కరోనా మరణాల లెక్కలు నిజమేనా!?

ABN , First Publish Date - 2020-07-29T08:00:55+05:30 IST

ఆస్పత్రుల్లో చేరడం రోగులకు ఇంకా ఇబ్బందికరంగానే ఉంది. దీనిని సరళతరం చేయాలి.

కరోనా మరణాల లెక్కలు నిజమేనా!?

  • ప్రజలకు సరైన గణాంకాలనే చెబుతున్నామా?
  • కరోనా మరణాలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రస్తావించిన హైకోర్టు ధర్మాసనం
  • ‘ఏ ఖాతాలో వేయాలి.. ఈ కరోనా దహనాలను’ కథనాన్ని తర్జుమా చేయించుకుని చూశాం
  • ఈనెల 23న ఒక్క హైదరాబాద్‌లోనే 50 శవ దహనాలు జరిగినట్లు పేర్కొన్నారు
  • సర్కారు విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్లో మాత్రం మృతుల సంఖ్య ఎనిమిదే
  • ప్రభుత్వం ప్రకటించే మరణాలు స్వల్పమేనని ఆ కథనాన్ని బట్టి తెలుస్తోంది
  • పరిశీలన జరిపి సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించండి.. ధర్మాసనం ఆదేశాలు
  • మా ఆదేశాలను ఎందుకు అమలు చేయరు?
  • ప్రైవేటు ఫీజులను ప్రభుత్వమే నిర్ణయించాలి
  • గరిష్ఠంగా వసూలు చేసే ఫీజులపై జీవో ఇవ్వాలి
  • తెలుగులోనూ బులెటిన్‌ ఇస్తే మంచిది
  • సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు హైకోర్టు ఆదేశాలు


ఆస్పత్రుల్లో చేరడం రోగులకు ఇంకా ఇబ్బందికరంగానే ఉంది. దీనిని సరళతరం చేయాలి. ఆయా ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పడకల వివరాలను కేటగిరీల వారీగా మీడియా బులెటిన్లలో ఇవ్వాలి. తద్వారా, ఎక్కడికి వెళ్లాలనే విషయం రోగులకు సులభంగా అవగతం అవుతుంది. ఈ మేరకు రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకునే ప్రక్రియను సరళతరం చేస్తామని సీఎస్‌ హామీ ఇవ్వాలి. 


హైదరాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ‘ఏ ఖాతాలో వేయాలి.. ఈ కరోనా దహనాలను’ శీర్షికన ఈనెల 26వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన సంచలనాత్మక పరిశోధన కథనంపై హైకోర్టు ధర్మాసనం స్పందించింది. ఆ కథనంలో 23వ తేదీన ఒక్కరోజే 50 మంది కరోనా మృతులను దహనం చేసినట్లు ఉందని, అదే రోజు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో మాత్రం 8 మంది మాత్రమే చనిపోయినట్లు ఉందని, దీనితోపాటు ఆ కథనంలో ప్రస్తావించిన ఇతర అంశాలపై పరిశీలన జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణలో కరోనా పరిస్థితిపై మంగళవారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ తనంతట తానుగా ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రస్తావించారు. ‘ఏ ఖాతాలో వేయాలి ఈ కరోనా దహనాలను’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో వచ్చిన కథనాన్ని తర్జుమా చేయించుకుని చూశామని తెలిపారు. 38 మృతదేహాలకు ఈఎ్‌సఐ శ్మశాన వాటికలో కరోనా ప్రోటోకాల్‌ ప్రకారం దహన  సంస్కారాలు చేశారని, మృతదేహాలను తరలించిన అంబులెన్సు డ్రైవర్లు సైతం పీపీఈ కిట్లు వేసుకున్నారని, కుటుంబ సభ్యులు వేరుగా వాహనాల్లో వచ్చారని కథనంలో పేర్కొన్నారని ప్రస్తావించారు.


