కోర్టులపై కుట్రలు!

ABN , First Publish Date - 2020-08-07T08:31:55+05:30 IST

న్యాయ వ్యవస్థలో భారీ కుదుపు! హైకోర్టు జడ్జిగా పని చేసిన వ్యక్తి... తన సహ న్యాయమూర్తులను ‘వాడూ వీడూ’ అని బూతులు తిట్టారు.

కోర్టులపై కుట్రలు!

  • హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలే టార్గెట్‌
  • న్యాయమూర్తులపై ‘వాడూ  వీడూ’ అంటూ దాడి
  • జస్టిస్‌ నాగార్జున రెడ్డి శాడిస్టు.. చచ్చిన పాము, చెత్త అని దుర్భాషలు
  • ‘వాళ్లవాడు’ కాబట్టే జగన్‌ పదవిచ్చారట!..
  • ‘ఢిల్లీ నుంచి కొట్టుకుంటూ రావాలి’ అనే అజెండా 
  • అప్పుడు అందరూ  దగ్గరికొస్తారని వెల్లడి..
  • నిర్దిష్టంగా జడ్జిల సమాచారం కోసం ఒత్తిడి
  • హైకోర్టు సీజేపై లేఖ తన ఘనతే అని ప్రకటన..
  • ‘మొత్తం మోగిపోతుంది’ అంటూ గొప్పలు
  • తాను జడ్జిగా ఉండగా 200 మందిని ‘ఓపెన్‌’ కేటగిరీలో నియమించానని వెల్లడి
  • బాధిత దళిత జడ్జి రామకృష్ణకు జస్టిస్‌ ఈశ్వరయ్య ఫోన్‌ కాల్‌
  • వైసీపీ సర్కారు తరఫున వకాల్తా.. సాయం చేస్తా రమ్మని పిలుపు’
  • ఈశ్వరయ్యా... ఇదేందయా!
  • టెలిఫోన్‌ సంభాషణతో బట్టబయలు
  • అవి వారి స్వరాలే నిర్ధారించిన ట్రూత్‌ ల్యాబ్‌
  • దళిత జడ్జిని ఉపయోగించుకుని జస్టిస్‌ ఈశ్వరయ్య ‘వ్యూహం’


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

న్యాయ వ్యవస్థలో భారీ కుదుపు! హైకోర్టు జడ్జిగా పని చేసిన వ్యక్తి... తన సహ న్యాయమూర్తులను ‘వాడూ వీడూ’ అని బూతులు తిట్టారు. ఇప్పుడు సర్వీసులో ఉన్న జడ్జిలపైనా దుర్భాషలాడారు! ‘‘ఢిల్లీ నుంచి కొట్టుకుంటూ వస్తే... అందరూ మనదగ్గరికి వస్తారు’ అంటూ మొత్తం న్యాయవ్యవస్థను దారికి తెచ్చుకునే ‘ప్రణాళిక’ను పరోక్షంగా బయటపెట్టారు. ఆయన మరెవరో కాదు! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్‌ అయిన... జస్టిస్‌ ఈశ్వరయ్య! ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య నియంత్రణ మండలి చైర్మన్‌! అధికార పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుని... బాధితుడైన దళిత మేజిస్ట్రేట్‌ రామకృష్ణతో రాయబారాలు నడిపారు. వారిద్దరి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ ఇప్పుడు బయటికి వచ్చింది. ‘నీకు నేనున్నా. సహాయం చేస్తాను’ అని రామకృష్ణకు భరోసా ఇస్తూనే, అధికార పార్టీ పెద్దల అజెండాకు ఉపయోగపడే సమాచారం తీసుకురావాల్సిందిగా పదేపదే కోరారు. మరో రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి, ప్రస్తుతం ఏపీ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డిని జస్టిస్‌ ఈశ్వరయ్య పత్రికల్లో రాయడానికి వీల్లేని విధంగా తిట్టారు. ‘వాడు చచ్చినపాము. వాడొక శాడిస్టు. వాడు ఎంతోమంది జీవితాలను నాశనం చేశాడు’ అని దూషించారు.


