ఈటలపై అధిష్టానం సీరియస్.. సస్పెండ్ చేస్తుందా..!?

ABN , First Publish Date - 2021-05-06T18:16:58+05:30 IST

మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‘భూ’ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది...

ఈటలపై అధిష్టానం సీరియస్.. సస్పెండ్ చేస్తుందా..!?

హైదరాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‘భూ’ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఆయన హుజురాబాద్‌కు వెళ్లి అనుచరులను కలవడం, మీటింగ్‌లు ఏర్పాటు చేస్తుండటంతో అధిష్టానం మరింత సీరియస్ అవుతోంది. మరోవైపు.. ఈటలను టార్గెట్ చేస్తూ మంత్రులు, ఆ పార్టీ నేతలు కొందరు మీడియా మీట్‌లు పెట్టి తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించడంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా అనర్హుడిగా ప్రకటించాలని కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ స్పీకర్‌‌కు ఫిర్యాదు చేయాలని కూడా జిల్లా నేతలు యోచిస్తున్నారు. కాగా.. ఇప్పటికే ఈటలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్‌కు కరీంనగర్ జిల్లా నేతలు లేఖ ఇచ్చారు.


రాజీనామా యోచనలో ఈటల..!

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, టీఆర్‌ఎస్‌ నుంచి బయటికి వచ్చాక ఈటల కొత్త పార్టీ పెడతారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కానీ, ఇంట గెలిచాకే రచ్చ గెలవాలనే ఆలోచనతో ఆయన ఉన్నారని తెలుస్తోంది. రాజీనామాతో హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక తీసుకొచ్చి, అక్కడ గెలిచి టీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసరాలని, ఆపై కలిసివచ్చే వ్యక్తులు, శక్తులతో కలిసి ముందుకు సాగాలనేది ఉద్దేశంగా చెబుతున్నారు. అయితే పార్టీ సస్పెండ్ చేసే దాకా ఆయన వేచి చూస్తారా లేకుంటే ముందే రాజీనామా చేసేస్తారా అనేది వేచి చూడాలి. రాజీనామా చేస్తే.. ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌ అసెంబ్లీకి ఖాళీ ఏర్పడ్డ రోజు నుంచి ఆరు నెలల్లోగా ఎప్పుడైనా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.

Updated Date - 2021-05-06T18:16:58+05:30 IST