విశాఖ గ్రేహౌండ్స్‌ స్థలంపై పూర్తి వివరాలు సమర్పించండి

ABN , First Publish Date - 2020-11-28T08:58:58+05:30 IST

విశాఖ జిల్లా భీమునిపట్నం కాపులుప్పాడ పరిధిలోని గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రానికి చెందిన 30 ఎకరాల భూమిని ప్రభుత్వ అతిథి గృహ నిర్మాణానికి కేటాయించారంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ భూమి కేటాయింపుతో పాటు ఈ శిక్షణ

విశాఖ గ్రేహౌండ్స్‌ స్థలంపై పూర్తి వివరాలు సమర్పించండి

  • కేంద్రం ఏ ప్రాతిపదికన నిధులిస్తోంది?
  • ఎలా, ఎందుకు వినియోగిస్తున్నారు?
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • కేంద్రాన్నీ ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు సూచన
  • తదుపరి విచారణ 14వ తేదీకి వాయిదా


అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లా భీమునిపట్నం కాపులుప్పాడ పరిధిలోని గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రానికి చెందిన 30 ఎకరాల భూమిని ప్రభుత్వ అతిథి గృహ నిర్మాణానికి కేటాయించారంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ భూమి కేటాయింపుతో పాటు ఈ శిక్షణ కేంద్రానికి కేంద్రం ఏ ప్రాతిపదికన నిధులు అందిస్తోంది.. ఎలా వినియోగిస్తున్నారు.. తదితర వివరాలు సమర్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించిం ది. అదేవిధంగా వృక్షాలను నరకడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసిం ది. విశాఖ నగర కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు సూచించింది. తదుపరి విచారణను వచ్చే నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాపులుప్పాడ పరిధిలోని సర్వే నంబరు 386/2లో గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రానికి చెందిన 300 ఎకరాల స్థలంలో 30 ఎకరాలను అతిథి గృహ నిర్మాణానికి కేటాయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రానికి ఆనుకుని అతిథి గృహ నిర్మాణం చేపట్టడం వల్ల సిబ్బంది భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశముందని పేర్కొంటూ గుంటూరుకు చెందిన గద్దె తిరుపతిరావు పిల్‌ దాఖలు చేశారు. 


దీనిపై శుక్రవారం ధర్మాసనం ముందు విచార ణ జరగ్గా.. పిటిషనర్‌ తరఫున ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక దళాలకు ఈ గ్రేహౌండ్స్‌ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. ఓ స్వామీజీ చెప్పారన్న కారణంగా ప్రస్తుత ప్రభుత్వం అదే ప్రాంతంలో అతిథి గృహం నిర్మించతలపెట్టిందన్నా రు. గ్రేహౌండ్స్‌ బలగాలు ఎంతో గోప్యంగా ఉంటాయని గుర్తుచేశారు. అతిథి గృహ నిర్మాణం జరిగితే అక్కడకు రాజకీయ నేతలతో పాటు ఎంతోమంది వచ్చి వెళ్తుంటారని, తద్వారా విషయాలు బహిర్గతమవుతాయన్నారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమన్నారు. ఈ స్థలాన్ని రాష్ట్రప్రభు త్వం 2005లో గ్రేహౌండ్స్‌ విభాగానికి ఇచ్చిందని, అక్కడ శిక్షణ కేంద్రం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు గతంలో కేంద్రం రూ.వెయ్యి కోట్లు  ఇచ్చిందన్నారు. ఇప్పుడు ఆధునికీకరణ కోసం మరో రూ.400 కోట్లు ఇచ్చిందన్నారు. అతిథిగృహ నిర్మాణం కోసమంటూ గ్రేహౌండ్స్‌ కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను ధ్వంసం చేశారని, భారీ యంత్రాలతో కొండ ప్రాంతాన్ని చదును చేస్తున్నారన్నారు. దీనిని అడ్డుకోవాలని, ఆ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఇప్పటికే అతిథి గృహ నిర్మాణ వ్యవహారంపై స్టేట్‌సకో(యథాతథ స్థితి) ఉంది కదా’ అని ప్రశ్నించింది. మురళీధరరావు సమాధానమిస్తూ.. అతిథిగృహ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను తమ ముందుంచాలని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించినా, ప్రభుత్వం ఇంతవరకూ ఇవ్వలేదని.. కానీ అతిథి గృహ నిర్మాణ పనులు మాత్రం జరిగిపోతున్నాయని వివరించారు.


64 ఎకరాలే వినియోగం..

ఆ భూమి గ్రేహౌండ్స్‌కు కేవలం ‘ఆపరేషనల్‌ హబ్‌’గా మాత్రమే ఉందని ప్రభుత్వ న్యాయవాది సి.సుమన్‌ తెలిపారు. అక్కడ ఎలాంటి శిక్షణ సదుపాయాలు లేవని.. ఇకపై రాబోతున్నాయన్నారు. అక్కడ అధునాతన శిక్షణ వసతుల కల్పనకు కేంద్రం కూడా నిధులు మంజూరు చేసిందని తెలిపారు. మొత్తం 334 ఎకరాల భూమిలో గ్రేహౌండ్స్‌ వారు కేవలం 64 ఎకరాలను మాత్రమే వినియోగిస్తున్నారన్నారు. ‘కేంద్రప్రభుత్వ నిధులతో నిర్మించిన హెలిప్యాడ్‌ను తొలగించారా’ అని ధర్మాసనం ప్రశ్నించగా.. అది అవాస్తవమని సుమన్‌ తెలిపారు. హెలిప్యాడ్‌ వీఐపీలకు సైతం ఎంతో అవసరమని, నిజానికి అతిథి గృహ నిర్మాణానికి వచ్చే వీఐపీలకు అది ప్రధాన మౌలిక సదుపాయం కూడా కాబోతోందన్నారు. తగిన గడువిస్తే పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేస్తామని తెలిపారు.

Updated Date - 2020-11-28T08:58:58+05:30 IST