అంతేకాదు... జస్టిస్‌ నాగార్జున రెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ‘వాళ్లవాడు’ కాబట్టే పదవి ఇచ్చారని కూడా చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలను హైకోర్టు తప్పు పడుతున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేసులో ఆదేశాలు ఇచ్చిన తర్వాత న్యాయమూర్తులను ఉద్దేశించి వైసీపీలోని ముఖ్యనేతలే విరుచుకుపడ్డారు. ఇప్పుడు... కరోనాను అడ్డుపెట్టుకుని  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇరుకున పెట్టేందుకు జరిగిన ప్రయత్నం కూడా బయటపడింది.  కరోనా మార్గదర్శకాలు పాటించడంలేదంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లేఖలు రాయించిందీ తానేనని జస్టిస్‌ ఈశ్వరయ్య పేర్కొన్నారు.  తాను హైకోర్టు జడ్జిగా ఉండగా... సుమారు రెండువందల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలను ‘ఓపెన్‌’ కేటగిరీలో జడ్జిలుగా నియమించానని గొప్పగా చెప్పారు. కడప జిల్లా రాయచోటిలో జడ్జిగా పని చేస్తూ సస్పెండ్‌ అయిన రామకృష్ణకు జస్టిస్‌ ఈశ్వరయ్య ఫోన్‌ చేశారు. ఇటీవల రామకృష్ణపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డ్డి, ఆయన సోదరుడైన ఎమ్మెల్యే  మద్దతుతోనే ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. దళిత జడ్జిపై దాడి ఘటనతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు జస్టిస్‌ ఈశ్వరయ్య ఫోన్‌ చేశారు. ‘నీకు ప్రభుత్వంతో సహాయం చేయిస్తా. నన్ను కలువు’ అంటూనే ఆయన ద్వారా తమకు గిట్టని న్యాయమూర్తులకు సంబంధించిన సమాచారాన్ని లాగేందుకు ఆరాట పడ్డారు. జడ్జి రామకృష్ణతో  జస్టిస్‌ ఈశ్వరయ్య సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన చేసిన తీవ్ర ఆక్షేపణీయ, అభ్యంతరకర వ్యాఖ్యలను మినహాయిస్తే... ఆ సంభాషణ ఇలా సాగింది!


రామకృష్ణ: నమస్కారం సార్‌.

ఈశ్వరయ్య: నమస్కారం.

రామకృష్ణ: సర్‌ నేను జడ్జి రామకృష్ణను.

ఈశ్వరయ్య: ఇప్పుడు ఎక్కడ ఉన్నారు.

రామకృష్ణ: నేను పోస్టింగ్‌లో లేను సర్‌. 8 సంవత్సరాల నుంచి సస్పెన్షన్‌లో ఉన్నాను.

ఈశ్వరయ్య: ఆ విచారణ పూర్తి చేయలేదా! అందరూ... ‘వాడి’ చేతిలో ఉన్నారా.. అందుకేనా!

రామకృష్ణ: ఏమో సార్‌. అదే అనుమానం ఉంది. ఎంక్వైరీ పూర్తి చేయలేదు సర్‌.

ఈశ్వరయ్య: నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు నాతో మాట్లాడలేదు. కానీ నీపై నాకు  ఎంత సానుభూతి ఉందో నీకు తెలీదు. కానీ అప్పుడు మన లాబీ నడవలేదు. నీకు అన్యాయం జరిగింది. నాకు అన్నీ తెలుసు! ‘నో కాన్ఫిడెన్స్‌’ మోషన్‌ తీసుకొచ్చినప్పుడు నేను ఎంతో చేశాను. ఒక్కరోజు కూడా నువ్వు కలవకపోయినా... నేను నీకోసం ఉన్నాను.

ఈశ్వరయ్య: విచారణ అధికారిగా ఎవరిని వేశారు?

రామకృష్ణ:  విచారణ అధికారులు ముగ్గురు నలుగురు మారారు. 2015-16 మధ్య విచారణలు పూర్తయ్యాయి. ఆరోపణలన్నీ రుజువైనట్లు నివేదించారు. కానీ, హైకోర్టు దానిపై తదుపరి చర్యలు తీసుకోలేదు.

