అప్పులెలా తెచ్చారు?

ABN , First Publish Date - 2021-10-22T07:55:03+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎస్‌డీసీ) ద్వారా తీసుకున్న అప్పులు, జరిపిన లావాదేవీలకు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లన్నింటినీ తమ ముందుంచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు... ఈ విషయంలో కౌంటరు దాఖలు..

అప్పులెలా తెచ్చారు?

  • ఒప్పందాలు ఎలా చేసుకున్నారు?
  • ఎస్‌డీసీ పత్రాలను మా ముందుంచండి
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • కౌంటర్‌ వేయాలని కేంద్రానికి నోటీసులు
  • బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో గవర్నర్‌ పేరు ఎలా?
  • రుణాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు?
  • అడ్వకేట్‌ జనరల్‌కు చీఫ్‌ జస్టిస్‌ ప్రశ్నలు
  • గవర్నర్‌ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టారు
  • ఎస్‌డీసీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం
  • కేంద్రమే రాష్ట్రానికి లేఖ రాసింది: పిటిషనర్లు


అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎస్‌డీసీ) ద్వారా తీసుకున్న అప్పులు, జరిపిన లావాదేవీలకు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లన్నింటినీ తమ ముందుంచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు... ఈ విషయంలో కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. ఏపీఎ్‌సడీసీ ద్వారా రూ.25వేల కోట్ల రుణం పొందేందుకు... బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో వ్యక్తిగతంగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరు ఎలా చేరుస్తారని ప్రశ్నించింది.


ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైతే గవర్నర్‌కు ఆయా బ్యాంకులు నోటీసులు జారీ చేసి, కేసులు పెట్టేందుకు వీలు కల్పించడాన్ని తప్పుపట్టింది. రాజ్యాంగంలోని 361 అధికరణ ప్రకారం గవర్నర్‌పై సివిల్‌, క్రిమినల్‌ కేసులు నమోదు చేయడానికి వీల్లేకుండా రక్షణ ఉందని గుర్తు చేసింది. ఒప్పందం ద్వారా గవర్నర్‌ సార్వభౌమాధికారాన్ని  తొలగించడం సరికాదని పేర్కొంది. అలాగే... ప్రభుత్వ ఆదాయాన్ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు జమ చేయకుండా నేరుగా ఏపీఎ్‌సడీసీ ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించింది. నిధుల బదిలీకి సంబంధించి ఒరిజనల్‌ డాక్యుమెంట్లను కోర్టు ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశించింది. ఏపీఎ్‌సడీసీ ఏర్పాటు, అప్పులు తీసుకునే విధానంపై, ఇతర నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వై.బాలాజీ, బి.నళినీకుమార్‌, గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. ‘‘ఎవరైనా వ్యక్తి, సంస్థ గవర్నర్‌పై కేసులు నమోదు చేయకుండా రాజ్యాంగంలోని అధికరణ 361 రక్షణ కల్పిస్తుంది. కానీ ఏపీఎ్‌సడీసీ ద్వారా రూ.25వేల కోట్ల రుణం పొందేందుకు బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో గవర్నర్‌ సార్వభౌమాధికారాన్ని ప్రభుత్వం వదులుకుంది.


రుణాలు తిరిగి చెల్లించని పక్షంలో ఆర్థిక సంస్థలు గవర్నర్‌కు నోటీసులు జారీ చేసే అవకాశముంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను ఎస్‌బీఐ క్యాప్‌ ట్రస్టీకి తనఖా పెట్టారు. ఒప్పందంలో గవర్నర్‌ పేరును చేర్చడంపై ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో ఎలాంటి వివరణ ఇవ్వలేదు’’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జూలై 30వ తేదీన రాష్ట్రానికి రాసిన లేఖలో... రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా అప్పు తేవడం రాజ్యాంగంలోని 266(1) అధికరణకు వ్యతిరేకమని కేంద్రం తెలిపిందన్నారు. దీనికి ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ సమాధానమిస్తూ... ‘‘ప్రభుత్వానికి వచ్చే ఆదాయన్ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌లో జమ చేయకుండా నేరుగా ఏపీఎ్‌సడీసీకి జమ చేస్తున్నామన్న వాదనలో నిజం లేదు’’ అని తెలిపారు. ఎస్‌డీసీ ద్వారా రూ.25,000 కోట్ల భారీ మొత్తాన్ని అప్పుగా తేవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని కేంద్రమే లేఖ రాసినందున కేంద్రం, అప్పులిచ్చిన 8 బ్యాంకులు కౌంటర్‌ దాఖలు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న బెంచ్‌  కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను నవంబరు 15కి వాయిదా వేసింది.


