ఆ ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులు ఎందుకు ఎత్తేస్తున్నారు?

ABN , First Publish Date - 2021-12-02T08:30:05+05:30 IST

రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ ప్రజాప్రతినిధులపై కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై...

ఆ ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులు ఎందుకు ఎత్తేస్తున్నారు?

  • ఎన్ని కేసులు ఇలా ప్రతిపాదించారు?
  • వైసీపీ ప్రజాప్రతినిధుల కేసులపై హైకోర్టు వ్యాఖ్యలు.. 
  • నివేదిక ఇవ్వాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశం
  • సుమోటోగా విచారణ చేపట్టిన కోర్టు


అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ ప్రజాప్రతినిధులపై కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు ఎందుకు ఎత్తివేస్తున్నారని, ఎన్ని కేసులను ఎత్తివేసేందుకు ప్రతిపాదించారని ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఎన్ని జీవోలు జారీ చేశారని నిలదీసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. మరోవైపు ఎన్ని కేసుల ఉపసంహరణకు అభ్యర్థనలు వచ్చాయో నివేదిక ఇవ్వాలని విజయవాడలోని ప్రజాప్రతినిధుల కేసుల విచారణ ప్రత్యేక కోర్టు న్యాయాధికారిని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు అనుమతి లేకుండా ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను ఎత్తివేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2020 సెప్టెంబరు 16 నుంచి ఈ ఏడాది ఆగస్టు 25వరకు రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులపై ఎన్ని కేసులు ఉపసంహరించేందుకు జీవోలు ఇచ్చారో పరిశీలించేందుకు హైకోర్టు సిద్ధమైంది. ఈ క్రమంలోనే సుమోటోగా కేసు నమోదు చేసింది. ప్రభుత్వం జారీ చేసిన 9 జీవోలను అందులో పేర్కొంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, డైరెక్టర్‌ ప్రాసిక్యూషన్స్‌, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చింది.


వ్యాజ్యంలో పేర్కొన్న వైసీపీ ప్రజాప్రతినిధులు వీరే

1) ఎమ్మెల్యే విడదల రజని(చిలకలూరిపేట)పై 2019లో కేసు నమోదైంది. ఈ కేసు ఉపసంహరణ కోసం 2020 అక్టోబరు 21న జీవో 1023 ఇచ్చారు. 

2) సీహెచ్‌ ద్వారకారెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డిలపై 2009లో చిత్తూరులో కేసు నమోదైంది. దీని ఉపసంహరణకు 2021 జనవరి 28న జీవో 85 జారీ చేశారు.

3) విరూపాక్షి జయచంద్రారెడ్డి, మరో 18 మందిపై 2015లో చిత్తూరులో కేసు నమోదు చేశారు. దీని ఉపసంహరణకు గత జనవరి 28న జీవో 88 జారీ చేశారు.

4) ఎమ్మెల్యే మల్లాది విష్ణు(విజయవాడసెంట్రల్‌) మరికొందరిపై 2019లో విజయవాడ, అజిత్‌సింగ్‌ నగర్‌లో కేసు నమోదు చేశారు. దీని ఉపసంహరణకు గత ఏప్రిల్‌ 8న జీవో 373 జారీ చేశారు.

5) టీటీడీ చైర్మన్‌, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై 2014లో ప్రకాశం జిల్లాలోని పొదిలిలో కేసు నమోదు చేశారు. దీని ఉపసంహరణకు గత మే 19న జీవో 487 జారీ చేశారు.

6) ఎమ్మెల్యే సామినేని ఉదయభాను(జగ్గయ్యపేట)పై నందిగామలో 2017, 2018లో రెండు కేసులు, జగ్గయపేటలో 2015, 2017, 2018 నాలుగు కేసులు, 2018లో వత్సవాయి పోలీస్‌ స్టేషన్‌లో రెండు, 2017, 2019 చిల్లకల్లులో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ 10 కేసుల ఉపసంహరణకు గత మే 28న జీవో 502 జారీ చేశారు.

7) ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి(ఆళ్లగడ్డ) సహా 85 మందిపై 2019లో ఆళ్లగడ్డలో కేసు నమోదైంది. ఈ కేసు ఉపసంహరణకు గత జూన్‌ 16న జీవో 550 జారీ చేశారు.

8) ఎమ్మెల్యే జక్కంపూడి రాజా(రాజానగరం)పై రాజమహేంద్రవరం త్రీటౌన్‌ స్టేషన్‌లో 2015లో కేసు నమోదైంది. అలాగే ప్రకాశ్‌నగర్‌ స్టేషన్‌లో 2016లో మరో కేసు నమోదైంది. ఆ కేసుల ఉపసంహరణకు గత జూన్‌ 30న జీవో 594 జారీ చేశారు.

9) ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు(నూజివీడు) సహా మరో 15మందిపై 2018లో నూజివీడు టౌన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు ఉపసంహరణకు 2020 నవంబరు 10న జీవో 1111 జారీ చేశారు.

Updated Date - 2021-12-02T08:30:05+05:30 IST