మున్సిపోల్స్‌కు ఓకే

ABN , First Publish Date - 2021-03-02T08:53:44+05:30 IST

పురపాలక, నగర పాలక, నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కొనసాగింపుగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) గత నెల 15న ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ

మున్సిపోల్స్‌కు ఓకే

ఆ నోటిఫికేషన్‌ను తప్పుబట్టలేం: హైకోర్టు

ఆగిన చోట నుంచే ఎన్నికలు పెడతామని

నిరుడు మార్చిలోనే ఎస్‌ఈసీ చెప్పింది

వాయిదాను సుప్రీం కూడా సమర్థించింది

హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

పుర పోరుపై పిల్‌ కొట్టివేత


అమరావతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): పురపాలక, నగర పాలక, నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కొనసాగింపుగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) గత నెల 15న ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో.. అక్కడి నుంచే ప్రారంభిస్తామని గత ఏడాది మార్చి 15న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎస్‌ఈసీ పేర్కొందని తెలిపింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి 27 రోజుల సమయాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను పిటిషనర్‌ సవాల్‌ చేయలేదని.. ఈ నేపథ్యంలో ఎన్నికలు ప్రారంభించాలన్న ఎస్‌ఈసీ నిర్ణయాన్ని తప్పుపట్టలేమని స్పష్టం చేసింది. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని గుర్తుచేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన  న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది.


పురపాలక, నగరపాలక, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు నిరుడు మార్చి 9న ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేయడం.. నామినేషన్ల ఉపసంహరణ దశలో కరోనా విజృంభణ కారణంగా మార్చి 15న ఎన్నికలను వాయిదా వేయడం.. నాడు నిలిచిపోయిన ఎన్నికలను ఆగిన దగ్గర నుంచే కొనసాగించేందుకు తాజాగా గత నెల 15న నోటిఫికేషన్‌ జారీ చే యడం.. దీనిని సవాల్‌ చేస్తూ  గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన తెలుగు స్టేట్స్‌ కామన్‌ మ్యాన్‌ ఫోరమ్‌ కన్వీనర్‌ జీవీ రావు పిల్‌ దాఖలు చేయడం తెలిసిందే. కొత్త నోటిఫికేషన్‌ జారీచేయాలని.. కొత్త ఆశావాహులు నామినేషన్‌ వేసేందుకు అవకాశం కల్పించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది జీవీఎస్‌ మెహర్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243(కె) మేరకు ఎస్‌ఈసీ ఎన్నికల ప్రక్రియను నిలిపివేసినా, సస్పెండ్‌ చేసినా తిరిగి ఎన్నికల నిర్వహణకు తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలి. ఎన్నికలు వాయిదా పడి 11 నెలలు గడచిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచే ప్రారంభించడం సరికాదు.


ఈ మధ్య కాలంలో చాలా మంది అభ్యర్థులు, ఓటర్లు ప్రాణాలు కోల్పోయారు. గత 11 నెలల్లో చాలా మంది ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించారు. ఎస్‌ఈసీ నిర్ణయంతో అలాంటి వారు పోటీ చేసే అర్హత కోల్పోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియ సమయాన్ని 27 రోజుల నుంచి 20 రోజులకు తగ్గించారు’ అని తెలిపారు. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం తెలియజేశారు. వాయిదాపడిన ఎన్నికలను సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక పునరుద్ధరిస్తామంటూ ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను పిటిషనర్లు సవాల్‌ చేయలేదని గుర్తుచేశారు. ప్రభుత్వం ఎస్‌ఈసీతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఎన్నికల ప్రక్రియను పునరుద్ధరిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు చెప్పారు. పంచాయతీరాజ్‌ చట్టంలోని ఏడో నిబంధన ప్రకారం ఎన్నికల రద్దు, వాయిదా వేసే విచక్షణాధికారం ఎస్‌ఈసీకి ఉందన్నారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నారని.. ఆ తదుపరి అర్హత సాధించినవారు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించలేరని తెలిపారు. ఎస్‌ఈసీ తరఫు అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశాక వ్యాజ్యాలు దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. అన్ని పక్షాల వాదనలు ఆలకించిన ధర్మాసనం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.


అప్పీల్‌ పై అత్యవసర విచారణ జరపండి

పురపాలక ఎన్నికల్లో జోక్యానికి నిరాకరిస్తూ, అనుబంధ పిటిషన్లను కొట్టివేస్తూ గత నెల 26న సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అప్పీల్‌ దాఖలు చేశామని, వాటిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని సీనియర్‌ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, పి.వీరారెడ్డి సోమవారం హైకోర్టును అభ్యర్థించారు. తక్షణ విచారణ సాధ్యం కాదని.. మంగళవారం అది లిస్ట్‌ అయితే పరిశీలిస్తామని చీఫ్‌ జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Updated Date - 2021-03-02T08:53:44+05:30 IST