అమరావతిలో పనులకు.. స్టేటస్‌ కో అడ్డంకి కాదు

ABN , First Publish Date - 2021-11-30T08:54:21+05:30 IST

రాజధాని అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులకు గతంలో ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు(స్టేట్‌సకో) అడ్డంకి కాబోవని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. సీఆర్‌డీఏ చట్ట నిబంధనల మేరకు అభివృద్ధిని కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.

అమరావతిలో పనులకు.. స్టేటస్‌ కో అడ్డంకి కాదు

  • కార్యాలయాల తరలింపుపై మాత్రం స్టే
  • రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ
  • ‘రాజధాని’ చట్టాల రద్దు బిల్లును గవర్నర్‌ ఆమోదించాక స్పష్టత
  • విచారణ డిసెంబరు 27కి వాయిదా


అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులకు గతంలో ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు(స్టేట్‌సకో) అడ్డంకి కాబోవని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. సీఆర్‌డీఏ చట్ట నిబంధనల మేరకు అభివృద్ధిని కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. సదరు ఉత్తర్వుల కారణంగా అమరావతిలో అభివృద్ధి నిలిచిపోవాలని తాము కోరుకోవడం లేదని.. న్యాయస్థానం కారణంగా అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయనే భావన ప్రజల్లో కలగకూడదని వ్యాఖ్యానించింది. అయితే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగుల తరలింపు విషయంలో గతంలో ఇచ్చిన స్టేట స్‌కో ఉత్తర్వులు అమల్లోనే ఉంటాయని తేల్చిచెప్పింది. సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలనా వికేంద్రీకరణ చట్టం (మూడు రాజధానులు) రద్దు చేస్తూ ఉభయ సభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ ఆమోదం తెలపాల్సి ఉందని, ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఉన్నారని గుర్తుచేసింది.


బిల్లు చట్టరూపం దాల్చిన తర్వాత వ్యాజ్యాలపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. ఈ ధర్మాసనం రాజధాని వ్యాజ్యాలపై ఈ నెల 22న వరుసగా ఆరో రోజు విచారణ జరుపుతున్న సమయంలో అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ జోక్యం చేసుకుని.. గత ఏడాది తీసుకొచ్చిన సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలను రద్దు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని, సీఎం శాసనసభలో ప్రకటన చేయబోతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఈ మేరకు అఫిడవిట్‌ వేశారు. ఆయా వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చాయి.


వ్యాజ్యాలపై విచారణ కొనసాగించండి..

రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ వాదనలు వినిపించారు. సదరు రెండు చట్టాలను రద్దుచేస్తూ తెచ్చిన బిల్లు ఇంకా చట్టం రూపం దాల్చలేదని.. గవర్నర్‌ ఆమోదం తెలపాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం ఒకవైపు వికేంద్రీకణ బిల్లులను రద్దు చేసేందుకు బిల్లు పెట్టామంటూనే.. మరోవైపు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెబుతోందన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలన్నదే తమ వాదనగా పేర్కొన్నారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరామని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వ్యాజ్యాలపై విచారణ కొనసాగించాలని కోరారు.


చీఫ్‌ జస్టిస్‌ స్పందిస్తూ.. రాష్ట్రప్రభుత్వం అమరావతిని ఘోస్ట్‌ సిటీగా మార్చిందని వాదనలు వినిపించారని.. ప్రస్తుత వ్యాజ్యాలు అపరిష్కృతంగా ఉంటే అవి కూడా ఘోస్ట్‌ పిటిషన్లుగా మారతాయని వ్యాఖ్యానించారు. సర్కారు తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ అనుమానించాల్సిన అవసరం లేదన్నారు. పిటిషనర్ల తరఫున మరో న్యాయవాది పీబీ సురేశ్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం భవిష్యత్‌లో మూడు రాజధానుల చట్టం తెస్తామని చెబుతోందని.. అసెంబ్లీ తాజాగా ఆమోదించిన బిల్లును గవర్నర్‌ ఇంకా ఆమోదించలేదన్నారు. మరో న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్‌ స్పందిస్తూ.. పరిపాలన వికేంద్రీకరణ చట్టం చేసే అధికారం గానీ, దానిని రద్దు చేసే అధికారం గానీ ప్రభుత్వానికి లేదన్నారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబు తరఫున సీనియర్‌ న్యాయవాది రవిశంకర్‌ రాజధాని ఏర్పాటుపై శాసనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు తరఫున న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. రాజధాని వ్యాజ్యాలపై విచారణను అడ్డుకునేందుకు ప్రభుత్వం మూడుసార్లు ప్రయత్నించిందన్నారు.


మెమో దాఖలు చేస్తాం: ఏజీ

ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ స్పందిస్తూ.. ఆమోదం కోసం బిల్లును ఈ నెల 25న గవర్నర్‌కు పంపించామన్నారు. రెండేళ్లుగా అమరావతి అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం ఏం చేసిందనే వివరాలను మెమో రూపంలో కోర్టు ముందు ఉంచుతామన్నారు. విచారణను 4వారాలకు వాయిదా వేయాలని కోరారు. అన్ని పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. బిల్లును గవర్నర్‌ ఆమోదించిన తర్వాత వ్యాజ్యాల విచారణపై స్పష్టత వస్తుందని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.

Updated Date - 2021-11-30T08:54:21+05:30 IST