తాత్కాలికంగా కూడా ఆపననడం విచిత్రమే.

Updated Date - 2021-04-01T05:53:44+05:30 IST