చలానా చెల్లించకపోతే చార్జిషీట్‌ దాఖలు చేయండి

ABN , First Publish Date - 2021-12-02T08:28:38+05:30 IST

మోటార్‌ వెహికిల్‌ చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు విధించిన చలానా కట్టకపోతే సంబంధిత కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయాలి తప్ప ఫోన్‌చేసి డబ్బు చెల్లించాలని

చలానా చెల్లించకపోతే చార్జిషీట్‌ దాఖలు చేయండి

  • ఫోన్‌ చేసి ఎలా ఒత్తిడి చేస్తారు?: హైకోర్టు 


అమరావతి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): మోటార్‌ వెహికిల్‌ చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు విధించిన చలానా కట్టకపోతే సంబంధిత కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయాలి తప్ప ఫోన్‌చేసి డబ్బు చెల్లించాలని వాహనదారులను ఎలా ఒత్తిడి చేస్తారని పోలీసులను హైకోర్టు నిలదీసింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని కారణంగా చలానా విధించామని చెప్పడానికి వాహనం నడుపుతున్నప్పుడు తీసిన ఫొటో ఏవిధంగా సాక్ష్యం అవుతుందో చెప్పాలని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, కృష్ణాజిల్లా ఎస్పీ తదితరులను ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదావేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌.మానవేంద్రనాథ్‌రాయ్‌ బుధవారం ఆదేశాలు ఇచ్చారు. హెల్మెట్‌ ధరించలేదని, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడుపుతున్నారని, లైసెన్స్‌ చూపించలేదనే కారణంతో కృష్ణాజిల్లా, చల్లపల్లి పోలీసులు చలానా విధించడాన్ని సవాల్‌ చేస్తూ జర్నలిస్టు టి.లీలా కృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీజీ ఉమే్‌షచంద్ర వాదనలు వినిపిస్తూ.... లైసెన్స్‌ చూపించలేదని పోలీసులు చెబుతున్న దానిలో వాస్తవం లేదన్నారు. పిటిషనర్‌కు లైసెన్స్‌ ఉందన్నారు.


చలానా సొమ్ము కట్టాలని పోలీసులు ఫోన్‌ చేసి ఒత్తిడి చేస్తున్నారన్నారు. పోలీసులు చూపుతున్న ఫొటోలోని వ్యక్తి పిటిషనర్‌ కాదని ఆ వాహనం కూడా అతనిది కాదన్నారు. వాహనం నంబరు మాత్రమే పిటిషనర్‌దని పేర్కొన్నారు. చలానా కట్టకపోతే ఫోన్‌ చేసి డబ్బులు కట్టాలని పోలీసులు ఒత్తిడి చేయడానికి వీల్లేదన్నారు. 

Updated Date - 2021-12-02T08:28:38+05:30 IST