హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్

ABN , First Publish Date - 2021-01-19T18:22:16+05:30 IST

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది.

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్

అమరావతి: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఏపీ రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ.. సీఐడీ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. కిలారు రాజేష్‌తో పాటు మరికొంత మంది..రాజధానిలో భూములు ముందుగానే కొనుగోలు చేశారని సీఐడీ కేసులు నమోదు చేసింది. రాజధానిలో ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసింది.


భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని..ప్రభుత్వం కక్షసాధిస్తోందని పేర్కొంటూ కిలారు రాజేష్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. భూములు అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరగలేదని పేర్కొంటూ.. దీనికి ఐపీసీ సెక్షన్లకు వర్తించవని హైకోర్టు స్పష్టం చేసింది.


ధర్మాసనమిచ్చిన తీర్పు ఇది:

ఈ కేసులో 85 పేజీల తీర్పునిచ్చింది... భూములు కొనుగోలు చేయటం భారత పౌరుడిగా రాజ్యాంగ, న్యాయపరమైన హక్కు భూములమ్మేవారు ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగా అమ్ముకున్నారు. ఈ అమ్మకాల్లో రిజిస్టర్డ్, సేల్ డీడ్స్ ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీలు. రిజిస్టర్డ్, సేల్ డీడ్స్ క్రిమినల్ నేరాల కిందకు రావు. వారిని ప్రాసిక్యూట్ చేసే అధికారం ఎవరికీ లేదు.ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీ కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి అవకతవకలకు పాల్పడితే మోపే నేరం. ఇన్ సైడర్ ట్రేడింగ్ కింద జరిగే నేరాలకు ఐపీసీలోని సెక్షన్లను వర్తింపచేయలేము. ఐపీసీలోని సెక్షన్ 420తో సహా ఏ సెక్షన్ కింద ఇన్ సైడర్ ట్రేడింగ్ కింద నేరంగా పరిగణించలేము. భారత శిక్షా స్పృతికి ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదం కొత్తది, అసలు సంబంధంలేనిది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో ఈ కేసులోని పిటిషనర్లను ప్రాసిక్యూట్ చేయాలని కోరటం సాధ్యమయ్యే పని కాదు. ఇన్ సైడర్ ట్రేడింగ్‌ను వర్తింపచేయటం న్యాయపరంగా నిలిచే ప్రక్రియకాదు. ఈ భూమి కొనుగోలు వల్ల ఎటువంటి లబ్ధి పొందుతున్నాననేది కొనుగోలుదారులు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఈ లావాదేవీలతో భూములు అమ్మిన వారికి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ఈ లావాదేవీల్లో ఎటువంటి నేరపూరితమైన స్వభావం కూడా లేదు. ఈ కేసులో ఐపీసీలోని సెక్షన్ 420, 406, 409, 120బి కింద నేరాలను పరిగణనలోకి తీసుకోలేము. ఈ సెక్షన్ల కింద కేసులు మోపటం న్యాయ సమ్మతంకాదు. అందుకనే ఎఫ్ఐఆర్‌ను కొట్టివేస్తుస్తాం.’’ అని హైకోర్ట్ పేర్కొంది. 

Updated Date - 2021-01-19T18:22:16+05:30 IST