విచారణ నుంచి తప్పించుకునేందుకే!

ABN , First Publish Date - 2022-01-29T08:38:58+05:30 IST

హైకోర్టులో విచారణ నుంచి తప్పించుకొనేందుకే రాష్ట్రప్రభుత్వం మూడు రాజధానుల చట్టం రద్దు చేసిందని పిటిషనర్లు ఆరోపించారు. మళ్లీ మార్పుల తో ఆ చట్టం తెస్తామని బహిరంగానే చెబుతోందన్నారు.

విచారణ నుంచి  తప్పించుకునేందుకే!

  • మా వ్యాజ్యాలపై విచారణ కొనసాగించండి
  • హైకోర్టుకు పిటిషనర్ల అభ్యర్థన
  • విచారణ 2వ తేదీకి వాయిదా


అమరావతి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): హైకోర్టులో విచారణ నుంచి తప్పించుకొనేందుకే రాష్ట్రప్రభుత్వం మూడు రాజధానుల చట్టం రద్దు చేసిందని పిటిషనర్లు ఆరోపించారు. మళ్లీ మార్పుల తో ఆ చట్టం తెస్తామని బహిరంగానే చెబుతోందన్నారు. సీఆర్‌డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ చట్టాల రద్దు బిల్లులు గవర్నర్‌ ఆమోదముద్రతో చట్టరూపం దాల్చడంతో.. రాజధాని అమరావతిపై దాఖలైన వ్యాజ్యాల్లో ఎన్ని అభ్యర్ధనలు మనుగడలో ఉన్నాయి? ఎన్ని నిరర్థకమయ్యాయనే విషయంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... రాజధాని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే విషయాన్ని నిర్ణయించే అధికారం గానీ, 3రాజధానులు చట్టాన్ని తీసుకొచ్చే అధికారం గానీ, వాటిని రద్దు చేసే అధికారం గానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేవన్నారు. విభజన చట్టం ప్రకారం... రాజధాని ఏర్పాటుపై నిర్ణయంతీసుకొనేందుకు రాష్ట్రానికి కేంద్రం ఒక్కసారే అధికారం కల్పించిందని.. దాని ప్రకారం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తూ చట్టసభలు ఇదివరకే తీర్మానం చేశాయని తెలిపారు.


మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. రాజధానిప్రాంతంలో నిలిపివేసిన పనులు కొనసాగించాలని, మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేసి రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వాలన్న తమ అభ్యర్ధనపై విచారణ కొనసాగించాలని కోరారు. శుక్రవారం విచారణలో పిటిషనర్ల తరఫు వాదనలు ముగిశాయి. రాష్ట్రప్రభుత్వం, సీఆర్‌డీఏ, శాసనసభ కార్యదర్శి తరఫు వాదనలు కొనసాగించేందుకు ధర్మాసనం విచారణను ఫిబ్రవరి 2కి వాయిదా వేసింది. రాజధాని అభివృద్ధికి గతంలో ఇచ్చిన స్టేట్‌సకో ఉత్తర్వులు అడ్డంకి కాబోవని ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది. రాజధాని విషయంలో సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలనా వికేంద్రీకరణ చట్టాలను రద్దు చేస్తూ చట్టసభలు తీసుకొచ్చిన బిల్లులకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయడంతో అవి చట్టరూపం(యాక్ట్‌ 11/2021) దాల్చాయని గుర్తు చేసిన త్రిసభ్య ధర్మాసనం... రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చిన నేపధ్యంలో రాజధానిపై దాఖలైన వ్యాజ్యాల్లో ఎన్ని వినతులు మనుగడలో ఉన్నాయి. ఎన్ని నిరర్థకంగా మారాయి వంటి వివరాలతో నివేదిక సమర్పించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ఆదేశించింది. ఆ నివేదికపై స్పందన తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. శుక్రవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వ్యాజ్యాల్లో ఎన్ని అభ్యర్ధనలు మనగడలో ఉన్నాయో వివరించారు.


రాజకీయ అజెండాతో కదిలించకూడదు..

న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘మూడు రాజధానుల చట్టం చేసే అధికారం గానీ, తిరిగి దానిని రద్దు చేసే అధికారం గానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రాజధాని వ్యవహారం పార్లమెంటు పరిధిలోది. అమరావతిని రాజధానిగా చట్టసభల్లో ఆమోదించే క్రమంలో అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. కేంద్రం కూడా అమరావతిని రాజధానిగా గుర్తించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.1,500 కోట్లు విడుదల చేసింది. గత ఏడేళ్లుగా శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థలు అమరావతి నుంచే తమ పనులు సాగిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం 3రాజధానులను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రాంతాలు, ప్రజల మధ్యం విద్వేషాలు కలిగించేలా ఉండకూడదు. ఇప్పటికే ఏర్పాటైన రాజధానిని రాజకీయ అజెండాతో కదిలించడానికి వీల్లేదు. సంఖ్యాబలం ఉందని చట్టసభల్లో ఇష్టం వచ్చినట్లు చట్టాలు చేయడం సరికాదు’ అని పేర్కొన్నారు.


రాజధాని పనులు నిలిచిపోయాయి..

సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. అమరావతి రాష్ట్రంలోని అన్నిప్రాంతాలకు మధ్యలో ఉందన్నారు. రాజధాని ఏర్పాటు విషయంలో శివరామకృష్ణన్‌ కమిటీ  సిఫారసుల ఆధారంగా అప్పటి ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్‌  రాజధానిగా అమరావతిని నిర్ణయించిందని తెలిపారు. ‘రెండేళ్లుగా రాజధానిలో పనులు నిలిచిపోయాయి. అమరావతిని మృతనగరంగా మార్చారు. అభివృద్ధి పనులకు ఇప్పటికే కోట్లు ఖర్చు చేశారు. మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర భవిష్యత్‌ను దెబ్బతీస్తుంది. ఈ తరహా చర్యలు గతంలో ఎన్నడూ చూడలేదు’ అని అన్నారు. ‘మూడు రాజధానుల బిల్లును మళ్లీ తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతోంది. హైకోర్టును తరలిస్తామంటోంది. అలాంటి శాసనాలు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని న్యాయవాది వై సూర్యప్రసాద్‌ తెలిపారు. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వడం అంటే రోడ్లు ఏర్పాటు చేయడం కాదని న్యాయవాది అంబటి సుధాకర్‌ తెలిపారు. ‘మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అమరావతిని అభివృద్ధి చేసిన తర్వాత రైతులకు ప్లాట్లు ఇవ్వాలి. 2020 జనవరి నాటికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని భూసమీకరణ పథకం కింద భూములు ఇచ్చిన రైతులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.


అది చట్టబద్ధమైన బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమైతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మాస్టర్‌ఫ్లాన్‌ ప్రకారం పనులు కొనసాగించేలా ఆదేశించండి’ అని కోరారు. ఇంకో న్యాయవాది పీఏకే కిశోర్‌ వాదనలు వినిపిస్తూ.. విభజన చట్టంలో సెక్షన్‌ 11 ప్రకారం జిల్లా పేరు, సరిహద్దులు నిర్ణయించే అధికారం మాత్రమే ప్రభుత్వానికి ఉందన్నారు. మరో న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా నివేదికలు ఇచ్చాయని, వాటి ఆధారంగా 3రాజధానుల చట్టం చేయడానికి వీల్లేదని చెప్పారు. 


మరో పిటిషనర్‌ తరఫు న్యాయవాది డీఎ్‌సఎన్వీ ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ.. అమరావతిలో హైకోర్టు శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులతో అమరావతిలో హైకోర్టు ఏర్పాటైందని.. రాష్ట్ర ప్రభుత్వం చట్టం ద్వారా దానిని తరలించజాలదని స్పష్టంచేశారు. హైకోర్టులో మౌలిక సదుపాయాలు, న్యాయమూర్తులకు నివాస సముదాయాలను నిర్దిష్ట సమయంలోగా నిర్మిస్తామని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందని గుర్తుచేశారు. ఆ హామీని ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. న్యాయవాది పీబీ సురేశ్‌ వాదనలు వినిపిస్తూ.. మళ్లీ మూడు రాజధానుల చట్టం తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతోదన్నారు. ఆ విధంగా శాసనం చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వం భవిష్యత్‌లో రాజధాని విషయంలో చట్టాలు చేయకుండా నిలువరించాలని పిటిషనర్‌ కోరుతున్నట్లుగా ఉందని అభిప్రాయపడింది. ఆ విధంగా ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది.


రైతులపై సవతితల్లి ప్రేమ

న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ... 3రాజధానుల విషయంలో విచారణ ప్రక్రియను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుందన్నారు. అమరావతి ప్రాంతప్రజలు, రైతులపై సవతి తల్లి ప్రేమ చూపుతోందన్నారు. ఇప్పటివరకు రూ.16,500 కోట్లు ఖర్చు పెట్టారని, ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారో సమాధానం చెప్పాలన్నారు. మళ్లీ 3 రాజధానుల చట్టం తీసుకొస్తామనే షరతుతో పాలనా వికేంద్రీకరణ చట్టాలు రద్దు చేయడం సరికాదని న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఇంద్రనీల్‌ బాబు, జీవీఆర్‌ చౌదరి, వీవీ. లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. సీఆర్‌డీఏ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తారని.. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన విచారణకు హాజరుకాలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అన్నారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. 


రాష్ట్రపతి అభిప్రాయం తీసుకోకుండా

సీనియర్‌ న్యాయవాది రవిశంకర్‌ జంధ్యాల వాదనలు వినిపిస్తూ... ‘సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపఽథ్యంలో అమరావతిలో హైకోర్టును ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారు. 3రాజధానుల బిల్లులు ఆమోదించే క్రమంలో గవర్నర్‌ న్యాయ రాజధాని అంశాన్ని రాష్ట్రపతికి పంపి అభిప్రాయం తీసుకునిఉండాల్సింది. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం భూసమీకరణ విధానంలో రైతుల నుంచి భూమి తీసుకుంది. అందుకోసం చట్టం తీసుకొచ్చారు. 3 రాజధానుల నిర్ణయంతో పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వ చర్యల కారణంగా ఎకరా రూ.5 కోట్లు ఉన్న భూమి విలువ రూ.25 లక్షలకు పడిపోయింది. అందుకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వం పరిహారం చెల్లించాలి’ అని కోరారు. సీనియర్‌ న్యాయవాది ఎం.ఎ్‌సప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకున్న తర్వాత అమరావతి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేపట్టడంలేదో ప్రభుత్వం వివరించాలన్నారు. 

Updated Date - 2022-01-29T08:38:58+05:30 IST