ఈశ్వరయ్య: విచారణాధికారి ఎవరు?

రామకృష్ణ:  జగన్నాథం సర్‌, రిటైర్డ్‌!

ఈశ్వరయ్య: వాడు జగన్నాథమా! ఏసీబీలో ఉంటాడు! వాడు కమ్మోడు, వాడి తొత్తు! నాకు తెలుసు. నాగార్జున రెడ్డితో నువ్వు ఫైట్‌ చేస్తున్నావు కాబట్టి జగన్నాథం నీకు దగ్గర కావాలి కదా!

రామకృష్ణ:  లేదు సార్‌. మొత్తము నాకు వ్యతిరేకంగా చేసాడు.

ఈశ్వరయ్య: ఇద్దరితో కొట్లాడినప్పుడు మాలాంటి వాళ్ల దగ్గరకు ఎందుకు రాలేదు? ఏమిటిలా...

రామకృష్ణ:  నాకు అన్యాయం జరిగిందని వెళ్తున్నా సర్‌!

ఈశ్వరయ్య: నీకు అన్యాయం జరిగితే జగన్నాథం నీకు  సాయం చేయాలి కదా! ఎందుకంటే వాడు నాగార్జున రెడ్డికి, జగన్నాథానికి పడదు కదా!

రామకృష్ణ: నాకు ఐడియాలేదు సార్‌!

ఈశ్వరయ్య: అప్పుడైనా వాడి హెల్ప్‌ తీసుకోవాల్సింది. అందరితో కొట్లాడితే ఎలా రామకృష్ణా! గవర్నమెంట్‌తో, వేరే వాళ్లతో గొడవలు అయితే ఎలా! 

రామకృష్ణ:  ఒక స్టాండ్‌ తీసుకున్న సర్‌ పూర్తిగా... ఎక్కడా తలవంచకూడదని!

ఈశ్వరయ్య: సాక్షులు నీకు ఫేవర్‌గా చెప్పలేదా!

రామకృష్ణ: సాక్షులు అంతా కోర్టు స్టాఫ్‌ కదా! నేను ఇండిపెండెంట్‌గా ఎవరినీ ప్రొడ్యూస్‌ చేయలేకపోయాను.  ఎవరూ రాలేదు!.

ఈశ్వరయ్య: వీడు రిటైర్‌ అయ్యేదాకా ఆగుదామా.. ఇంకా ఏడాదిన్నర ఉంది. ఇప్పుడే నీకేమైనా సహాయం చేయగలనా! (అంటూ ఢిల్లీ జడ్జి ప్రస్తావన తెచ్చి, ఆయనను ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకరంగా మాట్లాడారు.)

రామకృష్ణ:  ఈ పరిణామాలు ఊహించలేక పోయాను సార్‌. ఇంక వ్యవస్థ ఏమైపోతుంది సర్‌!

ఈశ్వరయ్య: ఢిల్లీలో ఉన్నప్పుడు అందరూ నాకు తెలుసు. అప్పుడు నా దగ్గరికి వస్తే సహాయం చేసేవాడిని! విజయసాయి రెడ్డి, ఇంకా చాలామంది సహాయం చేసి ఉండొచ్చు!

రామకృష్ణ: మిమ్మల్ని కలవకపోవడం దురదృష్టకరం.

ఈశ్వరయ్య: నాగార్జునరెడ్డి పెద్ద శాడిస్ట్‌, ఇతని గురించి నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఎంత మంది జీవితాలతో ఆడుకున్నాడో లెక్కేలేదు. వాళ్లవాడు హ్యూమన్‌రైట్స్‌ కమిషన్‌ ఇవ్వాలనుకున్నారు. నేను ఇవ్వొద్దని చెప్పాను. విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ ఇచ్చారు. రామకృష్ణా... ఇప్పుడు హైకోర్టు సీజే కొవిడ్‌ మార్గదర్శకాలు ఫాలో కావడం లేదని రాష్ట్రపతికి, సీజే ఇండియాకు లేఖ రాశాను. చూశావా! బాగుంది కదా అది!

