ఆన్‌లైన్‌ అవసరమా?

ABN , First Publish Date - 2020-07-04T08:12:55+05:30 IST

కొవిడ్‌-19 కోరలు చాస్తున్న ప్రస్తుత తరుణంలో ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో హడావిడి చేస్తున్న ప్రైవేటు కార్పొరేట్‌ పాఠశాలల తీరుపై హైకోర్టు తీవ్ర

ఆన్‌లైన్‌ అవసరమా?

  • క్లాసుల్లేకుంటే కొంపలు మునుగుతాయా?
  • ఈ శతాబ్దంలోనే దేశంలో గడ్డు పరిస్థితులు!
  • ఫీజులతోపాటు నెట్‌, ల్యాప్‌టా‌ప్‌ల భారం
  • పిల్లల్ని సాకలేని వారు అవన్నీ ఎక్కడిస్తారు?
  • గిరిజన ప్రాంతాల్లోని వారికి ఆ శక్తి ఉందా?
  • సీబీఎస్‌ఈ, ఎన్సీటీఈను ఇంప్లీడు చేయాలి
  • ప్రభుత్వాలు తమ వైఖరి చెప్పాలి
  • ఆన్‌లైన్‌ తరగతులపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
  • ప్రశ్నించిన హైకోర్టు 


హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 కోరలు చాస్తున్న ప్రస్తుత తరుణంలో ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో హడావిడి చేస్తున్న ప్రైవేటు కార్పొరేట్‌ పాఠశాలల తీరుపై హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ‘‘21వ శతాబ్దంలో దేశం తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటోంది. కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించకపోతే...కొంపలు ఏమైనా మునుగుతాయా...?’’ అంటూ ప్రైవేటు పాఠశాలల తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణను ధర్మాసనం ప్రశ్నించింది. ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ క్లాసులు, ఫీజుల వసూలు ఆపాలంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది చేసినఅభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. పాఠశాలల యాజమాన్యాల వాదనలు వినకుండా ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. ఈ వ్యాజ్యంలో సీబీఎ్‌సఈ, ఎన్‌సీటీఈలను ప్రతివాదులుగా ఇంప్లీడు చేయాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది.


తదుపరి విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తూ టెర్మ్‌ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం  మరోసారి విచారణకు వచ్చింది. సీబీఎ్‌సఈ సిలబస్‌ బోధించే ప్రైవేటు పాఠశాలల తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు వాదించారు. సీబీఎ్‌సఈ, ఎస్‌సీటీఈ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం రెండు నెలలుగా ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్‌లైన్‌లో నిర్వహించే తరగతులకు పిల్లలు హాజరయ్యేందుకు  వీలుగా ఇంటర్‌నెట్‌ సౌకర్యం, లాప్‌టా్‌పలు సమకూర్చుకోవాలని వారి తల్లిదండ్రులకు సూచించినట్లు తెలిపారు. విద్యార్థులకు మేలు చేసేందుకు ఢిల్లీలోని పాఠశాలలు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నాయని చెప్పారు.


ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ సంజీవ్‌కుమార్‌ వాదించారు.  2020-21 విద్యా సంవత్సరం జూన్‌ 12 నుంచి ప్రారంభం కావాల్సి ఉందని, ఇప్పటికే 15 రోజులు గడిచిపోయాయని తెలిపారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌కమిటీని వేసిందన్నారు.కమిటీ నివేదిక వస్తే...కోర్టుకు నివేదిస్తామని ఆయన చెప్పారు. 31వరకు తరగతులు నిర్వహించవద్దని అన్ని ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు ఆయన తెలిపారు. కానీ, కేంద్రం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించుకునేందుకు అనుమతించిందన్నారు. 


 ప్రైవేటు  దోపిడీకి అవకాశం

ఈ వ్యాజ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విరుద్ధంగా ప్రకటనలు ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేసింది. ‘‘ఈ సమస్యపై నిర్ణయం తీసుకోవడానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ వేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. పాఠశాలలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. అయితే, అన్‌లైన్‌లో తరగతులు నిర్వహించుకునేందుకు అనుమతించింది. దీని అర్థం ఏంటి? ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు పిండుకోడానికా?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర విరుద్ధ నిర్ణయాల వల్ల ఫీజుల పేరుతో డబ్బులు దండుకోవడానికి ప్రైవేటు స్కూళ్లకు మంచి అవకాశం ఇచ్చినట్లయ్యిందని వ్యాఖ్యానించింది. భారీ ఫీజులకు తోడు అదనంగా విద్యార్థుల తల్లిదండ్రులపై ఇంటర్నెట్‌, లాప్‌టా్‌పల భారం పడుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘ఢిల్లీలోని విద్యార్థులు, స్థితిమంతులైన కుటుంబాలకు చెందినవారు. ల్యాప్‌టా్‌పలు, ఇంటర్నెట్‌ సౌకర్యం సమకూర్చకోవడం వారికి పెద్ద సమస్య కాబోదు.


కానీ, తెలంగాణలో నివసిస్తున్న తల్లిదండ్రుల్లో చాలా మందికి అలాంటి పరిస్థితి లేదు. పిల్లలకు రెండు ల్యాప్‌టా్‌పలు కొనివ్వడం కాదు.. కనీసం వారికి రెండు పూటలా కడుపునిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్నప్పటికీ... మిగిలిన జిల్లాల్లో పరిస్థితేంటి? ఆయా జిల్లాల్లో ఇంటర్నెట్‌ సక్రమంగా, స్థిరంగా ఉండదు. తరచుగా విద్యుత్‌ కోతలు ఉంటాయి. ఇక ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం గురించి  చెప్పేపనిలేదు. అంతెందుకు...నల్సార్‌ లా యూనివర్సిటీలో, హైకోర్టులోనూ నాణ్యమైన ఇంటర్నెట్‌ సౌకర్యం లేదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


కరోనాతో అన్నీ ఆగిపోతున్నాయి!

అన్‌లైన్‌ తరగతులు నిర్వహించకపోతే విద్యా సంవత్సరం నిలిచిపోతుందని న్యాయవాది ఆదినారాయణరావు అన్నారు. దీనిపై కల్పించుకున్న ధర్మాసనం...‘‘కరోనా కారణంగా విద్యా సంవత్సరమేనిలిచిపోవడం లేదు... వలస జీవులు, నిర్మాణరంగ కార్మికులూ ఎక్కడికక్కడే నిలిచిపోయారు. జ్యుడీషియరీ కార్యకలాపాలు కూడా నిలిచి పోయాయి. హైకోర్టు రిజిస్ట్రీలో సుమారు 20మంది ఉద్యోగులకు కరోనా సోకింది. జ్యుడీషియల్‌ అకాడమీలోని ఒక ఉద్యోగిని జ్యుడీషియరీ కోల్పోయింది’’ అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు రాకుండా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్న స్కూళ్ల యాజమాన్యాలను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధాన నిర్ణయం ఏమిటో చెప్పాలని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌కు స్పష్టం చేసింది. 

Updated Date - 2020-07-04T08:12:55+05:30 IST