ప్రజాప్రయోజనమే ముఖ్యం

పిటిషనర్లు ఎవరనేది కాదు.. తేల్చిచెప్పిన చీఫ్‌ జస్టిస్‌

ఎస్‌డీసీ ఏర్పాటు రాజ్యాంగ, చట్ట విరుద్ధం కాదని కేవలం పిటిషనర్‌ రాజకీయ దురుద్దేశాలతోనే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని ఏజీ తెలిపారు. ‘‘పిటిషనర్లు టీడీపీ వ్యక్తులు. రాజకీయ విమర్శల కోసమే ఈ పిల్‌ దాఖలు చేశారు. కొట్టివేయండి’’ అని విచారణ ప్రారంభంలోనే కోరారు. చీఫ్‌ జస్టిస్‌ స్పందిస్తూ.. ‘ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. వాటి పరమావధి.. ప్రజా ప్రయోజనమే. అవి ఎవరు దాఖలు చేశారు, పార్టీలు దాఖలు చేశాయా, ప్రతిపక్ష పార్టీలో సభ్యత్వం ఉన్న వ్యక్తులు దాఖలు చేశారా అనేవి అప్రస్తుతం’ అని స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా పిటిషన్లను స్వీకరించాలా? వద్దా? అనేది ధర్మాసనం నిర్ణయిస్తుందని, కాబట్టి అలాంటి విషయాలను ప్రస్తావించొద్దని అడ్వకేట్‌ జనరల్‌కు స్పష్టంగా చెప్పారు.


ఆ బాధ్యత ఎవరిది?

ప్రభుత్వం వివిధ మార్గాల్లో తెచ్చుకుంటున్న లక్షల కోట్ల అప్పులకు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తరఫున గ్యారెంటీ పత్రాలపై సంతకాలు చేస్తున్నది ఎవరో తెలుసా? ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న అధికారే ఈ సంతకాలు పెడుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా తెచ్చిన రూ.25,000 కోట్ల రుణానికి కూడా ఈయనే సంతకం పెట్టారు. ఇప్పుడేమో ఆ రుణానికి, గవర్నర్‌కూ సంబంధం లేదని హైకోర్టులో ఏజీ చెప్పారు. మరి... బ్యాంకులు ఆ అప్పులను ఎవరిని అడగాలి? సంతకం పెట్టిన అదనపు కార్యదర్శే ఆ అప్పులకు బాధ్యత వహిస్తారా ? లేక గ్యారంటీ ఒప్పందాలపై సంతకం పెట్టే బాధ్యతను ఆయనకు అప్పగించిన ముఖ్య కార్యదర్శి బాధ్యత వహిస్తారా? ప్రభుత్వ వాదన ప్రకారం... గవర్నర్‌కు ఉండే ‘సావరిన్‌ ఇమ్యూనిటీ’ అలాగే కొనసాగే పక్షంలో బ్యాంకులు ఇచ్చిన రూ.25,000 కోట్లు, వేర్వేరు కార్పొరేషన్ల నుంచి తెచ్చిన సుమారు లక్షల కోట్ల అప్పులకు ‘డిఫాల్ట్‌’ అయితే కోర్టు బోనెక్కాల్సింది వారిద్దరు, బడ్జెట్‌ సెక్రటరీయేనా?


ఆగమేఘాల మీద రూ.894 కోట్లు జమ

కాగా.. ప్రభుత్వం హడావుడిగా ఏపీఎస్‌డీసీ ఖాతాలో క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూజన్‌ పేరుతో రూ.894 కోట్లు డిపాజిట్‌ చేసింది. నిజానికి ఆ పద్దు కింద ఖాతాలో రూ.900 కోట్లు ఉండాలి. కానీ కేవలం రూ.5.47 కోట్లు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం ఆ నిధులన్నీ ఎంచక్కా వాడేసుకుంది. ఇప్పుడు హైకోర్టులో కేసులు పడి విచారణ మొదలవడంతో ఈ నెల 14వ తేదీన రూ.894 కోట్లను విజయవాడలోని ఎస్‌బీఐ కమర్షియల్‌ బ్రాంచ్‌లో డిపాజిట్‌ చేసింది.


సీజే ప్రశ్న... ఏజీ సమాధానం

సీజే: బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో వ్యక్తిగతంగా గవర్నర్‌ పేరును ఎలా చేరుస్తారు? రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు, బ్యాంకులకు మధ్య కుదిరిన ఒప్పందాలపై ఎవరు సంతకాలు పెట్టారు?

ఏజీ: అడిషనల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ సంతకం పెట్టారు.

సీజే: ఒప్పంద పత్రాలపై గవర్నర్‌ పేరు రాసి.. సంతకం ఆర్థిక శాఖ అడిషనల్‌ సెక్రటరీ ఎలా పెట్టారు?

ఏజీ: ప్రభుత్వ కార్యకలాపాలన్నీ గవర్నర్‌ పేరుమీదే జరుగుతాయి. అంతమాత్రాన గవర్నర్‌ తన సావరిన్‌ ఇమ్యూనిటీని కోల్పోయినట్టు కాదు. ఎస్‌డీసీ ఏర్పాటు చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించిన తర్వాత గవర్నర్‌ ఆమోదం తెలిపారు. గ్యారెంటీ ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వానికి, బ్యాంకులకు  మధ్య మాత్రమే జరిగింది. దీనివల్ల గవర్నర్‌ సార్వభౌమాధికారానికి భంగం కలిగినట్లు భావించకూడదు.

సీజే: మరి... బ్యాంకులు అప్పులు వసూలు చేసుకోవడం కోసం ఎవరిని అడగాలి? ఎవరిని బాధ్యులుగా చేస్తారు?

Updated Date - 2021-10-22T07:55:03+05:30 IST