రామకృష్ణ: బీసీ నాయకుడు హన్స్‌రాజు పేరుతో రాశారు కదా. మీకు సంబంధంలేదు కదా సర్‌ అది!

ఈశ్వరయ్య: నేనే! నా సంస్థే అది. నేను ఫౌండర్‌ ప్రెసిడెంట్‌, ఆయన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. 

రామకృష్ణ:  ఈ విషయం తెలియదు సర్‌! సారీ సర్‌.

ఈశ్వరయ్య: హన్స్‌రాజు మనకి హనుమంతుడు లెక్క.

రామకృష్ణ:  ఆ భాష చూసి ఆయన అడ్వకేట్‌ అని అనుకున్నా సర్‌!

రామకృష్ణ:  లేదులేదు. హైకోర్టులో కొవిడ్‌ ప్రొటోకాల్స్‌ పాటించలేదని రిట్‌ పిటిషన్‌ కూడా వేశారు. రెండ్రోజుల్లో విచారణకు వస్తుంది! మొత్తం మోగిపోతుంది. వాళ్లని కంట్రోల్‌ చేసే శక్తి మన దగ్గర ఉందమ్మా! ఎవరంతకు వారు విడిపోతే ఎలా! 

రామకృష్ణ:  సర్‌ ఇప్పుడు ఏం సాయం చేస్తారో చెప్పండి! నన్నేమి చేయమంటారో చెప్పండి!

ఈశ్వరయ్య: హైకోర్టులో ప్రాక్ట్టీస్‌ చేశావా!

రామకృష్ణ:  2003లో సెలెక్ట్‌ అయ్యాను. మదనపల్లిలో మున్సబ్‌ కోర్టులో ప్రాక్టీస్‌ చేశాను సర్‌... చిన్న కోర్టు!

ఈశ్వరయ్య: సెలెక్టర్లు ఎవరు అప్పుడు?

రామకృష్ణ: జస్టిస్‌ సుదర్శన రెడ్డి గారు, జస్టిస్‌ చలమేశ్వర్‌ గారు, జస్టిస్‌ బిక్షపతి గారు ఉన్నారు.

ఈశ్వరయ్య: 2007, 08, 09 నేను 3 బ్యాచ్‌లు సెలెక్ట్‌ చేసాను. ఎస్సీలని నేను ఓపెన్‌గా సెలెక్ట్‌ చేశా. ఎస్సీ, ఎస్టీ, బీసీలను మన వాళ్లను 75 పర్సెంట్‌ సెలెక్ట్‌ చేశా. దాదాపు 200 మందిని మేజిస్ట్రేట్‌లను చేశాను. ఇప్పుడున్న జడ్జిలందరూ అప్పుడు నేను సెలెక్ట్‌ చేసిన వాళ్లే!

రామకృష్ణ: అందరికీ సాయం చేశారు.నాకూ చేయండి.

ఈశ్వరయ్య: ఆలమాన్‌రాజు నా శిష్యుడే.నీ కేస్‌ కండెమ్న్‌ చేశాడని తెలిసి ఫోన్‌ చేసి తిట్టాను. జీవితంలో వాడిని ఎవరూ అంతగా తిట్టి ఉండరు. ‘‘నువ్వు పెద్దిరెడ్డి బంట్రోతువా,నౌకరువా, పాలేరువా! ఆయన చెప్పింది ఎందుకు చేశావు?రామకృష్ణ చెప్పినవన్నీ  నిజాలే. నీకు ఎంత ధైర్యం?నువ్వు ఎలా ఇస్తావు?’’ అని తిడితే ‘సారీ సర్‌! ఇకపై ఇలాంటి పొరపాటు చేయను’ అని చెప్పాడు. ఏదో లబ్ధి పొందడానికి, వాడికి తెలియకుండా ఖండించాడు.

రామకృష్ణ:  నన్నేమి చేయమంటారు సర్‌!