ఒక్క హైదరాబాద్‌లోనే 23వ తేదీన 50 కరోనా శవ దహనాలు జరిగినట్లు కథనంలో పేర్కొన్నారని తెలిపారు. కానీ, ఆరోజు ఇచ్చిన హెల్త్‌ బులెటిన్‌లో కేవలం 8 మంది మాత్రమే కరోనా రోగులు మరణించినట్లు పేర్కొన్నారని గుర్తు చేశారు. బహుశా, హైదరాబాద్‌లో మరింతమంది చనిపోతున్నారని, ప్రభుత్వం ప్రకటించే మరణాలు స్వల్పంగా ఉన్నట్లు ఆ కథనాన్ని బట్టి తెలుస్తోందని వ్యాఖ్యానించారు. ఆ వార్తా కథనంలోని అంశాలు నిజమైతే, మరణాలకు సంబంధించి మనం సరైన లెక్కలను బయట పెడుతున్నట్లు భావించొచ్చా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. కరోనా మరణాలకు సంబంధించి ప్రజలకు మనం సరైన గణాంకాలను అందించకపోతే, విధ్వంసం ఏ స్థాయిలో ఉందో తెలిసే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. కథనంలో ప్రస్తావించిన అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎ్‌సను ఽధర్మాసనం ఆదేశించింది. ఆ తర్వాత సీనియర్‌ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కూడా ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ధర్మాసనం ముందు ప్రసావించారు. ఈ కథనం ప్రభుత్వ తప్పుడు లెక్కలను కళ్లకు కట్టినట్లు చూపిందని, ఈ కథనాన్ని సుమోటో విచారణకు స్వీకరించాలని కోరారు. ఇప్పటికే ఆ కథనాన్ని తాము తెలుగులో చూసి ఇంగ్లిషులోకి తర్జుమా చేయించుకుని చూశామని ప్రధాన న్యాయమూర్తి చౌహాన్‌ తెలిపారు. విచారణకు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారని, దానిపై వారు వివరణ ఇస్తారని వ్యాఖ్యానించారు. ఆ అంశాన్ని ప్రత్యేక సుమోటోగా కాకుండా విచారణలో భాగంగానే స్వీకరిద్దామని న్యాయవాది ప్రభాకర్‌కు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.


పదే పదే ఆదేశిస్తున్నా అమలు చేయరా!?

కొవిడ్‌-19 చికిత్స, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, రోజువారీ బులెటిన్లకు సంబంధించి పదే పదే ఆదేశాలు ఇస్తున్నా ఎందుకు అమలు చేయలేకపోతున్నారని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. వైద్యులకు, పారామెడికల్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు ఇవ్వాలని, మృతదేహాలకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కోరుతూ విశ్రాంత ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌, తదితరులు దాఖలు చేసిన 16 ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ వ్యాజ్యంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి దాఖలు చేసిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. తాము ఇచ్చిన పలు ఆదేశాలను ఇంకా అమలు చేయడం లేదని తప్పుబట్టింది. ఇందుకు, సీఎస్‌ బదులిస్తూ.. కోర్టులపై తమకు అపారమైన గౌరవముందని, కోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పక పాటిస్తామని అన్నారు. పూర్తి ఆదేశాలు పాటించేందుకు రెండు వారాలు గడువు కావాలని కోరారు. తప్పక అమలు చేస్తామని హామీ ఇస్తున్నందున కోర్టు ఆదేశాలు పాటిస్తారని భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంటూ విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది. ఆరోజు కూడా సీఎస్‌ సహా సంబంధిత అధికారులు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.


ఇవి అమలు చేయాల్సిందే..

  • - కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం పాజిటివ్‌ వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన వారు సరైన జాగ్రత్తలు పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కరోనా సోకిన వారి వయసు కూడా బులెటిన్లలో ఉండాలి. కీలక డేటాకు సంబంధించిన బులెటిన్లను ఇంగ్లీషుతోపాటు ప్రాంతీయ భాషలో కూడా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని సీఎస్‌ ఈ కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ ఆంగ్లంలో మాత్రమే ఇస్తున్నారు. తెలుగులో కూడా ఇస్తే సమాచారం ఎక్కువ మందికి చేరుతుంది.

  • - పది లక్షల మంది ప్రజలకు ఎన్ని టెస్టులు చేశారో బులెటిన్లలో పొందుపరుస్తామని, కొవిడ్‌ ఆస్పత్రులన్నిట్లో డిస్‌ప్లే బోర్టులు ఏర్పాటు చేస్తామని సీఎస్‌ హామీ ఇచ్చారు. 2 వారాల్లో వీటిని అమలు చేయాలి.

  • - తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘హితం యాప్‌’ను పైలట్‌ ప్రాజెక్టుగా ఐదు జిల్లాల్లో అమలు చేస్తున్నామని సీఎస్‌ కోర్టుకు చెప్పారు. ‘‘దీనిద్వారా రోగులు డాక్టర్లతో అనుసంధానం అవుతారు. ఒక డాక్టర్‌ 50 మంది రోగులు, వారి కుటుంబ సభ్యుల బాగోగులు చూడవచ్చు. 140 మంది డాక్టర్లు సహా మొత్తం 173 మంది తమ పేర్లను ఇందులో రిజిస్టర్‌ చేసుకున్నారు. వీరి ద్వారా కొవిడ్‌-19 రోగులకు అవసరమైన కిట్లు, మందులు, తదితరాలు అందజేస్తామని అన్నారు. దాని ఫలితాలు కోర్టుకు చెప్పాలి

  • - కొవిడ్‌-19 కేర్‌ సెంటర్‌ పథకం కింద మేజర్‌ ఆస్పత్రుల్లో ఐసొలేషన్‌, సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని సీఎస్‌ చెప్పారు. 1-3 స్టార్‌ హోటల్స్‌లో తగినన్ని గదులు రోగులకు, వారి కుటుంబ సభ్యులకు కేటాయించాలని కోరామని, ఇప్పటి వరకు 867 గదులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వాటిలో 248 గదులు బుక్‌ అయ్యాయని, వీటి ద్వారా 85-87 శాతం మందికి హోం ఐసొలేషన్‌ సరిపోతుందని సీఎస్‌ వివరించారు. అయితే.. పేదలు హోటల్‌ గదుల్లో ఐసొలేషన్‌లో ఉండి ఆ ఖర్చులు భరించలేరని న్యాయవాది వసుధా నాగరాజ్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. హోటల్‌ ఖర్చులు భరించలేని వారి కోసం నగరాల్లో అందుబాటులో ఉన్న ఫంక్షన్‌ హాల్స్‌, కమ్యూనిటీ హాల్స్‌ వినియోగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. సంక్షేమ సంఘాలు నిర్మించిన హాళ్లను కూడా వినియోగించవచ్చని సూచించారు. ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా కమ్యూనిటీ/ఫంక్షన్‌/వెల్ఫేర్‌ అసోసియేషన్‌ హాళ్లను ఐసొలేషన్‌ కేంద్రాలుగా మార్చడానికి గల అవకాశాలను పరిశీలించాలి.

  • - నాచారంలోని ఈఎ్‌సఐ ఆస్పత్రిలో 50 పడకలు ఉన్నాయి. ఇప్పటి వరకు అక్కడ స్వల్ప లక్షణాలున్న వారినే చేర్చుకుంటున్నారు. పూర్తిస్థాయిలో పడకలు లేవు. అక్కడ పడకల సంఖ్యకు అనుగుణంగా ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించి మధ్యస్థంగా ఉన్న రోగులను చేర్చుకుని చికిత్స చేస్తామని సీఎస్‌ హామీ ఇవ్వాలి. 

  • - ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ తదితర పరీక్షలకు ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేయాల్సిన ఫీజులను వాటితో సంప్రదించి సర్కఆరు నిర్ణయించాలి. గరిష్ఠ ఫీజులపై 2 వారాల్లోగా జీవో జారీచేయాలి. దీనిపై ఏంచేశారో కోర్టుకు ఇచ్చే తదుపరి నివేదికలో చెప్పాలి.

  • - ఫిర్యాదులు స్వీకరించడానికి 24/7 పనిచేసే 85 లైన్లతో హెల్ప్‌ లైన్లు ఏర్పాటు చేశామని సీఎస్‌ చెప్పారు. ఇప్పటి వరకు వీటిద్వారా 726 ఫిర్యాదులు అందాయని, ఎక్కువ బిల్లులు వేశారని, పడకలు కేటాయించడానికి నిరాకరించారనే ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. తప్పు చేసిన ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని సీఎస్‌ హామీ ఇవ్వాలి. 

  • - కొవిడ్‌-19పై సుప్రీం కోర్టు మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని న్యాయవాది అర్జున్‌ కుమార్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మేరకు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రైవేటు ఆస్పత్రులను పర్యవేక్షించి, నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలి. 

  • - బీమా కంపెనీలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిందని న్యాయవాది సంఘీ కోర్టుకు తెలిపారు. వాటిని పరిగణనలోకి తీసుకుని రోగుల సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలను రూపొందించాలి. 

