‘వామనరావు’ హత్య కేసు దర్యాప్తుపై హైకోర్టు సంతృప్తి

ABN , First Publish Date - 2021-04-08T08:34:56+05:30 IST

న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, పీవీ నాగమణి హత్యలపై పోలీసుల దర్యాప్తు సంతృప్తికరంగానే జరుగుతోందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.

‘వామనరావు’ హత్య కేసు దర్యాప్తుపై హైకోర్టు సంతృప్తి

  • స్థాయీ నివేదిక ఇచ్చిన అధికారులు
  • 23లోగా మరో నివేదిక ఇవ్వాలని బెంచి ఆదేశం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, పీవీ నాగమణి హత్యలపై పోలీసుల దర్యాప్తు సంతృప్తికరంగానే జరుగుతోందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో దర్యాప్తు తీరును వివరిస్తూ పోలీసులు ఇచ్చిన  స్థాయీ నివేదికను పరిగణనలోకి తీసుకుంది. హత్యలపై సీబీఐ విచారణ కోరుతూ మృతుడి తండ్రి గట్టు కిషన్‌రావు దాఖలు చేసిన వ్యాజ్యంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ కేసులో అడ్వకేట్‌ జనరల్‌ స్థాయీ నివేదికను సమర్పించడంతోపాటు దర్యాప్తు తీరును వివరించారు. ఈ కేసులో ఏ5గా ఉన్న నిందితుడు ఊదరి లచ్చయ్య అలియాస్‌ లక్ష్మణ్‌ను మంథని కోర్టు మార్చి 18న పోలీసు కస్టడీకి ఇచ్చిందని, ఏ7గా ఉన్న నిందితుడు కాపు అనిల్‌ను మార్చి 17న పోలీసు కస్టడీకి ఇచ్చిందని తెలిపారు. వీరిద్దరిని మార్చి 18న పోలీసు కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వాంగ్మూలాల ఆధారంగా ఏ5 ఇంట్లో సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామన్నారు. ఏ6గా ఉన్న నిందితుడు వెల్ది వసంతరావు నుంచి రెండు సిమ్‌ కార్డులు, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకుని జ్యుడీషియల్‌ కస్టడీకి పంపామని తెలిపారు. 


మార్చి 28న ఒక సాక్షి నుంచి మొబైల్‌ ఫోన్‌, సిమ్‌ కార్డు స్వాధీనపర్చుకుని మార్చి 30న ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని, ఆయా సిమ్‌కార్డులు, మొబైల్‌ డేటాను వెలికితీసేందుకు కనీసం నాలుగు వారాలు పడుతుందని ఎఫ్‌ఎ్‌సఎల్‌ డైరెక్టర్‌ చెప్పారని అన్నారు.  32 మంది సాక్షులను గుర్తించామని, వీరిలో 26మంది వాంగ్మూలాలను మెజిస్ట్రేట్‌ ముందు నమోదు చేశామని, మిగిలిన సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాల్సి ఉందన్నారు. నిబంధనల ప్రకారం చార్జిషీటు 90 రోజుల్లో దాఖలు చేయాల్సి ఉంటుందని, దీనికి మే 17 వరకు గడువు ఉందని ఏజీ ధర్మాసనానికి వివరించారు. అధికారులు సమర్పించిన స్థాయీ నివేదికపై సంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం... ఏప్రిల్‌ 23లోగా మరో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 23కి వాయిదా వేసింది. ఈమేరకు సీజే హిమా కోహ్లీ, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ1గా కుంట శ్రీను, ఏ2గా సేవంతుల చిరంజీవి, ఏ3గా అక్కపాక కుమార్‌, ఏ4గా తులసగారి శ్రీనివాస్‌ అలియాస్‌ బిట్టు శ్రీనుల పోలీసు కస్టడీ ముగిసి జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-04-08T08:34:56+05:30 IST