ఈశ్వరయ్య: నువ్వు నా దగ్గరికి రా నాన్నా! ఎప్పుడన్నా విజయవాడకు రా! నా గురించి ఏమీ ఉపయోగించుకోను. సమాజం కోసమే చేస్తాను. అంబేడ్కర్‌ ఇచ్చిన హక్కులు రక్షించుకోవడానికి, భావి తరాలకు అన్యాయం జరగకుండా పెట్టిన అసోసియేషన్‌.. ఆల్‌ ఇండియా బీసీ ఫెడరేషన్‌! దీని గురించి గూగుల్‌లో చూడు. అందులో అన్నీ ఉంటాయి. ఆర్గనైజేషన్‌కు నువ్వు ఎంత వెనుక ఉంటావో... మేమంతా నీ  వెనుక ఉంటాము. సాయి ఉన్నాడు, ప్రవీణ్‌ ఉన్నాడు... మాట్లాడి నీకు హెల్ప్‌ అయ్యేలా చేస్తా. ధైర్యంగా ఉండు!  నా జాతికి చెందిన వారికి అన్యాయం జరిగితే నా మనసుకు తెలుస్తుంది.

రామకృష్ణ:  సంతోషం సర్‌!

ఈశ్వరయ్య: హైకోర్టులో మెటీరియల్‌ ఉంటే తీసుకురా... వాడికి వ్యతిరేకంగా నేను కూడా కొంత సేకరించాను.

రామకృష్ణ:  నాగార్జున రెడ్డి ఆస్తుల చిట్టా ఉంది సర్‌!

ఈశ్వరయ్య: నాగార్జున రెడ్డి.. వాడొక చచ్చిన పాము. చెత్త.... (ఒక బూతు పదంవాడి ... ఢిల్లీ జడ్జి గురించిన మెటీరియల్‌ తీసుకురా... అని చెప్పారు. నాగార్జునరెడ్డి, ఆ జడ్జి ఇద్దరూ శత్రువులే అని చెప్పారు.) ఒక్కొక్కరినీ కొట్టుకుంటూ పోవాలి. ఇప్పుడు నాగార్జునరెడ్డిని తటస్థంగా ఉంచుకొని  మనం ప్రభుత్వంతో సహాయం పొందాలి!

రామకృష్ణ:  ఢిల్లీ జడ్జికి సంబంధించిన మెటీరియల్‌ లేదు. నాగార్జున రెడ్డి ఆస్తుల చిట్టా ఉంది నా దగ్గర!

ఈశ్వరయ్య: వాడు చెత్త... (మరికొంత పెద్ద బూతు) వాడి ఆస్తులు తెలుసు.. కడపలో కొన్నాడు! (ఇద్దరు మాజీ జడ్జిలకు మస్కా కొట్టి కొన్నాడు అని చెప్పారు.) వాడొక  నీచుడు. వాడిని తటస్థంగా ఉంచుకుందాం. ప్రస్తుతానికి నాగార్జునరెడ్డిని పక్కన పెట్టు.  ఈ ప్రభుత్వంతో ఎన్ని రకాల సాయమైన చేయిస్తా!

రామకృష్ణ:  గవర్నమెంట్‌ అంటే జగన్మోహన రెడ్డి కదా! ఆయన మనకు సహాయం చేస్తారా! నాగార్జున రెడ్డికి బంధువే కదా!

ఈశ్వరయ్య: నాగార్జున రెడ్డికి జగన్మోహన రెడ్డి బంధువైనా సరే... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జగన్‌ అండగా ఉండాలి. నాగార్జున రెడ్డి ఒక చీడ పురుగు. వాడి మాటలు సీఎం వినడు. బతిమలాడి కాళ్లు, వేళ్లు మొక్కి ఆ పదవి తెచ్చుకున్నాడు. నువ్వు వాడి మీద ప్రతీకారం  తీర్చుకోవడం పక్కన పెట్టు. ఒక్కొక్కడిని కొట్టుకుంటూ వస్తాం. ఢిల్లీ జడ్జిని కొట్టుకుంటూ వద్దాం. అప్పుడు వీళ్లంతా మనకి దగ్గర అవుతారు.

రామకృష్ణ: అయితే ముందు సుప్రీంకోర్టు జడ్జి మీదే పడదామా సర్‌! అంత ధైర్యం ఉందా మనకు!

