ఉత్కంఠకు తెర!

ABN , First Publish Date - 2021-09-17T05:27:42+05:30 IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై సందిగ్ధానికి తెరపడింది. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ గురువారం కొట్టేసింది. ఓట్ల లెక్కింపునకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కొన్ని నెలలుగా ఓట్ల లెక్కింపు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వారందరికీ ఓ స్పష్టత వచ్చినట్లయింది. త్వరలోనే లెక్కింపు చేపట్టే అవకాశం ఉంది. కోర్టు తీర్పుతో వీలైనంత తొందరగా ఓట్ల లెక్కింపును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓట్ల లెక్కింపు తేదీలను ఒకటి, రెండు రోజుల్లో ఎస్‌ఈసీ ఖరారు చేయనుంది. త్వరలో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

ఉత్కంఠకు తెర!
స్ట్రాంగ్‌రూంలో బ్యాలెట్‌ బాక్సులు

- ప్రాదేశిక ఓట్ల లెక్కింపునకు హైకోర్టు పచ్చజెండా

- ఎస్‌ఈసీ తేదీలు ఖరారు చేయడమే ఆలస్యం

- త్వరలో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/రాజాం రూరల్‌)

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై సందిగ్ధానికి తెరపడింది. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ గురువారం కొట్టేసింది. ఓట్ల లెక్కింపునకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కొన్ని నెలలుగా ఓట్ల లెక్కింపు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వారందరికీ ఓ స్పష్టత వచ్చినట్లయింది. త్వరలోనే లెక్కింపు చేపట్టే అవకాశం ఉంది. కోర్టు తీర్పుతో వీలైనంత తొందరగా ఓట్ల లెక్కింపును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓట్ల లెక్కింపు తేదీలను ఒకటి, రెండు రోజుల్లో ఎస్‌ఈసీ ఖరారు చేయనుంది. త్వరలో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 8న మండల, జిల్లా ప్రాదేశికాలకు పోలింగ్‌ జరిగింది. జిల్లాలో 37 జడ్పీటీసీ స్థానాలు, 590 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. హిరమండలం టీడీపీ అభ్యర్థి దారపు నారాయణరావు మృతి చెందడంతో  అక్కడ జడ్పీటీసీ ఎన్నికలు నిలిచిపోయాయి. మిగతా చోట్ల ఎన్నికలు నిర్వహించగా.. 58.37 శాతం పోలింగ్‌ నమోదైంది. జిల్లాలో 19,01,951 మంది ఓటర్లు ఉండగా 11,17,476 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.   ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ పదో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణకు కనీసం నాలుగు వారాలు గడువు ఉండాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఆ నిబంధనలు పాటించలేదని అప్పట్లో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎన్నిక నిర్వహణ వరకు మాత్రమే అనుమతిచ్చింది. దీంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేశారు. పోలీసు బందోబస్తు నడుమ బ్యాలెట్‌ బాక్సులను స్ర్టాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. ఫలితాల కోసం అభ్యర్థులంతా ఇన్నాళ్లుగా వేచిచూశారు. ఓట్ల లెక్కింపునకు అనుమతి ఇవ్వాలంటూ ఎస్‌ఈసీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో అనేక పర్యాయాలు ఇరు పక్షాల వాదోపవాదాలు విన్న తరువాత హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తాజాగా గురువారం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అనుమతి ఇచ్చింది. త్వరలో ఎన్నికల కమిషన్‌ ఓట్ల లెక్కింపు తేదీలను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 


 రాజకీయ పక్షాల్లో వేడి

ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో గ్రామాల్లో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎంపీటీసీలుగా గెలుపొందిన వారిలో కీలక నేతలు మండల అధ్యక్ష పీఠాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో వైసీపీకి ఏకపక్షంగా ఓట్లు పడ్డాయన్న ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఎంపీపీ పీఠాల విషయంలో నాయకులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభించేశారు. పార్టీకి చేసిన సేవలు, సామాజిక వర్గాల వారీ లెక్కలు, ఇతర అంశాలను తెరముందుకు తెస్తున్నారు. తమకు ఒకసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు జడ్పీ పీఠం కోసం ఈసారి పోటీ తీవ్రంగా ఉండనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 

Updated Date - 2021-09-17T05:27:42+05:30 IST