గవర్నర్‌ ఎలా ఆమోదిస్తారు?

ABN , First Publish Date - 2020-12-01T09:40:23+05:30 IST

పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలకు సంబంధించిన బిల్లుల్ని శాసనమండలి చైర్మన్‌ సెలక్ట్‌ కమిటీకి సిఫారసు చేసిన తర్వాత, వాటిని మరోసారి శాసనసభలో

గవర్నర్‌ ఎలా ఆమోదిస్తారు?

ఆ బిల్లులను మండలి చైర్మన్‌ సెలక్ట్‌ కమిటీకి పంపారు 

వాటిని మళ్లీ శాసనసభలో ప్రవేశపెట్టడం చట్టవిరుద్ధం 

బిల్లుల ఆమోద ప్రక్రియ సరిలేకుంటే న్యాయసమీక్ష చేయొచ్చు 

హైకోర్టుకు వివరించిన న్యాయవాది ఆదినారాయణరావు


అమరావతి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలకు సంబంధించిన బిల్లుల్ని శాసనమండలి చైర్మన్‌ సెలక్ట్‌ కమిటీకి సిఫారసు చేసిన తర్వాత, వాటిని మరోసారి శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు హైకోర్టుకు వివరించారు. బిల్లుల వ్యవహారం మండలిలో పెండింగ్‌లో ఉండగా వాటిని గవర్నర్‌ ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. ఇది ఏమాత్రం చెల్లుబాటు కాదన్నారు. ఆ బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీకి పంపించాలని మండలి చైర్మన్‌ ఆదేశాలు జారీ చేశాక కూడా కమిటీని ఏర్పాటు చేయకపోవడం ఘోర తప్పిదంగా పేర్కొన్నారు. చైర్మన్‌ సిఫారసులను అధికారులు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదన్నారు. బిల్లుల్ని తిరస్కరించడం, ఆమోదించడం, సవరణ సిఫారసు చేయడం వంటి వాటిపై మండలి నిర్ణయం వెలువరించకముందే శాసనసభలో రెండోమారు ప్రవేశపెట్టడం చట్ట నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. అసెంబ్లీలో బిల్లుల ఆమోద ప్రక్రియ సరిగ్గా జరగనప్పుడు న్యాయస్థానాలు న్యాయసమీక్ష చేయవచ్చన్నారు. రాజధాని అంశాలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రోజువారీ తుదివిచారణ చేపడుతున్న విషయం తెలిసిందే.


ఇందులో భాగంగా ‘అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య’ ఉపాధ్యక్షుడు కల్లం పానకాలరెడ్డి బృందం, న్యాయవాది ఎస్‌.నరసింహారావు తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు సోమవారం వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకే రాజధాని కోసం రైతులు తమ భూముల్ని త్యాగం చేశారన్నారు.  భూసమీకరణ సందర్భంగా రాష్ట్రం వారితో ఒప్పందం చేసుకుందని, దానికి చట్టబద్ధత ఉందని గుర్తుచేశారు. చట్టబద్ధ ఒప్పందానికి రక్షణ ఉంటుందని, దాన్ని ప్రభుత్వాలు అమలు చేసి తీరాల్సిందేనన్నారు. ఇచ్చిన హామీ నుంచి రాష్ట్రం వెనక్కి తగ్గలేదన్నారు. చట్టబద్ధమైన ఒప్పందాలు కుదుర్చుకుని, రైతుల నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు మూడు రాజధానుల నిర్ణయం వైపు మళ్లడమంటే అది రైతుల హక్కులను హరించడమేనన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొనసాగించాల్సిందేనని, దాని అమలు నుంచి తప్పించుకోలేదని పేర్కొన్నారు. రాజధాని భూసమీకరణలో అక్రమాలు జరిగివుంటే వాటిపై చర్యలు చేపట్టాలి తప్ప, అభివృద్ధి పనుల్ని నిలిపేయడం సరికాదన్నారు.


ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తన మనసులోని ఉద్దేశాన్ని నెరవేర్చుకునేందుకు పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను తీసుకొచ్చిందన్నారు. అవి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా లేవని, వాటిని చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. రాజధానిపై ఒకసారి నిర్ణయం తీసుకున్నాక రెండో ఆలోచనకు తావు లేదని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే రూ.వేల కోట్లు వ్యయం చేశారని, ఇప్పుడు దానిని మారిస్తే ప్రజాధనం వృథా అవుతుందని పేర్కొన్నారు. ఆదినారాయణరావు పూర్తిస్థాయి వాదనల కోసం తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

Updated Date - 2020-12-01T09:40:23+05:30 IST