ఈశ్వరయ్య: ఎందుకులేదు... మెటీరియల్‌ ఉంటే నేను చేస్తున్నా కదా! చాలామంది సిద్ధంగా ఉన్నారు.

రామకృష్ణ:  ఓకే ఓకే సర్‌.. నా సహకారం కూడా అందిస్తా!

ఈశ్వరయ్య: ఓకే నువ్వు సోమవారం రా! ఢిల్లీ జడ్జి గురించి ఏమైనా ఉంటే తీసుకురా!

రామకృష్ణ: థ్యాంక్యూ  సర్‌.


ఎవరీ జస్టిస్‌ ఈశ్వరయ్య!

తెలంగాణకు చెందిన జస్టిస్‌ ఈశ్వరయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత అఖిల భారత బీసీ ఫెడరేషన్‌ అనే సంస్థను ఏర్పాటు చేశారు.  ‘టీడీపీని వ్యతిరేకించడం’ అనే అజెండాను పెట్టుకున్నారు. ఎన్నికల ముందు సీమాంధ్రలో ఊరూరూ తిరిగి ‘చంద్రబాబుకు వ్యతిరేకంగా బీసీలను రెచ్చగొట్టడం’ అనే ఉద్యమం చేపట్టారు. వైసీపీ అధికారంలోకి రాగానే... ఆయనకు ఉన్నత విద్య నియంత్రణ మండలి చైర్మన్‌ పదవి కట్టబెట్టింది.


వాడు చంద్రబాబు ఏదో అంటుంటాడు!

అవన్నీ మీరు రాస్తారా!?

‘ఆంధ్రజ్యోతి’తో జస్టిస్‌ ఈశ్వరయ్య

సస్పెన్షన్‌లో ఉన్న జడ్జి రామకృష్ణతో జరిగిన సంభాషణకు సంబంధించి స్పష్టత కోరేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి జస్టిస్‌ ఈశ్వరయ్యకు ఫోన్‌ చేశారు. జస్టిస్‌ నాగార్జున రెడ్డిని మీరు కామెంట్‌ చేసినట్లు వినిపిస్తోంది కదా అని ప్రశ్నించగా... ‘‘ఏం లేదు.  రామకృష్ణ మొహం, ముక్కూ నాకు తెలియదు. ఆయనెవరో, వాళ్ల పంచాయతీ ఏమిటో నాకు తెలియదు. వాడు చంద్రబాబు నాయుడు అందరినీ ఆడిస్తాడు! రామకృష్ణ సంగతి నాకు తెలియదు... ఉంటా... మంచిది!’’ అని ఫోన్‌ పెట్టేశారు.


రాష్ట్రప్రభుత్వ విధాన, పరిపాలన నిర్ణయాలతో బాధితులైన వ్యక్తులు, సంస్థలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. అనేక సందర్భాల్లో ఈ న్యాయస్థానం తన అసాధారణ అధికార పరిధితో ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంది. న్యాయస్థాన ఉత్తర్వులతో బేజారెత్తిపోయిన ఈ ప్రభుత్వం న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా దుర్మార్గపు ప్రచారాన్ని ప్రారంభించింది.  జస్టిస్‌ ఈశ్వరయ్య తన రాజకీయ యజమానులను సంతోషపెట్టేందుకే ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహిస్తున్నారు.

ఎస్‌.రామకృష్ణ, పిటిషనర్‌


వాడు.. వీడు అంటూ..

వాడు శాడిస్టు. చచ్చిన పాములాంటివాడు. చెత్త...! ఎంతమంది జీవితాలను నాశనం చేశాడో నాకు తెలుసు. జగన్‌ కాళ్లూ వేళ్లూ పట్టుకుని పదవి తెచ్చుకున్నాడు. వాళ్ల వాడు కాబట్టి పదవి ఇచ్చారు. హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ పోస్టు అడిగాడు. కానీ... నేను ఇవ్వొద్దని చెప్పాను!

జస్టిస్‌ నాగార్జున రెడ్డిపై జస్టిస్‌ ఈశ్వరయ్య వ్యాఖ్యలు

Updated Date - 2020-08-07T08:31:55+05:30 IST