  • - గడిచిన నాలుగు రోజుల్లో నిర్మల్‌ జిల్లాలో పెద్ద ఎత్తున కొవిడ్‌ కేసులు నమోదైనా ఒకే ఒక కేసు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్లలో ప్రకటించిందని న్యాయవాది ఆరోపిస్తున్నారు. దీనిపై సీఎస్‌ దృష్టి సారించాలి. లెక్కల్లో తేడాలుంటే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతిలోనే అన్ని జిల్లాల కలెక్టర్లు బులెటిన్లు జారీ చేసేలా తగిన ఆదేశాలు ఇవ్వాలి.

  • - కోర్టును సంతృప్తి పర్చేందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, ఆక్సిజన్‌ అందక, సకాలంలో చికిత్స చేయక పోవడంతో పలువురి ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేయడానికి కేంద్రం అనుమతిచ్చినా రాష్ట్రంలో విస్తృతంగా పరీక్షలు చేయట్లేదని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ మూడో దశకు చేరుకుందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, వైద్య విద్య డైరెక్టర్‌ డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి పత్రికాముఖంగా ప్రకటించారని కోర్టు దృష్టికి తెచ్చారు. 3వ దశకు చేరిన ఢిల్లీలో ప్రతి పది లక్షల మందిలో 29 వేల మందికి; మహారాష్ట్రలో 24 వేలు, రాజస్థాన్‌లో 15 వేలు, ఏపీలో 24 వేల మందికి పరీక్షలు చేయగా.. తెలంగాణలో కేవలం 7,351 పరీక్షలు మాత్రమే చేశారని కోర్టుకు తెలిపారు. త్వరితగతిన ఫలితాలు వచ్చే ర్యాపిడ్‌ టెస్టులు పెంచాలని కోరారు. దీనిపై సీఎస్‌ వివరణ ఇస్తూ.. రాష్ట్రంలో 2 లక్షల ర్యాపిడ్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని, మరో నాలుగు లక్షల కిట్లకు ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు. ఈ కిట్ల ద్వారా 40 శాతం మాత్రమే ఫలితాలు వస్తున్నాయని మీడియా కథనాలు ప్రచురించిందని తెలిపారు. అందుకే రాజస్థాన్‌ ప్రభుత్వం ర్యాపిడ్‌ కిట్లను నిషేధించిందన్నారు. దీనిపై నిపుణులతో చర్చించి రాష్ట్రంలో వీటిని కొనసాగించాలా? ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు పెంచాలా అనే అంశంపై సీఎస్‌ నిర్ణయం తీసుకోవాలి.

కరోనా మరణాల విషయంలో ఆంధ్రజ్యోతి పత్రిక.. అద్భుతమైన పరిశోధనాత్మక వార్తలను ప్రచురించింది. ప్రజలకు వాస్తవాలు తెలిపిన ఆ పత్రికకు అభినందనలు. పత్రికకు మేము అండగా ఉంటాం. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలు, దొంగలెక్కలే. కరోనా విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా పద్ధతి మార్చుకోవడంలేదు.

- టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 


కరోనా వల్ల పేదోళ్లు పిట్టల్లా రాలుతున్న సందర్భంలో ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ఒక విశ్లేషణాత్మక కథనాన్ని రాస్తే.. ఆ పేదోళ్ల చావులను కప్పి పుచ్చేందుకు నమస్తే తెలంగాణ పత్రిక ఆంధ్ర, తెలంగాణ సెంటి మెంట్‌ను వాడుకుంటోంది. దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లడానికి అలిశెట్టి ప్రభాకర్‌, కాళోజీ, దాశరథి వంటి కవులు రాసిన గేయాలనూ వారి వ్యాపారం, దొంగతనాలను కవర్‌ చేసుకునేందుకు వాడుకున్నారు. నమస్తే తెలంగాణ పత్రిక.. తెలంగాణ గుండె చప్పుడు కాదు. అది కేసీఆర్‌ గుండె చప్పుడు. 

- కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి


కరోనా మరణాల్లో ఎలాంటి గోప్యత లేదు. సాధారణ మరణాలన్నీ కరోనా మరణాలు కావు. ప్రజల్లో నెలకొన్న భయం వల్ల కన్న పిల్లలు కూడా తల్లిదండ్రుల మృతదేహాలను తీసుకెళ్లడానికి ముందుకు రావడం లేదు. గుర్తు తెలియని వ్యక్తుల శవాలు, ఇతర కారణాలతో చనిపోయినప్పటికీ కుటుంబ సభ్యులు తీసుకెళ్లడానికి ఇష్టపడని మృతదేహాలకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ 

Updated Date - 2020-07-29T08:00:55+05:30 IST