‘సీట్ల’ జీవో సస్పెన్షన్

ABN , First Publish Date - 2020-10-22T09:45:29+05:30 IST

ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల సీట్లను తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన జీవోను హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ వ్యవహారంలో

‘సీట్ల’ జీవో సస్పెన్షన్

‌ ప్రైవేటు కాలేజీల పిటిషన్‌పై హైకోర్టు


అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల సీట్లను తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన జీవోను హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి తదితరులను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో సీట్లను కుదిస్తూ పాఠశాల విద్యాశాఖ గత మే నెలలో జీవో 23ను జారీ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ సెంట్రల్‌ ఆంధ్రా జూనియర్‌ కళాశాల యాజమాన్యాల సంఘ అధ్యక్షుడు కె.బ్రహ్మయ్య తదితరులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై మంగళవారం న్యాయమూర్తి ముందు విచారణ జరగ్గా.. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఇంటర్‌బోర్డు కార్యదర్శి నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. నిర్ణీత కాలంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించినా స్పందనలేదని, వారి నిర్లక్ష్య ధోరణి వల్లనే అధికారులను పిలిపించాల్సి వచ్చిందని వివరించారు.


విచారణ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాది జీఆర్‌ సుధాకర్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ జీవో కారణంగా ప్రైవేటు కళాశాలలతోపాటు విద్యార్థులు కూడా నష్టపోయే అవకాశం ఉందన్నారు. గతంలో ఒక్కో కళాశాలలో సెక్షన్‌కు 88 మందిని అనుమతించేవారని, మొత్తం 9 సెక్షన్లలో 792 మందికి అవకాశం కల్పించారన్నారు. తాజా జీవోతో సెక్షన్‌కు 40 చొప్పున 9 సెక్షన్లకు 360 మందిని మాత్రమే చేర్చుకోగలరన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కళాశాలలు సిబ్బందిని నియమించుకుని, మౌలిక సదుపాయాలను కల్పించాయని, ఇప్పుడు హఠాత్తుగా సీట్ల కుదింపు వల్ల ప్రైవేటు కళాశాలలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. ప్రభుత్వ కళాశాలలకు నిబంధనలు విధించకుండా కేవలం ప్రైవేటు కళాశాలలకే వర్తింపజేయాలనుకోవడం సరికాదన్నారు. అందువల్ల ఆ జీవోను రద్దు చేయాలని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కొన్ని ప్రైవేటు కళాశాలలు తరగతుల్ని అపార్ట్‌మెంట్లలో నిర్వహిస్తున్నాయని, చిన్న చిన్న గదుల్లో 88 మందిని కుక్కుతున్నారని తెలిపారు. కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదన్నారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకే జీవో తెచ్చామన్నారు. తగిన మౌలిక సదుపాయాలు కల్పించిన కళాశాలలకు ఈ జీవోతో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. సెక్షన్‌కు ఎన్ని సీట్లు ఉండాలో కోర్టు ఖరారు చేస్తే.. ఆమేరకు భర్తీ చేస్తామన్నారు. అందువల్ల ప్రభుత్వ విధానాన్ని నిలువరించరాదని అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ప్రభుత్వ జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.


తుళ్లూరు రిటైర్డ్‌ తహసీల్దార్‌ పిటిషన్‌ కొట్టివేత

రాజధానిలో అసైన్డ్‌ భూముల వ్యవహారానికి సంబంధించి సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండల రిటైర్డ్‌ తహసీల్దారు సుధీర్‌బాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసుపై దర్యాప్తు జరగాల్సిందేనని, ప్రాథమిక దశలో దర్యాప్తును నిలిపివేయరాదని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని గుర్తు చేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ బుధవారం తీర్పు వెలువరించారు.

Updated Date - 2020-10-22T09:45:29+05:30 IST