వార్డు వలంటీర్లు ఫోన్లు అప్పగించాలి

ABN , First Publish Date - 2021-03-06T09:44:54+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికలు ముగిసేవరకు వార్డు వలంటీర్లు తమ ఫోన్లను అధికారులకు అప్పగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వారిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని

వార్డు వలంటీర్లు ఫోన్లు అప్పగించాలి

కమిషనర్లు నిర్ణయించిన అధికారులకివ్వాలి: హైకోర్టు

హైకోర్టు ధర్మాసనం  స్పష్టీకరణ

 సింగిల్‌ జడ్జి   ఉత్తర్వులకు పాక్షిక సవరణలు


అమరావతి, మార్చి 5  (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికలు ముగిసేవరకు వార్డు వలంటీర్లు తమ ఫోన్లను అధికారులకు అప్పగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వారిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను పాక్షికంగా సవరించింది. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు వలంటీర్లు తమ ఫోన్లను మున్సిపల్‌ కమిషనర్లు నియమించిన అధికారులకు అప్పగించాలని.. సాధారణ విధుల్లో భాగంగా ఫోన్లు అవసరమైతే.. సంబంధిత అధికారి పర్యవేక్షణలో వారు వాటిని ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వలంటీర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే వెసులుబాటు కూడా ఎస్‌ఈసీకి కల్పించింది.


రాష్ట్రప్రభుత్వం, ఎస్‌ఈసీ పరస్పర అంగీకారం మేరకు ఈ ఆదేశాలు జారీచేసింది. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఎస్‌ఈసీ సహేతుకంగా విధించే షరతులపై సందేహపడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఎస్‌ఈసీ అత్యవసరంగా దాఖలు చేసిన హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై శుక్ర వారం రాత్రి న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఈ ఆదేశాలిచ్చింది. పురపాలక ఎన్నికల్లో వార్డు వలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వం అందించిన అధికారిక డేటాను దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వారిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని ఎస్‌ఈసీ గత నెల 28న కలెక్టర్లను ఆదేశించడం, ఆ ఉత్తర్వులను గ్రామ/వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ హైకోర్టులో సవాల్‌ చేయడం, ఎస్‌ఈసీ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి ఈ నెల 3న మధ్యంతర ఆదేశాలివ్వడం తెలిసిందే. ఆ ఆదేశాలపై శుక్రవారం సాయంత్రం ఎస్‌ఈసీ అత్యవసర అప్పీలు దాఖలు చేసింది. న్యాయమూర్తులు ఇంటి నుంచే రాత్రి పూట విచారణ జరిపారు. ఎస్‌ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ‘పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామ వలంటీర్లు.. అధికార పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదులందాయి. ఎస్‌ఈసీ ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భంలో పురపాలికల్లో కూడా వార్డు వలంటీర్లు అధికారపార్టీ వారికి సహకరిస్తున్నారని ఫిర్యాదులొచ్చాయి. వారికి రాష్ట్రప్రభుత్వం అందించిన ఫోన్లలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటా మొత్తం ఉంది. దాన్ని ఉపయోగించుకుని ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది.


ఈ నేపథ్యంలో నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణలో భాగంగా మొబైల్‌ ఫోన్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే వాటిని అప్పగించాలని ఉత్తర్వులిచ్చాం’ అని తెలిపారు. ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పరస్పర అంగీకారం మేరకు ఫోన్లు ఏ అధికారి వద్ద పెడితే మంచిదో చెప్పాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదిని, అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాంను కోరింది. వారి అభిప్రాయాలు విన్న తర్వాత.. మున్సిపల్‌ కమిషనర్లు నిర్ణయించిన  అధికారుల వద్ద వలంటీర్ల ఫోన్లు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది.

Updated Date - 2021-03-06T09:44:54+05:30 IST